శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 21, 2020 , 02:04:54

కొలువుల సౌధం ఐటీ టవర్‌..

కొలువుల సౌధం ఐటీ టవర్‌..

మానేరు డ్యామ్‌ను ఆనుకొని ఉన్న మూడెకరాల స్థలాన్ని ఐటీ టవర్‌కు కేటాయించారు. 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తుల 

(జీ ప్లస్‌ 5) టవర్‌ను 34 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఒక్కోఫ్లోర్‌ సుమారు 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఉండగా, ఈ టవర్‌లో 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.  

కరీంనగర్‌ వాసుల చిరకాల స్వప్నాలు నెరవేరబోతున్నాయి. తలాపునే మానేరు డ్యాం ఉన్నా నీటి కోసం ఏండ్లపాటు పడిన కష్టాలు ఇక శాశ్వతంగా దూరం కానున్నాయి. ఇంజినీరింగ్‌ చేసిన ఈ ప్రాంత బిడ్డలకు ఇక్కడే కొలువులు రాబోతున్నాయి. దశాబ్దాల ఈ రెండు కలలు నేడు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా సాకారం కాబోతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా నిత్యం తాగునీరు సరఫరా చేసే మంచినీటి పథకంతోపాటు వేలాది ఐటీ ఉద్యోగాలకు నెలవైన ఐటీ టవర్‌ మంగళవారం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాయి. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మంత్రి కేటీఆర్‌ పర్యటన సాగనుండగా, మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.  
కరీంనగర్‌ వాసుల కలలు నేడు ఆచరణ రూపం దాల్చబోతున్నాయి. ఒకేసారి రెండు స్వప్నాలు కళ్లముందు ఆవిష్కృతం కాబోతున్నాయి. నేటి నుంచి కార్పొరేషన్‌ పరిధిలో నిత్యం మంచినీటి సరఫరా కావడంతోపాటు ఉమ్మడి జిల్లా ఇంజినీరింగ్‌ యువతకు స్థానికంగానే ఐటీ కొలువులు రాబోతున్నాయి. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా వీటిని మంగళవారం ప్రారంభించనున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పర్యటించనున్న ఆయన, కేబుల్‌ బ్రిడ్జి, స్మార్ట్‌సిటీ పనులను పరిశీలించడంతోపాటు హరితహారంలో పాల్గొననున్నారు. అనంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 
ఇదిగిదిగో ఐటీ టవర్‌..
కరీంనగర్‌ వాసుల ఐటీ స్వప్నం నేటి నుంచి సాకారం కాబోతున్నది. వేలాది మంది యువత కొలువుల కల నెరవేరబోతున్నది. ఈ ప్రాంత బిడ్డలు ఇక్కడే పని చేసుకునే అవకాశం మన ముందుకు రాబోతున్నది. ఈ టవర్‌ ద్వారా మూడువేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఐటీ టవర్‌ నేడు కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కరీంనగర్‌పై ప్రత్యేక ప్రేమ చూపారు. హైదరాబాద్‌ తర్వాత అతి పెద్ద ఐటీ టవర్‌ను నిర్మించాలని భావించి.. 2018 జనవరి 8న శంకుస్థాపన చేశారు. 34 కోట్ల వ్యయంతో నగర శివారులోని మానేరు డ్యామ్‌ను ఆనుకొని ఉన్న మూడెకరాల స్థలంలో ఐదు అంతస్తుల (జీ ప్లస్‌ 5) నిర్మాణం చేపట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, పనులను పరుగులు పెట్టించారు. అలాగే ‘ఐ లవ్‌ మై కరీంనగర్‌' అనే పేరుతో డిజైన్‌ తయారు చేయించడంలో ప్రత్యేక చొరవ చూపారు. అంతే కాదు, త్వరితగతిన పనులు పూర్తి చేయించగలిగారు. ప్రస్తుతం నిర్మాణమైన ఐటీటవర్‌ కరీంనగర్‌కు ఒక ప్రత్యేక అందాన్ని తెచ్చిపెట్టింది.  
అదనపు వసతులు..
ఐటీ టవర్‌లో సమాచారం తెలుసుకునేందుకు రిసెప్షన్‌ లాబీ, ఉద్యోగుల కోసం రెండు క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 1,500 చదరపు అడుగులతో ఒకటి, 3 వేల చదరపు అడుగులతో బయట మరో క్యాంటీన్‌ ఉంటుంది. సెంట్రల్‌ ఏసీ సౌకర్యం, సమావేశాల నిర్వహణకు ప్రతి ఫ్లోర్‌లోనూ కాన్ఫరెన్స్‌ హాల్‌, పై ఫ్లోర్స్‌కు వెళ్లేందుకు రెండు లిఫ్ట్‌లు, ఒక్కో లిఫ్ట్‌లో ఒకేసారి 13 మంది వెళ్లి వచ్చే విధంగా సౌకర్యాలు ఉన్నాయి. అన్ని వాహనాలను టవర్‌ ఆవరణతోపాటు గ్రౌండ్‌ఫ్లోర్‌లో నిలుపుకునే విధంగా సౌకర్యాలు కల్పించారు.
