గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jul 31, 2020 , 01:36:22

అందుబాటులోకి ఐదు రకాల సేవలు

అందుబాటులోకి ఐదు రకాల సేవలు

  • lకార్యాలయానికి వెళ్లకుండానే పనులు
  • lనెట్‌"ఇంటి’ నుంచే పొందే వీలు 
  • lఅందులోనే దరఖాస్తుల నుంచి లైసెన్స్‌ ఫీజుల వరకు చెల్లింపులు
  • lవినియోగించుకోవాలి : డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ 

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ)  దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రవాణా శాఖ కొత్త అధ్యాయానికి తెరలేపింది. కొత్తపుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ఆ శాఖ తాజాగా.. మరో వినూత్న పద్ధతిని తెరపైకి తెచ్చింది. యాప్‌ ద్వారా ఏకంగా ఐదు రకాల సేవలను ఇంటి నుంచే పొందేందుకు వీలు కల్పించడమే కాదు.. సదరు సేవలను ఈనెల 24 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. డూప్లికేట్‌ లెర్నింగ్‌ లైసెన్స్‌, డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ బ్యాడ్జి, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సరెండర్‌, స్మార్ట్‌ కార్డు పొందడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ హిస్టరీ షీట్‌ను ఇంటి నుంచే పొందేందుకు వీలు కల్పించింది. దేశంలోనే ఈ తరహా సేవలను అందిస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుంది. 

24 నుంచే సేవలు..

గతంలో డూప్లికేట్‌ లర్నింగ్‌ లైసెన్స్‌, లేదా డూప్లికేట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలంటే ముప్పు తిప్పలు పడాల్సి వచ్చేది. కచ్చితంగా సంబంధిత వ్యక్తులు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి వచ్చేది. ఆ మేరకు ఆర్టీఏ అధికారులు ఆన్‌లైన్‌లో ఒక తేదీ అలాట్‌మెంట్‌ చేస్తే.. ఆ సమయం ప్రకారం స్వయంగా వెళ్లి హాజరు కావాల్సి వచ్చేది. గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేది. స్లాట్‌ బుకింగ్‌లో ఇబ్బందులుంటే.. కొన్ని రోజుల పాటు సమయం పట్టేది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇంటి నుంచే పొందే ఐదు రకాల సేవలకు కచ్చితంగా రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధిత వ్యక్తులు వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని.. దరఖాస్తు నుంచి మొదలుకొని సంబంధిత లైసెన్స్‌ ఫీజుల వరకు అంతా ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. ఈ నెల 24 నుంచే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.  

దరఖాస్తు విధానం ఇలా..

ఐదు రకాల సేవలను వాహనదారులు పొందాలంటే.. మీ స్మార్ట్‌ ఫోన్‌లో మొదటగా ప్లే స్టోర్‌కు వెళ్లాలి. అందులో T-App Folioను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. FEST-RTA పై క్లిక్‌ చేయాలి. తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌, లర్నింగ్‌ లైసెన్స్‌ సర్వీస్‌కు సంబంధించిన వాటిపై క్లిక్‌ చేయాలి.

మీరు డ్రైవింగ్‌ లైసెన్స్‌ క్లిక్‌ చేస్తే అందుకు సంబంధించిన సేవలు సెలక్ట్‌ చేసుకునే వీలుంటుంది. అలాగే లర్నింగ్‌ లైసెన్స్‌ సెలక్ట్‌ చేస్తే ఆ సర్వీసులు ఎంపిక చేసుకోవచ్చు. సెలక్ట్‌ చేసిన తర్వాత అందులో అడిగిన వివరాలను నమోదు చేయాలి. ఈ సమయంలో ప్రతి కాలాన్ని నిశితంగా చదువుకోవాలి. 

ఉదాహరణకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అయితే మీ పేరు, మీ తండ్రి పేరు, పుట్టిన తేదీ, జిల్లా, లైసెన్సింగ్‌ అథారిటీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన తర్వాత, ప్రొసీడ్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. 

అనంతరం ఫొటో ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మీ ఫొటో దిగేందుకు ఒక వృత్తాకారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ వృత్తాకారంలో ఆకు పచ్చరంగు వచ్చినప్పుడు ఫొటో క్లిక్‌ చేయాలి. ఫొటో నచ్చినట్లయితే సబ్మిట్‌ చేయవచ్చు. ఒక వేళ నచ్చకపోకతే.. తిరిగి రీ టేక్‌ (Retake) చేసి మళ్లీ ఫొటో దిగి సబ్మిట్‌ చేయవచ్చు. ఆ తర్వాత మన లైసెన్స్‌ వివరాలు, అడ్రస్‌, ఫొటో వెరిఫై చేసుకుని వెరిఫికేషన్‌ సక్సెస్‌ఫుల్‌ అని చూపిస్తుంది. 

ఇప్పుడు ప్రొసీడ్‌పై క్లిక్‌ చేయగా సిగ్నేచర్‌ అని వస్తుంది. దానిపై క్లిక్‌ చేసి మీ సిగ్నేచర్‌(సంతకం)ను చేసి సేవ్‌పై క్లిక్‌ చేయాలి. 

అనంతరం మీరు కట్టాల్సిన ఫీజు వివరాలు కనబడుతాయి. ఇప్పుడు ‘ప్రొసీడ్‌ టూ పే’ పై క్లిక్‌ చేసి ఆన్‌లైన్‌ ద్వారా ఫీజు చెల్లించాలి.

మీ అప్లికేషన్‌ అయిపోయిన తదుపరి మీకు ఈ-మెయిల్‌, మేసేజ్‌ రూపంలో వస్తుంది. అందులో లింక్‌ క్లిక్‌ చేసి మీ డాక్యుమెంట్‌ను సేవ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాలి. లైసెన్స్‌ కార్డులను కార్డు పోస్టులో పంపిస్తారు.

సేవలను వినియోగించుకోవాలి.. 

వినియోగదారులకు విస్తృత సౌకర్యాలను కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఐదు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ పనులు అవసరమైన వారు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే సేవలన్నీ అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని ఎక్కడినుంచైనా ఈ సేవలను పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే వివరాలు నమోదు చేసే సమయంలో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. దీని వల్ల సంబంధిత వినియోగదారులకు చాలా మేరకు ఇబ్బందులు తప్పుతాయి. 

- డాక్టర్‌ పుప్పాల శ్రీనివాస్‌, ఉప రవాణా కమిషనర్‌


logo