శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 20, 2020 , 02:56:59

శ్రావణం.. శుభకరం

శ్రావణం.. శుభకరం

లక్ష్మీదేవిని పూజించే లక్ష్మీప్రదమైన శ్రావణ మాసం వచ్చేసింది. మంగళవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా, ఇంటింటా ఆధ్మాత్మిక శోభ నెలకొననున్నది. వ్రతాలు నోములతో పండుగ వాతావరణం కనబడనున్నది. 

ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలు

శ్రావణ మాసంలో ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతాయి. పూజా పునస్కారాలతో మహిళలు బిజీగా గడుపుతారు. శ్రీమహావిష్ణువు, ఆయన సతీమణి లక్ష్మీదేవికి ప్రత్యేక వ్రతాలు చేస్తారు. చాంద్రమాసం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. ఈ నెల పౌర్ణమిన చంద్రుడు శ్రవణా నక్షత్రం సమీపంలో సంచరిస్తున్నందున ‘శ్రావణ మాసం’ అనే పేరు వచ్చిందని చెబుతారు. శ్రవణా నక్షత్రం శ్రీ మహావిష్ణువు జన్మనక్షత్రం కావడంతో విష్ణు పూజలకు ప్రసిద్ధి. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అత్యంత పుణ్యప్రదమైనవని భావిస్తారు. సోమవారం పరమేశ్వరుడిని పూజిస్తారు. మంగళవారం గౌరీ పూజలు, శుక్రవారం లక్ష్మీపూజలు, శనివారం విష్ణు పూజలు చేస్తారు. శుక్లపక్షంలో 15 రోజులను పరమ పవ్రితమనీ, ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్ర్తాలు ప్రవచిస్తున్నాయి.

మంగళగౌరీ వ్రతం : కొత్తగా పెళ్లయిన యువతులు శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. పూజా మందిరంలో తూర్పు ముఖంగా మండపం ఏర్పాటు చేసి మంగళగౌరిని పూజిస్తారు.
గరుడ పంచమి వ్రతం : సోదరులున్న మహిళలు శుక్ల పక్ష పంచమిన ఆచరించే వ్రతం ఇది. చతురస్రాకార మండపంలో బియ్యం పోసి ప్రతిమను దానిపై ఉంచి పాము పడగ కింద గౌరీదేవిని ప్రతిష్ఠించి పూజిస్తారు.
వరలక్ష్మీ వ్రతం : ఈ నెల 31న ఆచరించే అతి ప్రధానమైన వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం(శ్రావణం ప్రారంభమయ్యాక వచ్చే రెండో శుక్రవారం)ఈ వ్రతాన్ని మహిళలు నిష్ఠగా ఆచరిస్తారు. కొబ్బరికాయకు పసుపు పూసి అమ్మవారి ఆకారానికి పూజలు చేస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చన చేస్తారు.
కృష్ణాష్టమి
దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయడం కోసం భగవంతుడు ఈ భూమిమీదకు మానవరూపంలో అడుగుపెట్టిన చివరి అవతారం కృష్ణ భగవానుడు. ఈ మాసంలో రానున్న కృష్ణాష్టమి వేడుకలను భక్తులు అత్యంత వేడుకగా జరుపుకుని భగవంతుడిని ఆరాధిస్తారు. వీటితోపాటు ఈ మాసంలో వచ్చే ఏకాదశి, ఇతర పుణ్యతిథుల్లో సంప్రదాయంగా అనేక వ్రతాలు కూడా ఆచరిస్తుంటారు.
ఈ మాసంలో వచ్చే పర్వదినాలు
25న నాగులపంచమి
31న వరలక్ష్మీవ్రతం
ఆగస్టు3న రక్షాబంధనం(యుజుర్వేద ఉపాకర్మ)
ఆగస్టు 11న కృష్ణాష్టమి
ఆగస్టు 19న పొలాల అమావాస్య
రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి
ఈ మాసంలో రాఖీపౌర్ణమి, జంధ్యాల పండుగ, హయగ్రీవ జయంతిని ఒకేనాడు జరుపుకుంటారు. మానవ సంబంధాలను పరిపుష్టం చేసుకునేందుకు ఎంతో ఆప్యాయతలను పంచుకుంటూ రాఖీ పండుగ చేసుకుంటారు. జంధ్యాలు ధరించే వారంతా పాతవాటిని తీసి కొత్తవాటికి ప్రత్యేక పూజలు చేసి ఈ పవిత్ర పుణ్యతిథి రోజు ధరిస్తారు. దీనికి తోడు ఇదే రోజున హయగ్రీవ జయంతి రావడం విశేషం. హయగ్రీవుడు జ్ఞానప్రదాత. ఆయన జయంతి నాడు ప్రత్యేక పూజలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.
పూజల మాసం
ఈ మాసంలో అందరికీ సర్వశుభాలు కలుగుతాయి. ప్రతి సోమవారం వేములవాడ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం ఆలయ అద్దాలమండపంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శుభకార్యాలు, పూజలకు ఈ మాసం మంచిది.- అప్పాల భీమాశంకర్‌, వేములవాడ ఆలయ స్థానాచార్యులు


logo