ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 22, 2020 , 01:54:44

‘కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం’

‘కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం’

కరీం‘నగర’ ప్రజల తాగునీటి కష్టాలు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. ‘కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం’ పేరిట మంగళవారం నుంచే నిత్యం మంచినీటి సరఫరాను ప్రారంభించడంతో దశాబ్దాలుగా పడ్డ కష్టాలు తీరనున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంతోపాటు.. నిధుల కేటాయింపులు, ప్రణాళికలు, ఆదేశాలు ఇలా అన్నింటిలోనూ ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపడంతో ఈ పథకం విజయవంతంగా పూర్తవగా, రోజూ 45 నిమిషాల పాటు నల్లా నీళ్లు రానున్నాయి. సీఎం ఆశయం నెరవేరగా, మంత్రి కేటీఆర్‌ సూచనతో మున్ముందు 24/7 నీటి సరఫరా చేసేందుకు యంత్రాంగం సమాయత్తమవుతున్నది. 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరీంనగర్‌ పక్కనే ఉన్న మానేరుపై 24.034 టీఎంసీల సామర్థ్యం గల లోయర్‌ మానేరు డ్యాంను నిర్మించారు. 1974లో నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 1985లో పనులు పూర్తి కావడంతో ప్రారంభించారు. అయితే పక్కనే డ్యాం ఉన్నా.. నగరవాసులు మాత్రం దశాబ్దాలుగా నీటి కొరతను ఎదుర్కొన్నారు. కనీసం రోజు విడిచి రోజు నీరు ఇవ్వాలని వేడుకున్నా నాటి సమైక్య పాలనలో పట్టించుకునే వారే లేరు. ఈ క్రమంలో నాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కరీంనగర్‌ ప్రజల తాగునీటి కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలని భావించారు. ఆ మేరకు ప్రతిరోజూ నీటి సరఫరా పనులకు 2017లో శ్రీకారం చుట్టా రు. పైలెట్‌ ప్రాజెక్టుగా ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి 109 కోట్లను మంజూరు చేశారు. ఒకవైపు అప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరిస్తూనే.. మరోవైపు ప్రతిరోజూ నీటి సరఫరా కోసం కావాల్సిన పనులను కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని సమీక్షించి.. సకాలంలో పూర్తయ్యేలా చూశారు. పెరుగుతున్న నగరం, జనాభా వంటివి పరిగణనలోకి తీసుకొని.. 2048 వరకు నీటి స మస్యలుండకుండా ఈ పథకాన్ని డిజైన్‌ చేశారు. ఇందుకోసం కొత్తగా 36 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ ఫర్‌డే) సామర్థ్యం గల ఫిల్టర్‌ బెడ్‌ను ని ర్మించారు. దీంతో పాత, కొత్త కలిపి ప్రస్తుతం రో జుకు ఫిల్టర్‌ బెడ్‌ (నీటి శుద్ధికేంద్రాలు) సామర్థ్యం 96 ఎంఎల్‌డీలకు చేరింది. ఇదే సమయంలో పాత విధానానికి స్వస్తి చెప్పి.. గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ట్యాంకులకు నీళ్లొచ్చేలా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని గుట్టపై 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇందుకోసం ఫిల్టర్‌బెడ్‌ నుంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు 7.7 కిలో మీటర్ల మెయిన్‌ పైపులైన్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నగరంలో వివిధ రిజర్వాయర్లకు గ్రావిటీ ద్వారా నీరు వచ్చేందుకు వీలుగా 19 కిలోమీటర్ల పైపులైన్లు, రిజర్వాయర్‌ నుంచి డిస్ట్రిబ్యూషన్‌ కోసం 110 కిలోమీటర్ల పైపులతో పాటు రాంనగర్‌, హౌసింగ్‌బోర్డుకాలనీల్లో కొత్తగా రిజర్వాయర్లు నిర్మించారు. నీటి సరఫరాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ ఏర్పడకుండా ఉండేందుకు గాను ఫిల్టర్‌ బెడ్‌ వద్ద 375 హెచ్‌పీ సామర్థ్యం గల 6 మోటర్లు ఏర్పాటు చేయగా.. ఇందులో రెండు స్టాండ్‌బైగా వినియోగిస్తారు. విద్యుత్‌ సమస్య ఏదైనా ఉత్పన్నమైనా.. నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఫిల్టర్‌ బెడ్‌ వద్ద 2000 కేవీ సామర్థ్యం గల జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పైలెట్‌ ప్రాజెక్టు కింద జరిగిన ఏర్పాట్ల ద్వారా 2048 వరకు నగర జనాభా ఆరు నుంచి ఏడు లక్షలకు పెరిగినా ఒక్కొక్కరికి 150 లీటర్ల చొప్పున ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

 కరీంనగర్‌ తొలి రికార్డు

ఈ పథకం వెనుక పూర్తి ఆలోచన, హస్తం ముఖ్యమంత్రి కేసీఆర్‌దే కాబట్టి.. ప్రతి రోజూ నీటి సరఫరా పథకానికి ‘కేసీఆర్‌ జలం,.. ఇంటింటికీ వరం’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని జిల్లా మంత్రి గంగుల కమలాకర్‌ మంత్రి కేటీఆర్‌ ముందు వెల్లడించారు. కాగా, ఈ పథకం కింద ప్రతి రోజూ 45 నిమిషాల పాటు నీటిని సరఫరా చేయనున్నారు. ఆయా ప్రాంతాలను బట్టి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించగా.. ఆ వెంటనే నీటి సరఫరాను ప్రక్రియను చేపట్టారు. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో నిత్యం నీటి సరఫరా లేదు. రాష్ట్రంలోనే నిత్యం నీటి సరఫరాచేసే కార్పొరేషన్‌గా కరీంనగర్‌ తొలి రికార్డు సాధించినట్లుగా చెప్పవచ్చు. అంతేకాదు, కాళేశ్వరం జలాలతో లోయర్‌ మానేరు డ్యాం 365 రోజులు జలకళతో ఉండనున్నది. దీనిని పరిగణనలోకి తీసుకొని, ప్రతిరోజూ నీటి సరఫరా చేస్తూనే మరోవైపు 24/7 నీటి సరఫరాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దశాబ్దాలుగా నగరవాసులు ఎదురు చూస్తున్న కల మంగళవారం నుంచే నెరవేరుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.logo