మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 27, 2020 , 03:14:33

ఆధునిక హంగులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌

ఆధునిక హంగులతో షాపింగ్‌ కాంప్లెక్స్‌

హుజూరాబాద్‌: జిల్లా సహకార మార్కెటింగ్‌ సంస్థ (డీసీఎంఎస్‌) ఆధునిక హంగులతో హుజూరాబాద్‌లో కొత్తగా మరో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించనున్నది. ఈ మేరకు పాలకవర్గం పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. ఇప్పటికే పట్టణ నడిబొడ్డున డీసీఎంఎస్‌కు షాపింగ్‌ కాంప్లెక్స్‌కు సంబంధించిన షటర్లు దాదాపు 170 వరకు ఉన్నాయి. ప్రస్తుతం అన్నింట్లో పలు రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

కొత్తగా 120 షటర్లు

పట్టణంలో డీసీఎంఎస్‌కు సంబంధించింది తప్ప పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ మరొకటి లేదు. జోరుగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు జరిగే వాటిలో ఇదొకటి. అందరికీ అందుబాటులో ఉండడంతో ఈ కాంప్లెక్స్‌లో షెటర్ల కోసం వ్యాపారులు పోటీ పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని డీసీఎంఎస్‌ కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూనుకున్నది. 120 షటర్లతో పాత బస్‌డిపో (రెండు పెద్ద రేకుల షెడ్లస్థానంలో) స్థలంలో నిర్మించనున్నది. 

 త్వరలో నిర్మాణం

డీసీఎంఎస్‌ నిర్మించబోయే కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌కు త్వరలో శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం ఆ సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 60, మొదటి అంతస్తులో 60 షటర్లు ఉండేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం పాత బస్‌డిపో (రెండు పెద్ద రేకుల షెడ్లు)తోపాటు పాత కాంప్లెక్స్‌లోని జీ బ్లాకులో ఉన్న 14 పటర్లు కూల్చివేయనున్నారు. ఈ క్రమంలో అడ్డా కోల్పోయే వారికి కొత్త కాంప్లెక్స్‌లో షటరు కేటాయించే యోచనలో పాలకవర్గం ఉన్నట్లు తెలిసింది.

ఆధునిక హంగులతో కాంప్లెక్స్‌

దాదాపు 25గుంటల స్థలంలో డీసీఎంఎస్‌ కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఆధునిక హంగులతో నిర్మించనున్నారు. ప్రస్తుత కాంప్లెక్స్‌లో పార్కింగ్‌, టాయిలెట్ల సమస్య ఉంది. ఈ క్రమంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణం కోసం గుంట స్థలం కేటాయించడంతోపాటు నిర్వహణ బాధ్యతలు సులభ్‌సంస్థకు అప్పగించనున్నారు. భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా లిఫ్టు పెట్టేందుకు అనువుగా భవనాన్ని నిర్మించనున్నారు.

అదనపు ఆదాయం 

డీసీఎంఎస్‌కు అదనపు ఆదాయం సమకూర్చడంపై ఆ సంస్థ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డితో పాటు పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా పలు అంశాలతో ఇటీవల తీర్మానం చేసింది. దానిని అమలు చేయడంలోనూ ఆ సంస్థ చాలా వరకు సఫలీకృతమైంది. పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలను మెజారిటీ ప్రజలు హర్షిస్తున్నారు.logo