ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 23, 2020 , 01:59:29

విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్టీసీ పరుగులు

విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్టీసీ పరుగులు

సమ్మెను దాటుకొని పట్టాలెక్కిన ప్రగతి రథ చక్రానికి మాయదారి కరోనా అడ్డుతగులుతున్నది. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం బస్సులు నడుపుతున్నా.. ప్రయాణికుల శాతం మాత్రం తగ్గిపోతున్నది. వైరస్‌ నివారణకు ఆర్టీసీ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నా.. రోజుకు కోటి మేర నష్టాన్ని చవిచూడాల్సి వస్తున్నది. ఓ వైపు గతంలో మాదిరి ప్రయాణాలపై ప్రజలు ఆసక్తి చూపకపోవడం, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాలకు వెళ్లేవారి సంఖ్య భారీగా తగ్గిపోవడం ఒకెత్తయితే.. మరోవైపు  సొంత వాహనాలను వినియోగించడం కూడా ఆక్యుపెన్సీ రేషియో తగ్గుదలకు కారణంగా కనిపిస్తున్నది. ఫలితంగా  30 నుంచి 35 శాతం ప్రయాణికులను తీసుకెళ్తూ భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తున్నా, సంస్థ యంత్రాంగం మాత్రం సేవాదృక్పథంతో సాగుతున్నది. ప్రయాణికుల భద్రత కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, వదంతులు నమ్మవద్దని, ఆర్టీసీ సురక్షితమని విజ్ఞప్తి చేస్తున్నది. మాయదారి కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేయడమే కాదు ప్రగతి రథ చక్రానికి తీరని నష్టం తెచ్చిపెడుతున్నది. సమ్మెను దాటుకొని లాభాల బాటలో పయనిస్తున్నా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రజల సౌకర్యార్థం పటిష్ట చర్యలు తీసుకుంటూ బస్సులు నడుపుతున్నా.. వైరస్‌ భయానికితోడు, వదంతులతో ప్రయాణికుల శాతం తగ్గిపోతూ రోజుకు కోటి నష్టం వాటిల్లుతున్నది.    

కరోనా కష్టం...

ఇక ఆర్టీసీకి ఢోకా ఉండదని భావిస్తున్న తరుణంలో కరోనా రక్కసి ఒక్కసారి పరిస్థితులను, అంచనాలను తారుమారు చేసింది. కరీంనగర్‌ రీజియన్‌లోని పది డిపోల పరిధిలో 847 బస్సులున్నాయి. కరోనాకు ముందు రోజుకు 1.30 కోట్లకు పైగా ఆదాయం సమకూరేది. హైదరాబాద్‌కు అర గంటకో బస్సును నడిచేది. అంతేకాదు, ఆక్యుపెన్సీ రేషియో 70 నుంచి 80 శాతం వరకు ఉండేది. లౌక్‌డౌన్‌ తర్వాత గత మే 19 నుంచి బస్సులు నడుపుతున్నా.. 30 నుంచి 35 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ రేషియా (ప్రయాణికుల శాతం) నమోదవుతున్నది. రోజుకు 30 లక్షల నుంచి 35 లక్షల ఆదాయం మాత్రమే వస్తోంది. పూర్తిస్థాయిలో బస్సులను తిప్పేందుకు ఆర్టీసీతో పాటుగా స్టాఫ్‌ రెడీగా ఉన్నా.. ఆ మేరకు డిమాండ్‌ రావడం లేదు. కొన్ని కొన్ని రూట్లలో బస్సులు ఖాళీగా వెళ్లి వస్తున్నాయి. ప్రస్తుతం తిరుగుతున్న వాటిలో మెజార్టీ బస్సులకు డీజిల్‌ చార్జీలు కూడా రావడం లేదని తెలుస్తున్నది. కరోనా భయంతో ప్రజలు ప్రయాణాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు గతంలో ఆర్టీసీలోనే ప్రయాణించే ఎక్కువ మంది ఇప్పుడు సొంత వాహనాలను వినియోగిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అర గంటకో బస్సు హైదరాబాద్‌ నడిపినా.. సీట్లు దొరకడం కష్టంగా ఉండేది. కానీ, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అటువైపు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో బస్సులు ఖాళీగానే వెళ్తున్నాయి. 

