మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 17, 2020 , 02:06:26

సాగులో విజయ‘లక్ష్మి’

సాగులో విజయ‘లక్ష్మి’

  • వెదజల్లే పద్ధతిలో  వరి సేద్యం
  • కొండపల్కల మహిళకు జాతీయస్థాయిలో గుర్తింపు
  • ఐసీఏఆర్‌ నుంచి ఉత్తమ మహిళా రైతు అవార్డు
  • జగ్జీవన్‌రామ్‌ పురస్కారం.. 50వేల నగదు, ప్రశంసా పత్రం
  • వెల్లువెత్తిన ప్రశంసలు, అభినందనలు

‘ఆకాశంలో సగం.. అన్నింటా సమానం’ అనే నినాదం స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగుతున్నారు.. అంతరిక్షం నుంచి అవనిదాకా అన్నింటా విజయబావుటా ఎగురవేస్తున్నారు.. వ్యవ‘సాయం’లోనూ కీలకపాత్ర పోషిస్తూ నవశకానికి నాంది పలుకుతున్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే కోవలో ముందుకెళ్తూ సాగులో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన మహిళా రైతు రూపిరెడ్డి లక్ష్మిపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం.  - జమ్మికుంట/ మానకొండూర్‌రూరల్‌ 

 కొండపల్కలకు చెందిన రూపిరెడ్డి లక్ష్మి తన భర్త తిరుపతిరెడ్డితో కలిసి వరిసాగులో సరికొత్త పద్ధతులను ఆవిష్కరిస్తున్నారు. ‘వెదజల్లే విధానం’లో 12 ఎకరాలను సాగుచేస్తున్నారు. కూలీల అవసరం లేకుండా ఏటా 430 నుంచి 450 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారు. ఈ పద్ధతిలో వడ్లను నానబెట్టి మొలకెత్తిన తర్వాత సిద్ధం చేసిన పొలంలో చల్లుతారు. కొయ్యకాళ్లనే వర్మీ కంపోస్టుగా మార్చి ఎరువుగా వినియోగిస్తారు. కలుపు నివారణకు మాత్రమే రసాయన ఎరువులను వాడుతున్నారు. 90 శాతం సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు. లక్ష్మి దంపతుల ప్రతిభను గుర్తించి జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు , డైరెక్టర్‌ ఉమారెడ్డి ఘనంగా సన్మానించారు. ఎక్కడ రైతు సదస్సులు నిర్వహించినా, వారిని ఆహ్వానించి సాగు పద్ధతులను అన్నదాతలకు తెలియజేస్తున్నారు.

జాతీయస్థాయిలో గుర్తింపు..

భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) వ్యవస్థాపక దినోత్సవం ( జూలై16న) సందర్భంగా వినూత్నంగా వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ యేడాది దేశవ్యాప్తంగా 11 జోన్ల నుంచి ఎంట్రీలను స్వీకరించారు. 10వ జోన్‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి) నుంచి 12 మంది రైతుల పేర్లను ఉత్తమ రైతు విభాగాలకు ప్రతిపాదించారు. అందులో వెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్న రూపిరెడ్డి లక్ష్మి పేరును కేవీకే శాస్త్రవేత్తలు పంపించారు. సాగు విధానాలు, దిగుబడులు, తదితర అంశాలకు సంబంధించిన నివేదికను అందజేశారు. మొత్తం 12 మందిలో లక్ష్మి సాగు విధానం తెలుసుకొని చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఉత్తమ మహిళా రైతు అవార్డుకు ఎంపిక చేశారు. జగ్జీవన్‌రామ్‌ పురస్కారంతోపాటు.. 50 వేల నగదు, ప్రశంసాపత్రాన్ని ఐసీఏఆర్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో అందజేయాల్సి ఉండగా, కరోనా నేపథంలో పురస్కారాల ప్రదాన కార్యక్రమాన్ని రద్దు చేశారు. పురస్కారాన్ని నేరుగా లక్ష్మి ఇంటికే పంపించనున్నారు. జోనల్‌ అటార్మీ డైరెక్టర్‌ డాక్టర్‌ వైజీ ప్రసాద్‌, కేవీకే చైర్మన్‌ పరిపాటి జనార్దన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయగోపాల్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ ప్రవీన్‌రావు, కలెక్టర్‌ శశాంక, కేవీకే శాస్త్రవ్తేతలు వెంకటేశ్వర్‌రావు, తదితరులు ఉత్తమ రైతు లక్ష్మికి ఫోన్‌ ద్వారా ప్రశంసలు, అభినందనలు తెలిపారు.



logo