శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 31, 2020 , 01:36:12

రావమ్మా.. మహాలక్ష్మీ

రావమ్మా.. మహాలక్ష్మీ

  • నేడు వరలక్ష్మీ వ్రతం 
  • lకరోనా నేపథ్యంలో  ఈ సారి ఇళ్లలోనే పూజలు

కరీంనగర్‌ కల్చరల్‌ /సిరిసిల్ల కల్చరల్‌: శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. దేవతల్లో అత్యధికంగా పూజలందుకునే దేవతామూర్తి లక్ష్మీదేవి. త్రిమూర్తుల్లో ధర్మ పరిరక్షకుడైన శ్రీ మహావిష్ణువు సతీమణి లక్ష్మీదేవి భక్తి సులభురాలు. ధనానికి మూలం లక్ష్మీదేవి. ధనమంటే డబ్బు ఒక్కటే కాదు ధైర్యం, శౌర్యం, విద్య, వివేకం, సంతానం, ధాన్యం ఇవన్నీ. వీటన్నింటినీ సమకూర్చే వరాల తల్లి లక్ష్మీదేవి. అలాంటి తల్లిని భక్తి శ్రద్ధలతో కొలిచి పూజిస్తే ఐష్టెశ్వర్యాలతో చల్లగా ఉంటామని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి జన్మించిందని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలంతా వరలక్ష్మీ వ్రతం చేసి ఆ తల్లిని ఆరాధిస్తారు. శ్రీ మహా విష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణమేనని అందుకు ఆయన భార్యగా లక్ష్మీదేవికి ఇది ఇష్టమైన నెల అని కూడా నమ్ముతారు. మంగళ, శుక్రవారాలు లక్ష్మీదేవికి అమిత ఇష్టమైన రోజులని పురాణాలు ప్రవచిస్తున్నాయి. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి ఆరాధనకు శ్రేష్ఠమైనవని పండితులు చెబుతారు. ప్రతి శుక్రవారం మూడు రకాల పిండి వంటలు చేసి లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షంతో పాటు మహిళలకు ముత్తయిదువ తనం కలకాలం నిలిచి ఉంటుందని భావిస్తున్నారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో ఇళ్లల్లో, గుళ్లల్లో సామూహికంగా జరుపుకునే పండుగ వరలక్ష్మీ వ్రతం. ఈ రోజు కుదరని వారు తర్వాత శుక్రవారం కూడా వ్రతాన్ని నోముకోవచ్చు.

వ్రత విధానం 

శ్రావణ శుక్రవారం సూర్యోదయానికి పూర్వమే మంగళ స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు వేసుకొని పూజకు నిర్దేశించిన ప్రత్యేక ద్వారంలో గోమయంతో అలికి ముగ్గులు పెడుతారు. ‘పద్మం’ ఆకారంలో పెట్టిన ముగ్గుపై పసుపు రాసి బొట్లు పెట్టిన పీటను ఉంచి, దానిపై కొత్త వస్త్రం పరుస్తారు. అందులో బియ్యం పోసి అలంకరించిన కలశాన్ని ఉంచుతారు. కొబ్బరికాయకు వరలక్ష్మీ రూపం ప్రతిబింబించేలా పసుపు ముద్దతో ఆకారాన్ని చేస్తారు. కలశం ముందు యథాశక్తి మేరకు బంగారు లేదా వెండి లక్ష్మీ రూపాన్ని ప్రతిష్ఠిస్తారు. అక్కడే తోరణాలు ఉంచి అక్షింతలు వేస్తారు. అనంతరం అమ్మవారిని పూజించి చారుమతి కథను పఠిస్తారు. ఇదంతా వేద బ్రాహ్మణుల సమక్షంలో ఆచరిస్తారు. లేదా గృహిణులే ఈ తంతును నిర్వహించుకుంటారు. ఆ తర్వాత తొమ్మిది రకాల పిండి వంటలను దేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు. కంకణం చేతికి కట్టుకుని, సాయంత్రం పేరంటాలకు వాయినం ఇస్తారు. గురుగ్రహ కటాక్షం కోసం ఈ వాయినంలో శనగలు కూడా ఇస్తారు. వ్రతం చేసిన వారు నైవేద్యాన్ని ఆరగిస్తారు. ఇంకేమీ తినరు. వ్రతం ముగిశాక బ్రాహ్మణుడిని పూజించి కుడుములు ఇతర సంభావనను వాయినంగా ఇస్తారు. తద్వారా ముత్తైదువలకు ఐదోతనం, సౌభాగ్యం, సంతానప్రాప్తి శుభాలు కలుగుతాయని నమ్మకం. 

ఈ సారి ఇండ్లలోనే..

కరోనా నేపథ్యంలో ఈసారి వరలక్ష్మీ వ్రతాలు సామూహికంగా నిర్వహించేందుకు పలువురు అర్చకులు, ఆలయాల నిర్వాహకులు నిరాకరించారు. ఎవరి ఇండ్లలో వారే వ్రతం జరుపుకోవాలని, వాయినాలు ఇచ్చేటప్పుడూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కరీంనగర్‌లోని చైతన్యపురి మహాశక్తి ఆలయం, జ్యోతినగర్‌ సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం లేదని, భక్తులెవరూ ఆలయాలకు రాకుండా, ఇండ్లలోనే వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు.


logo