పట్టాలెక్కే ప్రయత్నం.. 

ఆదాయం గడించడంలో గతంలో కరీంనగర్‌ రీజియన్‌ ప్రథమ స్థానంలో ఉండేది. అటువంటి ఆర్టీసీ ప్రస్తుతం కరోనాతో కష్టాలను చవిచూస్తున్నది. నిజానికి గతేడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 29 వరకు ఆర్టీసీ సమ్మెలోకి వెళ్లింది. వాస్తవాలు తెలుసుకున్న కార్మిక లోకం 55 రోజుల పాటు సాగించిన సమ్మెను విరమించుకొని విధులకు హాజరైంది. ఇదే సమయంలో మాట ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు సమ్మెకాలానికి వేతనాలు ఇవ్వడమేకాదు.. లాభాల బాటలో ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కార్మిక లోకం సైతం తమ ఆర్టీసీ ప్రగతి బాటలో నడిపించేందుకు సంయుక్తంగా కదిలారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కరోనా మహమ్మారి తన పడగ విప్పింది. దీంతో సుమారు 56రోజుల పాటు సాగిన లౌక్‌డౌన్‌లో ప్రగతి చక్రాలు ప్రజల సేవలకు దూరమయ్యాయి. మళ్లీ మే 19 నుంచి ఆర్టీసీ బస్సులు ప్రజల ముందుకు వచ్చాయి. 

సురక్షిత చర్యలు.. 

నిజానికి కొవిడ్‌-19 నియంత్రణకు ఆర్టీసీ విస్తృత చర్యలు తీసుకుంటున్నది. బస్సులో ఎక్కే ప్రతి ప్రయాణికుడి చేతులకు శానిటైజర్‌ రాస్తున్నారు. ప్రతి కండక్టర్‌ వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో వివిధ రూట్లలో వెళ్లి వచ్చిన బస్సులను అయితే మరో రూటుకు పంపేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి పలికి.. ఒక రూటులో వెళ్లి వచ్చిన బస్సును ముందుగా డిపోకు తీసుకెళ్తున్నారు. అక్కడ బస్సును పూర్తిగా స్ప్రేతో శానిటైజ్‌ చేస్తున్నారు. లోపల సీట్లను, సీట్లకు ఉండే ఇనుపరాడ్లు, హ్యాండిల్స్‌ వంటి వాటిని పూర్తిగా శుభ్రం చేస్తున్నారు. కొవిడ్‌- 19 నివారణ చర్యలు పూర్తిగా తీసుకున్న తదుపరి మాత్రమే తిరిగి మరో రూటుకు పంపుతున్నారు. అంతేకాదు, ఆర్టీసీ స్టాఫ్‌తోపాటు బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ కచ్చితంగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు తొలగించి.. ఎవరూ బస్సులో మాట్లాడకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

వదంతులు నమ్మొద్దు 

కొవిడ్‌-19 నివారణ చర్యలను ఆర్టీసీలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఈ విషయంలో వచ్చే ఏ వదంతులను నమ్మొద్దు. ప్రయాణికులకు భద్రత, ఆరోగ్య పరిరక్షణ కోసం.. రూట్లపై వెళ్లే ప్రతి బస్సును శానిటైజ్‌ చేస్తున్నాం. అంతేకాదు, ఆ తరహా లక్షణాలున్న వారు ఎవరైనా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే వారిని దింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఎన్నిబస్సులైనా నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నాదొక్కటే విజ్ఞప్తి. సురక్షిత ప్రయాణం కోసం.. ఆర్టీసీని నమ్ముకోవాలి. తద్వారా తక్కువ ఖర్చులో సురక్షిత ప్రయాణం చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
- పీ జీవన్‌ ప్రసాద్‌, 
ఆర్టీసీ ఆర్‌ఎం  
 


logo