బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 31, 2020 , 01:36:10

‘స్మార్ట్‌సిటీ కాంట్రాక్టు’ సిబ్బందిపై కార్పొరేటర్‌ భర్త దాడి

‘స్మార్ట్‌సిటీ కాంట్రాక్టు’ సిబ్బందిపై కార్పొరేటర్‌ భర్త దాడి

  • n  రాంచంద్రాపూర్‌లో పనులు చేస్తుండగా అడ్డగింత 
  • n  ‘నాకు చెప్పకుండా చేస్తరా’ అంటూ దౌర్జన్యం  
  • n  బూతుపురాణం.. ఆపై ఇనుప రాడ్లతో దాడి 

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)

కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులు చేస్తున్న ఓ కాంట్రాక్ట్‌ కంపెనీ సిబ్బందిపై బీజేపీ కార్పొరేటర్‌ భర్త దాడిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు కంపెనీ కాంట్రాక్టర్‌ తనను కలువడకుండా ఎలా పనులు చేస్తున్నారంటూ.. దూషించడమే కాకుం డా.. పనులను అడ్డుకొని.. సదరు సిబ్బందిపై ఇనుప రాడ్లతో దాడిచేసిన ఘటన కలకలం రేపుతున్నది. ఈ మేరకు సదరు కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కార్పొరేటర్‌ భర్తతోపాటు మొత్తం నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. కాగా, ఈ విషయాన్ని జిల్లా యంత్రాగం సీరియస్‌గా తీసుకున్నది. రాత్రి పూట పనులు చేస్తున్న కంపెనీ సిబ్బందిపై దాడి చేసిన నేపథ్యంలో సదరు కార్పొరేటర్‌ను డిస్‌క్వాలిఫై చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది.

కార్పొరేటర్‌ భర్త దాడి.. నగరంలో స్మార్ట్‌సిటీ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే 

రాంచంద్రాపూర్‌-భగత్‌నగర్‌ వద్ద డ్రైనేజీ పనులు సాగుతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సదరు కంపెనీ రాత్రిపూట పనులు చేస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 29న రాత్రి కాంట్రాక్టు కంపెనీకి చెందిన పలువురు సిబ్బంది డ్రైనేజీ పనులు చేస్తుండగా 13వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త చొప్పరి వేణు తన అనుచరులతో కలిసి సదరు సిబ్బందిపై దాడి చేశాడు. తనకు తెలియకుండా పనులు ఎలా? చేస్తారంటూ బూతులు తిట్టడమేకాకుండా అక్కడ పనిచేస్తున్న వ్యక్తులపై ఇనుపరాడ్లతో దాడికి దిగారు. సదరు సిబ్బంది ఈ విషయాన్ని కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా.. సదరు కాంట్రాక్టర్‌ కార్పొరేటర్‌ భర్తతో మాట్లాడాడు. అతన్ని సైతం బూతులు తిట్టినట్లుగా తెలుస్తున్నది. కాగా, ఈ దాడిలో కొంతమందికి గాయాలయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్‌ తరఫున కంపెనీ ప్రతినిధి ఎల్లాపు రామసత్యనారాయణ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

డిస్‌క్వాలిఫై దిశగా.. 

స్మార్ట్‌సిటీ కాంట్రాక్టర్‌కు చెందిన సిబ్బందిపై కార్పొరేటర్‌ భర్త దాడి చేయడాన్ని జిల్లా యంత్రాగం సీరియస్‌గా తీసుకుంటున్నది. ఈ మేరకు పూర్తి వివరాలు సేకరించిన అధికారులు సంబంధిత ని వేదికను ప్రభుత్వానికి పంపినట్లుగా తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం.. కాంట్రాక్టర్‌, లేదా అతడి సిబ్బందిపై ఒక కార్పొరేటర్‌ లేదా వారి బంధులెవరైనా దాడిచేస్తే సదరు కార్పొరేటర్‌ను డిస్‌క్వాలిఫై చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నిబంధనను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు. మున్ముందు ఈ తరహా ఘటనలు జరగకుండా ఉండాలంటే.. ఈ సంఘటనపై చర్యలు తీవ్రంగానే ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, ఈ విషయం నుంచి సదరు వ్యక్తులను తప్పించేందుకు ఒక బీజేపీ నాయకుడు చివరి వరకు ప్రయత్నించినట్లుగా తెలుస్తున్నది. పోలీసులు కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అయితే దాడి ఘటన కలకలం రేపడంతో పోలీసులు ససేమిరా అన్నట్లు తెలుస్తున్నది. 

బీజేపీ కార్పొరేటర్‌ భర్తపై కేసు నమోదు.. 

కరీంనగర్‌లోని రాంచంద్రపూర్‌కాలనీలో సాగుతున్న స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనులను అడ్డుకున్నందుకు స్థానిక కార్పొరేటర్‌ భర్త, అతని అనుచరులపై ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని రాంచంద్రాపూర్‌కాలనీలో స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా ఎస్‌ఆర్‌ఆర్‌ కంపెనీ పనులను దక్కించుకున్నది. ఆ మేరకు బుధవారం రాత్రి పనులు చేస్తుండగా స్థానిక కార్పొరేటర్‌ భర్త చొప్పరి వేణు, అతని అనుచరులు న్యాలం ప్రసాద్‌, సతీశ్‌, నందికోట శ్రీనివాస్‌ పనులు చేస్తున్న కూలీలు, ఇంజినీర్లపై దాడి చేశారు. నాకు చెప్పకుండా పనులు ఎందుకు చేస్తున్నారని, తాను కార్పొరేటర్‌ భర్తను అని చెప్పి పనులను అడ్డుకున్నారు. అయినా, పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లపై సమీపంలో ఉన్న ఇనుప చువ్వలతో దాడి చేసి కొట్టారు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి ఎల్లాపు రామసత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 341, 290, 324, 506, రెడ్‌ విత్‌ 34 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్‌ సీఐ లక్ష్మీబాబు తెలిపారు.logo