మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 22, 2020 , 01:48:58

కరీంనగర్‌పై మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు

కరీంనగర్‌పై మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు

కరీంనగర్‌పై మంత్రి కేటీఆర్‌ వరాల జల్లు కురిపించారు. నగర ప్రజలకు ఆహ్లాదం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పార్కుకు 80 ఎకరాల స్థలం మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. నేదునూరు విద్యుత్‌ ప్లాంట్‌కు కేటాయించిన స్థలంతోపాటు ఎల్‌ఎండీ పరీవాహక ప్రాంతాల్లో ఎస్సారెస్పీ కోసం కేటాయించిన స్థలాన్ని నగర అభివృద్ధి అవసరాలకు వినియోగపడే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రతిరోజూ ఇస్తున్న మంచినీటిని త్వరలోనే 24/7 నీటి సరఫరా కోసం తీర్చిదిద్దేందుకు కావాల్సిన సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఐటీ టవర్‌ పరిధిలో టీహబ్‌ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి.. అవసరమైతే డిమాండ్‌ను బట్టి రెండో టవర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నెలన్నరలోనే కేబుల్‌ బ్రిడ్జి పనులు పూర్తిచేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం చేయించి.. ప్రజలకు అంకితమిస్తామని వెల్లడించారు. అల్గునూర్‌ చౌరస్తాను ‘గేట్‌వే ఆఫ్‌ కరీంనగర్‌'గా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు ఇస్తామని ప్రకటించారు. నిత్యం నీటి సరఫరా పథకాన్ని మంగళవారం ప్రారంభించిన ఆయన, మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక, కమిషనర్‌ క్రాంతికి అభినందనలు తెలిపారు.  

ఉమ్మడి జిల్లా యువతీయువకుల ఆశలు నెరవేరాయి. ఇక్కడ ఇంజినీరింగ్‌ చేసి ఐటీ ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బందులిక తప్పనున్నాయి. సొంతగడ్డపైనే ఉపాధి పొందే అవకాశం అతి తక్కువ కాల వ్యవధిలో అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా మంగళవారం ఐటీ టవర్‌ ప్రారంభోత్సవం చేసుకున్నది. మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు రానుండగా, ఇప్పటికే వివిధ కంపెనీలతో ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించి మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పలు కంపెనీల ప్రతినిధులకు అలాట్‌మెంట్‌ లెటర్లు అందజేయడంతోపాటు ఎంపికైన యువతీ యువకులకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు.  ఎక్కడికో వెళ్లి ఉద్యోగం వెతుక్కునే అవస్థలు తప్పడంతో పాటు ఉన్న చోటనే కొలువు రావడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగ అవకాశాలు రావడం తమ అదృష్టమని సంతోషంగా చెబుతున్నారు. 

ఉన్న ఊరిలోనే ఐటీ జాబ్‌ వస్తుందని అనుకోలె..

