శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 28, 2020 , 02:27:53

చెల్పూరులో ఆసక్తిగొలుపుతున్న రెండు తటాకాలు

చెల్పూరులో ఆసక్తిగొలుపుతున్న రెండు తటాకాలు

  • కాకతీయ కాలంలో అద్భుత పరిజ్ఞానంతో నిర్మాణం
  • మొదట ఏది నిండినా రెండోదాంట్లోకి నీళ్లు
  • ఇక్కడ అనుసంధాన  కాలువే కీలకం
  • య్యి ఎకరాలపైనే ఆయకట్టు 

సాధారణంగా చెరువు నిండిందంటే మత్తడి దూకుతుంది. దిగువన ఉన్న మరో చెరువులోకో లేదా కుంటలోకో నీరు వెళ్తుంది. కానీ, హుజూరాబాద్‌ మండలం చెల్పూర్‌లోని పెద్ద, చిన్న చెరువులకు మాత్రం ఓ ప్రత్యేకత ఉన్నది. ఊరికి కుడి, ఎడమ వైపు ఉండి, స్థానిక వాగులు, వంకల ద్వారా జీవం పోసుకొనే ఈ జల భాండాగారాలలో ముందు ఏది నిండినా  మరోదానిలోకి నీరు ప్రవహిస్తుంది. ఈ రెండు నిండిన తర్వాత ఒకేసారి అలుగు దుంకడం ఆశ్చర్యపరుస్తున్నది. - హుజూరాబాద్‌

చెల్పూరులోని పెద్ద, చిన్న చెరువులను కాకతీయుల కాలంలో నిర్మించారు. అయితే గొలుసుకట్టు చెరువుల్లా కాకుండా ఊరికి రెండు వైపులా తవ్వించారు. గ్రామానికి కుడివైపున పెద్ద చెరువు, ఎడమ వైపున చిన్న చెరువు ఉంటుంది. ఇందులో ఏది నిండినా ఇంకోదాంట్లోకి నీరు చేరేలా బ్యాలెన్సింగ్‌ పద్ధతిన అద్భుత పరిజ్ఞానంతో అనుసంధాన కాలువ నిర్మాణమైంది. దాదాపు అరకిలోమీటరు పొడవు దాకా ఉంటుంది. ఇది జంట చెరువులకు గుండెకాయలాంటిది. వర్షాలు పడినప్పుడు ముందుగా ఏ చెరువు కొద్దిగా నిండినా కాలువలోకి నీరు వెళ్తుంది. అక్కడి నుంచి మరో చెరువులోకి చేరుతుంది. ఇలా ఒక చెరువు మరో చెరువును నింపుకుంటుంది. పూర్తిగా నిండిన తర్వాతే రెండూ ఒకేసారి మత్తడి దూకుతాయి.

 వెయ్యి ఎకరాలకు నీరు..

పెద్ద చెరువు 289 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. దీని కింద దాదాపు 535 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రధానంగా చిలుక వాగు ద్వారా వచ్చే వరదతోనే నిండుతుంది. దీనికి రెండు తూములుండగా కొంచెం అటు ఇటుగా రెండింటికీ సమాన పారకం ఉంటుంది. ఇక చిన్న చెరువు విస్తీర్ణం 289 ఎకరాలు. 495 ఎకరాల ఆయకట్టు ఉన్నది. పై నుంచి వచ్చే చిన్నచిన్న ఒర్రెల వరదతో మాత్రమే నిండుతుంది. దీనికి రెండు తూములుండగా, తూర్పు వైపున దాంతో 290 ఎకరాలు, పశ్చిమ తూము ద్వారా 205 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ రెండూ ఒక్కసారి నిండితే రెండు పసళ్ల పంటలకు ఢోకా ఉండదు.

మిషన్‌కాకతీయతో పునర్జీవం.. 

గత సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో అధ్వానంగా మారిన జంట చెరువులకు రాష్ట్ర సర్కారు పూర్వవైభవం తీసుకువచ్చింది. మిషన్‌ కాకతీయ కింద ఒక్కో చెరువుకు కోటి నిధులు వెచ్చించి, పునరుద్ధరించింది. ప్రధానంగా కట్ట ఎత్తు, వెడల్పు పెంచి బలోపేతం చేయడంతోపాటు పూడిక మట్టి తొలగించారు అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న మత్తడి, తూములకు మరమ్మతులు చేపట్టారు. 

చిత్రమనిపిస్తది..

మా ఊళ్లోని రెండు చెరువులను చూస్తే చిత్రమనిపిస్తది. ఒకటి నిండితే అది మత్తడి దూకకముందే కాలువల నీళ్లచ్చి ఇంకోటి నిండుతది. రెండు నిండినంకనే మత్తళ్లుదూకుతయి. ఇట్లాంటి చెరువును ఎక్కడ చూడలె. నాకు చిన్న చెరువు కింద మూడెకరాల భూమి ఉన్నది. మొత్తం వరే ఏస్త. పంట పారకానికి చెరువు నీళ్లే ఆధారం. చెరువు నిండితే రెండు పసళ్లు పండుతయి. 

- కాల్వ రవీందర్‌ రెడ్డి, రైతు

నిండితే ఢోకా ఉండది.. 

చెరువులు నిండితే మాకు ఢోకా ఉండది. రెండు పసళ్లకు నీళ్లందుతయి. భూగర్భ జలాలు మస్తు పెరుగుతయి. ఈ చెరువు కిందనే కాకుండా చుట్టుపక్క బావులల్ల నీళ్లు మీదికత్తయి. మాకు చిన్న చెరువు కింద రెండున్నర ఎకరాల భూమి ఉంది. 

- పంజాల రాజు, రైతుlogo