సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 28, 2020 , 02:28:18

సేవలకు సలాం..

సేవలకు సలాం..

  •  కరోనా వారియర్స్‌..    వైద్యులు, సిబ్బంది
  • విపత్కర పరిస్థితుల్లోనూ విధులు
  •  బాధితుల ఇండ్లకు వెళ్లి సేవలు
  •  పలువురి ప్రశంసలు 

 కంటికి కనిపించని మహమ్మారి.. కరోనా వైరస్‌ అనగానే ఆమడదూరం పారిపోయే రోజులివి. ఫలానా ప్రాంతంలో పాజిటివ్‌ వచ్చిందనగానే ఆ దరిదాపుల్లోకి వెళ్లేందుకు జంకుతున్న కాలమిది. కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తూ కరోనా వారియర్స్‌గా నిలుస్తున్నారు వైద్యులు, సిబ్బంది. ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేయడమే కాదు హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితుల వద్దకు వెళ్లి మరీ సేవలందిస్తూ ఆపత్కాలంలో ఆపద్బాంధవుల్లా.. ఆరోగ్య రక్షకుల్లా నిలుస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు.           

        - హుజూరాబాద్‌టౌన్‌


 కరోనా వైరస్‌ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది. మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిణమిస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు హడలెత్తిపోతుండగా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యులు, వైద్య సిబ్బంది సహా పారిశుద్ధ్య, మున్సిపల్‌, గ్రామపంచాయతీల సిబ్బంది, వలంటీర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా పని చేస్తూ కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. 

 కేసులు పైపైకి..

కరోనా తీవ్రత గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది. తొలి రోజుల్లో ఆంక్షలను కఠినంగా అమలు చేసి ప్రజలకు నిత్యావసర సరుకులు, నగదు పంపిణీ చేసింది. తర్వాత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ఆంక్షలు సడలించినా కట్టడి పాటించని వారితో వైరస్‌ విజృంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఫలితంగా ఇన్నాళ్లూ రోజుకు ఒకటో రెండో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు పదుల సంఖ్యకు చేరాల్సిన దుస్థితి వచ్చింది. 

 ప్రాణాలు పణంగా పెట్టి విధులు..

కరోనా కేసులు పెరుగుతున్నా వైద్యులు, వైద్య సిబ్బందితోపాటు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, వలంటీర్లు విశేష సేవలందిస్తున్నారు. కేసు తీవ్రత ఉన్న వారిని కరీంనగర్‌, వరంగల్‌, ఇంకా తీవ్రంగా ఉంటే హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. తక్కువగా ఉంటే మాత్రం హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే గ్రామాలకు కరోనా విస్తరించిన నేపథ్యంలో ఆయా సమీప పీహెచ్‌సీల వైద్యులు, పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న బాధితుల ఇండ్లకు వెళ్లి మరీ సేవలందిస్తూ సేవానిరతిని చాటుకుంటున్నారు. 

సెల్ఫ్‌ లాక్‌డౌన్‌..

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ప్రజలు, వ్యాపారులు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. అవసరమైతేనే బయటకు వెళ్తుండగా, దుకాణాలు నిర్ణీత సమయంలో మాత్రమే తెరుస్తున్నారు. కొన్నిచోట్ల ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మరికొన్ని చోట్ల సాయంత్రం 6 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచి, ఆ తర్వాత మూసివేస్తున్నారు. పలుచోట్ల ప్రజలు  స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.

అవసరమైతేనే బయటకు రావాలి

కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ప్రజలు అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. సాయంత్రం నుంచే ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నాం. పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు పాటించాలని వ్యాపారులకు, వాహనచోదకులకూ అవగాహన కల్పిస్తున్నాం. కరోనా కట్టడికి ప్రజలతో పాటు అన్ని వర్గాలు సహకరించాలి.                       - వీ మాధవి, టౌన్‌ సీఐ, హుజూరాబాద్‌

జాగ్రత్తగా ఉండాలి

ప్రస్తుతం కొవిడ్‌-19 వ్యాప్తి ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలి. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. పాజిటివ్‌ వచ్చిన వారు వైద్యులు, సిబ్బంది సూచనలు పాటిస్తే త్వరగా కోలుకుంటారు. 

- డాక్టర్‌ రవిప్రవీణ్‌రెడ్డి, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌, హుజూరాబాద్‌


logo