బీటెక్‌ అయిపోగానే ఉన్న ఊరిలోనే ఐటీ కంపెనీలో ఉద్యోగం వస్తుందని అనుకోలె. చదువు పూర్తయితే హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయాల్సి వస్తుందేమో అనుకున్న. కానీ నగరంలోనే ఐటీ టవర్‌ ఏర్పాటు కావడం, అందులో నాకు ఉద్యోగం దొరకడం ఆనందంగా ఉంది. ఇక్కడే ఉండి సంతోషంగా పని చేసుకోవచ్చు. - అనూష, కరీంనగర్‌
మంత్రి, మేయర్‌, కలెక్టర్‌కు అభినందనలు  
ప్రతిరోజూ మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టిన తొలి కార్పొరేషన్‌గా కరీంనగర్‌ నిలబడుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ పథకాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి.. ప్రజల ముందుకు తీసుకొచ్చిన మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక, కమిషనర్‌ క్రాంతికి అభినందనలు తెలిపారు. ఒక పథకం అమల్లోకి తేవాలంటే ఎంతో శ్రమ పడాల్సి ఉంటుందని, అన్నింటికీ ఓర్చి ప్రస్తుతం ఫలాలను అందిస్తున్న నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్‌లో ప్రారంభించే ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఒక ఆదర్శంగా నిలువాలని ఆకాంక్షించారు. 24/7 నీటి సరఫరాకు మంత్రి గంగుల నేతృత్వంలో చర్యలు తీసుకొని.. మరింత స్ఫూర్తివంతంగా నిలువాలని సూచించారు. 
అభివృద్ధి కోసం స్థలాలు..
నేదునూరు వద్ద గతంలో విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలంతోపాటు.. లోయర్‌ మానేరు డ్యాం పరిధిలో ఎస్సారెస్పీ అవసరాల కోసం కేటాయించిన స్థలాలను నగరాభివృద్ధికోసం వినియోగిస్తే బాగుంటుందని మంత్రి గంగుల కమలాకర్‌, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కోరగా.. దానిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సదరు భూములను నగరాభివృద్ధికి ఎలా వినియోగించుకోవచ్చో.. ఒకసారి ముఖ్యమంత్రితో మాట్లాడి, ఆయన సూచనలకనుగుణంగా ముందుకు వెళ్దామని ప్రకటించారు. 
గేట్‌ వే ఆఫ్‌ కరీంనగర్‌..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్షకు పూనుకున్న నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆనాటి సమైక్య ప్రభుత్వం అల్గునూరు వద్ద అరెస్టు చేసిందని మంత్రి గంగుల కమలాకర్‌ కేటీఆర్‌ దృష్టికి తెచ్చారు. దీంతో దీనికి చారిత్రాత్మక ప్రాధాన్యత ఏర్పడిందని, ఈ నేపథ్యంలో ఆ చౌరస్తాకు కేసీఆర్‌ ఐలాండ్‌గా నామకరణం చేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గంగులతో పాటు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కూడా ఈ అంశాన్ని తన దృష్టికి తెచ్చారని, సదరు చౌరస్తాను అభివృద్ధి చేయడానికి అన్ని మార్గాలున్నాయని పేర్కొన్నారు. గేట్‌ వే ఆఫ్‌ కరీంనగర్‌గా తీర్చిదిద్దేందుకు సదరు చౌరస్తాకు కావాల్సిన ప్లాన్స్‌ తయారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎన్ని డబ్బులైనా సరే ఇస్తామని స్పష్టం చేశారు. 
కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/కార్పొరేషన్‌: రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం కరీంనగర్‌లో పర్యటించి, వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా బైపాస్‌ రోడ్‌లోని లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఆరో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం శాతవాహవాన విశ్వవిద్యాలయానికి చేరుకొని.. అక్కడ ప్రతి రోజూ మంచినీటి సరఫరా (కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం) అనే పథకాన్ని ప్రారంభించి, అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు. తదుపరి ఐటీటవర్‌ను ప్రారంభించి, కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ శిక్షణా కేంద్రంలో మియవాకి పద్ధతిలో చెట్ల పెంపకాన్ని పరిశీలించి, మొక్కను నాటారు. అక్కడి నుంచి మానేరు వాగుపై ఏర్పాటు చేసిన కేబుల్‌ బ్రిడ్జి వద్దకు చేరుకుని పనులను, తదుపరి స్మార్ట్‌సిటీ రోడ్ల పనులను పరిశీలించారు. కలెక్టరేట్‌ వద్ద బల్దియాకు చెందిన పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించి. విపత్తు నిర్వహణ విభాగం తీరును పరిశీలించి.. సదరు సిబ్బందితో మాట్లాడారు.
