శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 29, 2020 , 00:22:56

పకడ్బందీగా సాగు సర్వే

పకడ్బందీగా సాగు సర్వే

ఏ సీజన్‌లో ఎంత విస్తీర్ణం సాగు అవుతున్నది? ఎరువులు ఎంత మేర అవసరం? ఏయే పంటలు పండుతున్నయి. ఎంత దిగుబడి వస్తున్నది? కొనుగోళ్లకు ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి? ఇలాంటివన్నీ ఇప్పటి వరకు కేవలం అంచనాతో మాత్రమే నడిపిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత ప్రతి పంటపై వాస్తవ లెక్కలు తీస్తున్నారు. ఇన్‌పుట్స్‌ అవసరాలే కాకుండా, మార్కెటింగ్‌ ప్లానింగ్‌ సరైన విధానంలో రూపొందించేందుకు అన్ని పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో సాగు సర్వే కొనసాగుతుండగా, ఇప్పటి వరకు అధికారులు 3,85,500 ఎకరాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ : గతంలో సాగు సర్వేలు మొక్కుబడిగా సాగేవి. అవి ఎందుకూ ఉపయోగపడేవి కావు. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక నమూనాలో వ్యవసాయశాఖ పక్కాగా పంటల నమోదు నిర్వహిస్తున్నది. గతంలో రెవెన్యూ శాఖ పంటల నమోదు చేసి పన్నులు విధించేందుకు మాత్రమే వినియోగించుకునేది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు నిర్వహించే సర్వేకు ప్రభుత్వం ప్రత్యేక స్థానం ఇస్తున్నది. ప్రాజెక్టుల నీళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో సాగయ్యే ప్రతి పంట వివరాలను వ్యవసాయ శాఖ సేకరిస్తున్నది. మార్కెటింగ్‌ ప్రణాళికతోపాటు ఎరువులు, విత్తనాల దిగుమతులు, ఎగుమతులు, వాల్యూ అడిషన్‌ ప్రాసెసింగ్‌ వంటి ముఖ్య అవసరాలకు ఈ సాగు సర్వే దోహద పడుతుందని యంత్రాంగం అంచనా వేస్తున్నది

 ఆన్‌లైన్‌లో ప్రతి పంట వివరాలు..

వ్యవసాయ విస్తరణ అధికారులు గత రెండు సీజన్లుగా ఆన్‌లైన్‌లో సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే, గత సర్వేకు ఇప్పుడు నిర్వహిస్తున్న సర్వేకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వానకాలం సీజన్‌లో సర్వే నిర్వహించేందుకు 17 పేజీల మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సారి రైతులు సాగు చేసిన పచ్చి రొట్ట సాగు మొదలుకుని అపరాలు, సీడ్‌ ప్రొడక్షన్‌తోపాటు ఇతర అంతర పంటలు కూడా నమోదు చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేసే వారి వివరాలు కూడా సేకరిస్తున్నారు. ప్రతి పంట వాటి రకాలు, సేద్య సదుపాయం వివరాలు, ఉద్యాన పంటలైతే చెట్ల వయసు, వాటి సంఖ్య రైతు వారీగా సేకరిస్తున్నారు. ప్రతి సర్వే నంబర్‌లో ఎంత సాగు భూమి ఉంది? అది ఏ రైతుకు సంబంధించినది? అందులో ఏయే రకాల పంటలు సాగు చేస్తున్నారు? ఇలా సమగ్రమైన వివరాలను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు డిజిటల్‌ సంతకాలు జరిగిన సర్వే నంబర్లలో పంటల సర్వే చేపడుతున్నారు. డిజిటల్‌ సంతకాలు కాని సర్వే నంబర్లలో కూడా 11 కారణాల్లో ఏదో ఒకటి చూపుతూ వాటిలో సాగైన పంటల వివరాలను కూడా రికార్డు చేస్తున్నారు. ప్రతి రోజూ రైతుల క్షేత్రాల్లో పర్యటించి వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ పంటల వివరాలను సేకరించి, క్రాప్‌ బుకింగ్‌ పోర్టల్లో ఎంట్రీ చేస్తున్నారు. ఇలా చేసిన వెంటనే రైతుల మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సమాచారం అందుతుండగా రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటున్నారు. ఏదైనా కారణంతో తప్పులు దొర్లినా వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అధికారులు తప్పులు సరిచేసుకుంటున్నారు. ఈ నెల 31 వరకు సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు శరవేగంగా పంటల సర్వే చేస్తున్నారు.

 కరీంనగర్‌ జిల్లాలో 1,21,301 ఎకరాలు పూర్తి

కరీంనగర్‌ జిల్లాలో 3,40,132 ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రణాళికలు వేశారు. ఇందులో ఇప్పటి వరకు 2,01,209 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అంటే ప్రణాళికలో 59.2 శాతం పంటలు ఇప్పటి వరకు సాగైంది. ఇందులో పంటల వారీగా అధికారులు నిర్వహించిన సర్వేను పరిశీలిస్తే మంగళవారం నాటికి 64,274 మంది పట్టాదారులకు సంబంధించిన 1,21, 301.05 ఎకరాల్లో వివిధ పంటల వివరాలను నమోదు చేశారు. డీఏవో వాసిరెడ్డి శ్రీధర్‌ ప్రతి రోజు జిల్లాలో పర్యటిస్తూ పంటల నమోదును పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సైదాపూర్‌, చిగురుమామిడి మండలాల్లో పర్యటించారు. 

జగిత్యాలలో 60,089 ఎకరాలు 

జిల్లాలో ఇప్పటి వరకు 60,089 ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఈ వానకాలం జిల్లాలో 3 లక్షల 31 వేల 63 ఎకరాల్లో మొత్తం, ఇందులో అత్యధికంగా వరి 2 లక్షల 28 వేల 378 ఎకరాలు, పత్తి 38 వేల ఎకరాలు, ఇతర పంటలు 64 వేల 685 ఎకరాలు సాగు అంచనా వేశారు. 

పెద్దపల్లిలో 70 వేల ఎకరాలు

పెద్దపల్లి జిల్లాలో ఇప్పటివరకు 70 వేల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఈ వానకాలం జిల్లాలో 2 లక్షల 48 వేల 960 ఎకరాల్లో సాగు అంచనా వేయగా, ఇప్పటికే మండలాల వారీగా రైతులు ఏయే పంటలను పండించాలనే విషయమై వ్యవసాయ అధికారులు దిశానిర్దేశం చేశారు. పంటల సమగ్ర సర్వేను ఇప్పటికే జిల్లాలోని ఇద్దరు ఏడీఏలు, 14 మంది ఏవోలు, 54 మంది ఏఈవోలు 70 వేల ఎకరాల్లో పూర్తి చేశారు. మరో రెండు రోజుల్లో 55వేల ఎకరాల్లో పూర్తి చేసేందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నారు.

రాజన్న సిరిసిల్లలో 1,34,110 ఎకరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటివరకు 1,43,110 ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఈ సీజన్‌లో జిల్లాలో 2 లక్షల 50 వేల 205 ఎకరాల్లో సాగు అంచనా వేశారు. ఇక్కడ డీఏవో ఆధ్వర్యంలో పది మంది ఏవోలు, 57 మంది ఏఈవోలు సమగ్ర సర్వేచేపడుతున్నారు. 


logo