ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 24, 2020 , 02:58:25

వర్షం దంచికొట్టింది

వర్షం దంచికొట్టింది

నమస్తే నెట్‌వర్క్‌: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో వర్షం దంచికొట్టింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం దాకా పలుచోట్ల ఎడతెరిపి లేకుండా కుండపోత కురిసింది. వాగులు, చెరువులు, కుంటలకు జలకళ రాగా, లోతట్టు ప్రాంతాలకు భారీగా నీరు చేరింది. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వర్షం ముసురు విడవకుండా కురిసింది. కోరుట్లలో మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల పాటు ఏకధాటిగా దంచికొట్టడడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రకాశం రోడ్డు, ఝాన్సీరోడ్డు, ముత్యాల వాడ, బిలాల్‌పురా, అర్బన్‌కాలనీ, ఆదర్శనగర్‌, పద్మపురి వాడ, రధాలపంపు కాలనీల్లో వరదనీరు పొంగిపొర్లి రహదారులను ముంచెత్తింది. రాజన్న సిరిసిల్లలో గురువారం తెల్లవారుజాము నుంచి మొదలైన ముసురు రాత్రి వరకు వీడలేదు. కామారెడ్డి, నిజమాబాద్‌ జిల్లాలో  కురుస్తున్న భారీ వర్షాలకు గంభీరావుపేట మండలంలోని గోరంటాల వాగు ప్రవహిస్తుంది. వేములవాడ మల్లారంలోని మూలవాగు ఫీడర్‌చానెల్‌, హన్మాజీపేటలోని నక్కవాగు, అయ్యేరుపల్లిలోని గంజీవాగుల వద్ద భారీగా వరద వస్తున్నది. ఇక కరీంనగర్‌లో గురువారం ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే వర్షం కురవడంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలోనూ పలుచోట్ల బుధవారం రాత్రి నుంచి గురువారం దాకా ముసురుపడింది. పెద్దపల్లిలో సరాసరి వర్షపాతం 23.5 మిల్లీమీటర్లు నమోదు కాగా, జగిత్యాలలో 21.19, సిరిసిల్ల జిల్లాలో 11.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. 


logo