రూపాయికి నల్లా కనెక్షన్‌ గుర్తు చేసిన కేటీఆర్‌
మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ హయాంలో రూపాయికే నల్లా కనెక్షన్‌ను కరీంనగర్‌లోనే మొదటిసారిగా ప్రవేశపెట్టిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో తెల్లకార్డు ఉండి కుళాయి కనెక్షన్‌ లేని వారికి రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు.
లంగ్స్‌ స్పేస్‌ పార్కుకు స్థలం..
మంత్రి గంగుల చేసిన విజ్ఞప్తులకు మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారు. కరీంనగర్‌ నగర ప్రజలకు సుందరమైన అర్బన్‌ పార్కు (అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌)ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం ఎల్‌ఎండీ పరిధిలో 80 ఎకరాల స్థలా న్ని మంజూరు చేయాలని గంగుల కోరగా, ‘కరీంనగర్‌ నగర విస్తీర్ణం తక్కువ. కానీ, జనసాంద్రత ఎక్కువగా ఉంది. అందుకే అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పార్కుకోసం 80 ఎకరాల స్థలాన్ని వెంటనే మంజూరు చేయించి, కరీంనగర్‌కు ఒక అద్భుతమైన అసెట్‌ను అందించే బాధ్యతను నేనే తీసుకుంటా’ అని హామీ ఇచ్చారు. 
24/7కు సహకారం.. 
ప్రతిరోజూ మంచినీటి సరఫరా చేయడం అభిందనీయమని, ఈ విషయంలో కరీంనగర్‌ రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని, ఈ పథకం విజయవంతం కాగానే 24/7 నీటి సరఫరాకు ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఇది కూడా కరీంనగర్‌ నుంచే ప్రారంభం కావాలని మంత్రి గంగులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ఇందుకు అవసరమైన సహకారాన్ని పూర్తిగా అందిస్తామని, ఈ పథకం మొత్తం రాష్ట్రంలోని అన్ని నగరాలకు, మున్సిపాలిటీలకు ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత గంగులతో పాటు నగరపాలకవర్గం జిల్లా కలెక్టర్‌పై పెడుతున్నట్లు చెప్పారు. 
కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం : మంత్రి గంగుల 
కరీంనగర్‌లో ప్రజలు తాగునీటి కోసం గతంలో అనేకసార్లు తండ్లాడారు. పక్కనే మానేరు డ్యాం ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ మాత్రం పగ్గాలు చేపట్టగానే కరీంనగర్‌లో నిత్యం నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ఇందుకోసం నిధులు కేటాయించారు. ఆ మేరకు.. వెంటపడి పనులు చేయించాం. ప్రస్తుతం పనులు పూర్తయ్యాయి. మంగళవారం నుంచే ప్రతిరోజూ నీటి సరఫరా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరి కొద్ది నెలల్లోనే 24/7 వాటర్‌ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటాం. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి నిధులు ఇచ్చి పనులు చేయించి.. ప్రజల నీటి కష్టాలను తొలగించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ పథకం పేరును ‘కేసీఆర్‌ జలం.. ఇంటింటికీ వరం’ అని ప్రకటిస్తున్నాం. దీనికి సభికులంతా చప్పట్లతో ఆమోదించాలని కోరగా, ఒక్కసారిగా హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి. 
కలలను నిజం చేస్తాం: సునీల్‌రావు మేయర్‌ 
24/7 నీటి సరఫరా అనే కలను తప్పకుండా నిజం చేసి చూపిస్తాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి గంగుల కమలాకర్‌, పాలవకర్గం సహకారంతో వీలైనంత తొందరగా అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ప్రతి రోజూ నీటి సరఫరా చేస్తాం. ఇందులోని లోటుపాట్లను, సమస్యలను అధిగమిస్తూనే మరోవైపు 24 గంటల నీటిసరఫరాకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. కరీంనగర్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు స్మార్ట్‌సిటీ పనులను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి అస్యూరెన్స్‌ పథకం కింద పనులు చాలా మేరకు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ప్రతిరోజూ నీటి సరఫరా మేయర్‌గా ఉండగా జరగడం సంతోషంగా ఉంది.logo