ప్లగ్‌ అండ్‌ ప్లే విధానం..
ఐటీ టవర్‌లో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలోనే కంపెనీలకు స్థలం కేటాయిస్తున్నారు. అంటే.. ప్రభుత్వమే అన్ని సౌకర్యాలూ కల్పిస్తుంది. యువతకు వీలైనంత ఎక్కువ ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ సిస్టమ్‌ను అమలు చేస్తున్నది.
లర్నింగ్‌ సెంటర్‌..
ఈ ఐటీ టవర్‌ను ఇతర టవర్స్‌కు భిన్నంగా అద్భుతమైన ప్రణాళికతో నిర్మించారు. ఇందులో వివిధ కంపెనీలు ఎంపిక చేసే యువతకు శిక్షణ ఇచ్చేందుకు 1,900 చదరపు అడుగుల వైశాల్యంతో లర్నింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా శిక్షణ ఇచ్చే విధంగా అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రతి కంపెనీ తన ఉద్యోగులకు ఇక్కడే శిక్షణ ఇవ్వడానికి అనువుగా సిద్ధం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఈ లర్నింగ్‌ సెంటర్‌ దోహద పడనున్నది.
నేటి నుంచే నియామకాలు.. 
ఐటీ టవర్‌ వేదికగా తమ కార్యకలాపాలు సాగించేందుకు 17 కంపెనీలు ముందుకొచ్చాయి. వీటికి స్పేస్‌ అలాట్‌మెంట్‌ చేస్తున్నారు. ఒక్కో ఫ్లోర్‌లో ఒక షిఫ్ట్‌లో 200 మంది పని చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అలా ఐదు ఫ్లోర్లలో ఒకే షిఫ్ట్‌లో వెయ్యి మంది పనిచేసేందుకు కావాల్సిన వసతులు కల్పించారు. మూడు షిఫ్టుల్లో మొత్తం 3 వేల మందికి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ వెల్లడించారు. అంతేకాకుండా మంగళ వారం నుంచే నియామకాలు జరుగుతాయని గంగుల వెల్లడించారు.
 పనులను పరిశీలించిన మంత్రి గంగుల
మంత్రి కేటీఆర్‌ మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కరీం‘నగరం’లో పర్యటిస్తారు. నిత్యం నీటి సరఫరా పథకం, ఐటీ టవర్‌ను ప్రారంభించి, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేబుల్‌ బ్రిడ్జి, నగరంలో జరుగుతున్న స్మార్ట్‌ సిటీ పనులు, మియావాకి విధానంలో పోలీస్‌ కమిషనర్‌ పెంచిన మొక్కలను పరిశీలించి అక్కడ జరిగే హరితహారంలో పాల్గొంటారు. ఆ తర్వాత కలెక్టరేట్‌కు చేరుకొని నగరంలో జరిగే అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. మంత్రి కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో సోమవారం మంత్రి గంగుల కమలాకర్‌ పరిశీలించారు. శాతవాహన యూనివర్సిటీలోని మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, మానేరు సమీపంలోని సీఎం కేసీఆర్‌ మొక్క నాటిన ప్రాంతంలో చేపడుతున్న పనులను, ఐటీ టవర్‌, కేబుల్‌ బ్రిడ్జి వద్ద పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి వెంట కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
మాట నిలుపుకున్నాం 
హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద ఐటీటవర్‌ ఐటీశాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభం కావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన 17 కంపెనీలతో పాటు మరో ప్రముఖ కంపెనీ రావడానికి సిద్ధంగా ఉంది. ఆ వివరాలను మంత్రి కేటీఆర్‌ మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాదు, హైదరాబాద్‌ వరకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే ఇబ్బందులు తప్పుతాయి. మన కళ్ల ముందే మన పిల్లలు ఉద్యోగాలు చేసుకునే అవకాశం రావడం సంతోషం. ఇదే సమయంలో నగరంలో మంచినీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగనున్నాయి. ఇప్పటికే నిత్యం నీటి సరఫరాకు సంబంధించి ట్రయల్న్‌న్రు విజయవంతంగా పూర్తిచేశాం. కేటీఆర్‌ ప్రారంభించిన తదుపరి రోజు నుంచి నిత్యం నగరంలో 90 నుంచి 95 శాతం ప్రాంతాలకు నిత్యం నీటి సరఫరా ఉంటుంది. ఇంకా ఏమైనా సమస్యలు వస్తే.. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. ఐటీ టవర్‌, నిత్యం నీటి సరఫరా విషయంలో గతంలో మాట ఇచ్చాం. వాటిని నిలుపుకున్నాం. గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో మేం చేసి చూపిస్తున్నాం. త్వరలోనే కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుంది. అలాగే పర్యాటక రంగాన్ని పెంపొందించేందుకు కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దబోతున్నాం. మానేరు దిగువన చెక్‌డ్యాంల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం.- గంగుల కమలాకర్‌, రాష్ట్ర మంత్రి
నిత్యం మంచినీళ్లు
తలాపునే సముద్రాన్ని తలపించే మానేరు డ్యాం ఉన్నా కరీం‘నగర’వాసులకు నిత్యం నీటి సరఫరా చేయడంలో గత సమైక్య ప్రభుత్వాలు, పాలకవర్గాలు విఫలమయ్యాయి. కనీసం రెండు రోజులకోసారి ఇవ్వలేకపోయాయి. దీంతో బోర్లలో నీళ్లు రాక.. నల్లా నీళ్లు లేక నగరంలోని ప్రతి ఇల్లూ అవస్థ పడింది. నిత్యం నీళ్లు ఇవ్వాలని దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేసినా ఫలితం లేక ఎన్నో కష్టాలను చూసింది. కానీ, స్వరాష్ట్రంలో ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగు పడింది. నేటి నుంచి నిత్యం నీరందించేందుకు అంతా సిద్ధమైంది.  మానేరు డ్యాం ప్రాధాన్యతను ముందు నుంచీ గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇంత మంచి అవకాశం ఏ నగరానికీ లేదని చెప్పారు. ఇక్కడి ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు శాశ్వత ప్రణాళికకు 2017లో అంకురార్పణ చేశారు. అందు కోసం అర్బన్‌ మిషన్‌ భగరీథ కింద 110 కోట్లను అప్పట్లోనే మంజూరు చేసి, పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌, ప్రస్తుత మేయర్‌ సునీల్‌రావు శరవేగంగా పనులు పూర్తయ్యేలా చూశారు. ఒక వైపు ఉన్న నీటి వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూనే, మరోవైపు నిత్యం నీటి సరఫరాకు కావాల్సిన చర్యలను తీసుకున్నారు. కొత్తగా 36 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్‌ ఫర్‌ డే) సామర్థ్యం గల ఫిల్టర్‌బెడ్‌ను నిర్మించారు. దీంతో పాత, కొత్త కలిపి ప్రస్తుతం రోజుకు ఫిల్టర్‌ బెడ్‌ (నీటిశుద్ధి కేంద్రాలు) సామర్థ్యం 84 ఎంఎల్‌డీలకు చేరింది. ప్రస్తుతం నీటి సరఫరాకు అనుసరిస్తున్న పాత విధానానికి స్వస్తి చెప్పి, గ్రావిటీ ద్వారా నగరంలోని అన్ని ట్యాంకులకూ నీళ్లిచ్చేందుకు వీలుగా శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని గుట్టపై 30 లక్షల లీటర్ల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. అందుకోసం ఫిల్టర్‌బెడ్‌ నుంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వరకు 7.7 కిలో మీటర్ల మెయిన్‌ పైపులైన్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నగరంలో వివిధ రిజర్వాయర్లకు గ్రావిటీ ద్వారా నీరు వచ్చేందుకు వీలుగా 19 కిలోమీటర్ల పైపులైన్లు, రిజర్వాయర్‌ నుంచి డిస్ట్రిబ్యూషన్‌ కోసం 110 కిలోమీటర్ల పైపులతోపాటు రాంనగర్‌, హౌసింగ్‌బోర్డుకాలనీలో కొత్తగా రిజర్వాయర్లు నిర్మించారు. నీటి సరఫరాలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులూ ఏర్పడకుండా ఉండేందుకు ఫిల్టర్‌బెడ్‌ వద్ద 375 హెచ్‌పీ సామర్థ్యం గల 6 మోటర్లు ఏర్పాటు చేయగా.. ఇందులో రెండు స్టాండ్‌బైగా వినియోగించనున్నారు. విద్యుత్‌ సమస్య ఏదైనా ఉత్పన్నమైతే నీటిసరఫరాలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఫిల్టర్‌ బెడ్‌వద్ద 2000 కేవీ సామర్థ్యం గల జనరేటర్‌ను ఏర్పాటుచేశారు. ఈ పథకాన్ని నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ప్రారంభం తదుపరి రోజు నీటి సరఫరాచేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.


logo