గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 24, 2020 , 03:02:38

ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం

ప్రజలకు మెరుగైన సేవలందిస్తాం

కార్పొరేషన్‌: నగర ప్రజలకు మెరుగైన సేవలందిస్తామని కరీంనగర్‌ మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. నగరపాలక సంస్థలో ఆధునీకరణ చేసిన మేయర్‌ చాంబర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నగరంలో రోజూ తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. రెండు ట్యాంకుల పరిధిలో నీటి సరఫరాలో చిన్న సమస్యలు రాగా గురువారం పరిష్కరించామని, శుక్రవారం నుంచి ఈ ప్రాంతాల్లోనూ తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. నగరంలో 10 ప్రాంతాల్లో వాకింగ్‌ ట్రాక్స్‌, 30 ప్రాంతాల్లో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. శివారు డివిజన్లలో తాగునీటి పైపులైన్ల కోసం రూ. 7 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సూచనలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. తన చాంబర్‌లో ఉదయం, సాయంత్రం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. నూతన చాంబర్‌లో కూర్చున్న మేయర్‌కు డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణిహరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, గందె మాధవి, స్వప్న, సరిళ్ల ప్రసాద్‌, బండారి వేణు, నగరపాలక అధికారులు పాల్గొన్నారు. 

వీధి వ్యాపారులకు రుణాలివ్వాలి 

 కరీంనగర్‌లో అర్హత గల వీధి వ్యాపారులకు కేంద్రం అందిస్తున్న రుణాలు మంజూరయ్యేలా చూడాలని మేయర్‌ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. స్థానిక నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం కింద బల్దియా గుర్తించిన వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో కమిషనర్‌ క్రాంతి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలి

నగరంలో రోజూ తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్‌ వై సునీల్‌రావు ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్‌ అధికారులు, లైన్‌మెన్లు, ఫిట్టర్లతో రోజూ తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ రోజూ తాగునీటి సరఫరాలో రాంనగర్‌, భగత్‌నగర్‌ రిజర్వాయర్లలో తలెత్తిన సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నీటి సరఫరా విషయంలో ఇంజినీరింగ్‌ అధికారులు, లైన్‌మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైలెవల్‌, లోలెవల్‌లో తాగునీటిని సరఫరా చేస్తున్నప్పుడు ఏఈలు పర్యవేక్షించాలన్నారు. ట్యాంకుల వారీగా నీటి సరఫరా సమయం వివరాలు అందించాలని ఆదేశించారు. కమర్షియల్‌ నల్లాలపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, నగరపాలక ఇంజినీర్లు, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


logo