శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 23, 2020 , 02:04:10

మెట్టకు గంగమ్మ పరవళ్లు తొక్కింది

మెట్టకు గంగమ్మ పరవళ్లు తొక్కింది

మెట్టకు గంగమ్మ పరవళ్లు తొక్కింది. చొప్పదండి నియోజకవర్గంలోని బీళ్లను తడిపేందుకు పరుగుపరుగున తరలివచ్చింది. ఎమ్మెల్యే రవి శంకర్‌ కృషి.. సీఎం కేసీఆర్‌ చొరవ ఎల్లంపల్లి జలాలు బుధవారం నారాయణపూర్‌ను ముద్దాడి.. ఉప్పొంగడంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నీటికి ఇక ఢోకా లేదని సంతోషంగా సాగుకు కదులుతున్నది.  

ఎల్లంపల్లి నుంచి మంగళవారం రాత్రి విడుదల చేసిన గోదావరి జలాలు బుధవారం నారాయణపూర్‌ రిజర్వాయర్‌లోకి చేరాయి. 200 క్యూసెక్కుల చొప్పున రెండు పైపుల ద్వారా ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. జలాశయం సామర్థ్యం 160 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్లు కాగా, వరుసగా వారం పాటు నిర్విరామంగా నీటి విడుదల కొనసాగితే పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నది. అలాగే ఇక్కడి నుంచే నియోజకవర్గంలోని దాదాపు 70 చెరువులు నిండడంతో పాటు గ్రావిటీ ద్వారా ఆరు మండలాల్లో 65 వేల ఎకరాలకు నీరు అందుతుంది. భూగర్భ జలాలు పెరిగి సాగు నీటికి కరువు ఉండదని స్థానిక రైతులు ఆనందపడుతున్నారు. 

ఆరో సారి విడుదల.. 

మెట్ట ప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతున్నది. ఎప్పటికప్పుడు గోదావరి జలాలను విడుదల చేస్తూ పంటలకు ప్రాణం పోస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంతర పర్యవేక్షణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కృషితో నాలుగేళ్లలో నారాయణపూర్‌కు ఐదు సార్లు జలాలు విడుదల చేశారు. ప్రస్తుతం వానకాలం పంటల కోసం ఆరోసారి విడుదల చేయగా, రైతులు సంబురపడిపోతున్నారు. 

చి‘వరి’కి అందిస్తాం.. 

నియోజకవర్గంలోని చివరి భూములకూ నీరందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సాగు నీటికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. నేను విజ్ఞప్తి చేసిన వెంటనే సీఎం కేసీఆర్‌ స్పందించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం సంతోషకరం. రైతులు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా. - సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్యే, (చొప్పదండి)logo