బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 27, 2020 , 03:01:44

మొక్కలను బాధ్యతగా సంరక్షించాలి

మొక్కలను బాధ్యతగా సంరక్షించాలి

కార్పొరేషన్‌: నగరంలో ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నామని, బాధ్యతగా నాటి సంరక్షించాలని మేయర్‌ వై సునీల్‌రావు పిలుపు నిచ్చారు. నగరంలోని 33, 34, 59వ డివిజన్లలో ఆదివారం నిర్వహించిన ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలో హరితహారంలో భాగంగా ఖాళీ స్థలాల్లో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు. నగరంలోని అన్ని ఇండ్లకు 3 లక్షల మొక్కలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న పూలు, పండ్ల మొక్కలు కొనుగోలు చేసి అందజేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కరీంనగర్‌ను హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. హరితహారంలో  ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. నగరపాలక సంస్థ తరఫున నాటే ప్రతి మొక్కకు రూ. 350 ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలో రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. ఈసారి హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఇంటి ఆవరణలో నాటిన మొక్కలతో పాటు ఇంటి ముందు నాటిన మొక్కలను కూడా సంరక్షించాలని కోరారు. ఎక్కడైనా మొక్కలు వంగిపోయి ఉంటే సరిచేయాలని సూచించారు. 59వ డివిజన్‌లో నెలకొన్న మురుగు నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో వర్షం పడితే మురుగు కాలువలు పొంగి మురుగు నీరంతా రోడ్లపైకి వస్తుందని, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో మురుగు కాలువలను విస్తరించేందుకు అవకాశాలను పరిశీలించాలని, అవసరమైన ప్రాంతాల్లో వరద నీటిని మళ్లించేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గందె మాధవి, వాల రమణారావు, బర్కత్‌అలీ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

కార్పొరేషన్‌: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ వై సునీల్‌రావు సూచించారు. ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా 33వ డివిజన్‌లో పలు ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని ఆయన తొలగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వానకాలంలో దోమలతో వ్యాధులు ప్రబలుతాయన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇండ్లల్లో నిరుపయోగంగా ఉన్న డబ్బాలు, టైర్లు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు, వాటి లార్వాలు వృద్ధి చెందుతాయన్నారు. వీటిని పూర్తిస్థాయిలో అరికట్టినప్పుడే సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. ఈవిషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు. అలాగే, నగరంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇక్కడ నాయకులు, తదితరులున్నారు. logo