బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 31, 2020 , 01:35:57

నేతల చూపు.. కో ఆప్షన్‌ వైపు..

నేతల చూపు.. కో ఆప్షన్‌ వైపు..

  •  n  టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి ఐదు పదవులు!
  • n  ఆశావహుల ముమ్మర యత్నాలు
  • n  ఎన్నికకు మరో నాలుగు రోజులే గడువు
  • n  సర్వత్రా ఆసక్తి

కార్పొరేషన్‌: కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల గడువు సమీపిస్తున్నది. మరో నాలుగురోజులే ఉండడంతో ఆశావహుల చూపు ఆ పదవులపై పడింది. టీఆర్‌ఎస్‌కు చెందిన వారికే ఈ పదవులు దక్కనుండడంతో ఆ పార్టీ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఐదు కో ఆప్షన్‌ స్థానాలు  ఉన్నాయి. కాగా ఈనెల 27న బల్దియా అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు ఆశావహులు మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఆగస్టు 3 వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉండగా, ఆఖరి రోజే నామినేషన్లు వేసే అవకాశాలు ఉన్నాయి. గురువారం వరకు ఒకే ఒక్క నామినేషన్‌ వచ్చింది. బల్దియాలో మొత్తం 60 మంది సభ్యులు ఉండగా టీఆర్‌ఎస్‌కు 41 సభ్యుల బలం ఉంది. చేతులు ఎత్తే విధానంలో ఎన్నికలు నిర్వహించనుండగా ఐదు స్థానాలు టీఆర్‌ఎస్‌కే దక్కనున్నాయి.  బీజేపీకి కేవలం 13 మంది సభ్యులే ఉండడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థులను నిలిపే అవకాశం కనిపించడంలేదు. ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 

ఎవరి ‘కో-ఆప్షన్‌'..

ఈ పదవులు టీఆర్‌ఎస్‌కు దక్కనుండగా మంత్రి గంగుల కమలాకర్‌, అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. కాగా ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్‌ కార్పొరేటర్లకు టికెట్లు ఇవ్వకుండా కో ఆప్షన్‌లో అవకాశం కల్పిస్తామన్న హామీ ఇచ్చినట్లు వినికిడి. ఈ మేరకు వారికే అవకాశం ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే విలీన గ్రామాలకు చెందిన వారి నుంచి ఎవరికైనా అవకాశాలు ఇస్తారా? లేక నగరంలోని మాజీలకే కట్టబెడతారా? అనే విషయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే మంత్రి గంగుల, మేయర్‌, ఇతర సీనియర్‌ నేతలు అభ్యర్థుల ఎంపిక విషయంపై సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నామినేషన్ల దాఖలు చివరి రోజున టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. logo