మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 17, 2020 , 02:06:33

కరీంనగర్‌కు తలమానికంగా నిలువనున్న కేబుల్‌ బ్రిడ్జి

కరీంనగర్‌కు తలమానికంగా నిలువనున్న కేబుల్‌ బ్రిడ్జి

  • తుదిదశకు కేబుల్‌ వారధి పనులు lతాజాగా 3.50 కోట్లతో డైనమిక్‌ లైటింగ్‌కు ఏర్పాట్లు 
  • వంతెనపైకి వెళ్లేందుకు రెండు అండర్‌పాస్‌ బ్రిడ్జీలు   lఅప్రోచ్‌ రోడ్ల అభివృద్ధిపై అధికారుల దృష్టి
  • పురోగతిపై ఎప్పటికప్పుడు మంత్రి గంగుల పర్యవేక్షణ lతాజాగా హైదరాబాద్‌లో సమీక్ష
  • దసరా లోగా పూర్తి చేయాలని అధికారులు,ప్రతినిధులకు ఆదేశం

కరీంనగర్‌కు మణిహారంగా నిలువనున్న కేబుల్‌బ్రిడ్జి తుది దశకు చేరింది. త్వరలోనే అందుబాటులోకి రానుండగా, ఈ వారధిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దే ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా 3.50 కోట్లతో డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు, రెండు అండర్‌పాస్‌ వంతెనల నిర్మాణానికి సిద్ధమవుతున్నది. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌, తాజాగా గురువారం హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. నిర్మాణం వేగవంతం చేసి, దసరా వరకు పూర్తి చేయాలని సూచించారు. 

కరీంనగర్‌ కార్పొరేషన్‌ : కరీంనగర్‌కు తలమానికంగా నిలువనున్న కేబుల్‌ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఈ వంతెన పనులు తుది దశకు చేరగా, బ్రిడ్జిని కలుపుతూ నిర్మించే అప్రోచ్‌ రోడ్లు, ఇతర పనులపై అధికారులు దృష్టి సారించారు. ఈ పనులన్నింటినీ దసరా నాటికి పూర్తి చేసి వాహనాలను అనుమతించాలని మంత్రి గంగుల కమలాకర్‌ ఆదేశించడంతో పాటు బ్రిడ్జికి రెండు అండర్‌ పాస్‌ బ్రిడ్జిల నిర్మాణాలు, డైనమిక్‌ లైటింగ్‌ కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించారు. అలాగే అప్రోచ్‌ రోడ్ల నిర్మాణానికి అవసరమైయ్యే భూ సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

వేగంగా పనులు.. 

మానేరు వాగుపై కేబుల్‌ బ్రిడ్జి పనులకు 2017 డిసెంబర్‌ 30న అప్పటి రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శంకుస్థాపన చేశారు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో టాటా కన్సల్టెన్సీతో పాటు టర్కీకి చెందిన గ్లూమార్క్‌ సంస్థ సంయుక్తంగా పూర్తి విదేశీ పరిజ్ఞానంతో వంతెన నిర్మాణ పనులు మొదలు పెట్టాయి. 500 మీటర్ల తీగల వంతెనలో ప్రధానంగా రెండు పైలాన్లు నిర్మించారు. వీటితోపాటు రెండు ఇంటర్మీడియన్‌ ఫయర్స్‌, రెండు అంబూష్‌మెట్లను నిర్మించారు. రెండు పైలాన్ల మధ్య దూరం 220 మీటర్లు కాగా, పైలాన్‌ నుంచి ఇంటర్మీడియన్‌కు 110 మీటర్లు ఉంటుంది. ఇంటర్‌మీడియన్‌ నుంచి అంబూష్‌మెట్లకు మధ్య 30 మీటర్ల దూరం ఉంటుంది. ఈ బ్రిడ్జికి అవసరమైన కేబుల్‌ (తీగల)ను ఇటలీ నుంచి తీసుకువచ్చారు. దీంతోపాటు బ్రిడ్జిపై నాలుగు వరుస రోడ్డు నిర్మాణానికి కావాల్సిన 138 సెగ్మెంట్ల బిగింపును పూర్తి చేశారు. 7.5 మీటర్ల వెడల్పు రోడ్డు, ఇరువైపులా 1.5 మీటర్ల ఫుట్‌పాత్‌, ఇరువైపులా 0.5 మీటర్ల రైలింగ్‌ ఉంటుంది. దీంతోపాటు కమాన్‌ నుంచి బ్రిడ్జి వరకు రోడ్డు, బ్రిడ్జి నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్‌ రోడ్డు వరకు రోడ్డును ఆధునిక పద్ధతిలో నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. 

అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు.. డైనమిక్‌ లైటింగ్‌.. 

కమాన్‌ నుంచి కేబుల్‌ బ్రిడ్జి వరకు చేపడుతున్న రోడ్డు పనులు ఆర్‌అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో వేగంగా సాగుతున్నాయి. ఇ ప్పటికే మురుగుకాల్వ పనులు కాగా, రోడ్డు పనులు చేపడుతున్నారు. బ్రిడ్జిపైకి వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జికి ఇరువైపులా రెం డు అండర్‌ పాస్‌ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. అలాగే బ్రిడ్జిపై రూ.3.50 కోట్లతో డైనమిక్‌ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్ర ధాన తే దీల్లో తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ లైటిం గ్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్రిడ్జిపై పూర్తిస్థాయిలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేయనున్నారు.

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.. 

కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణంతో కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు వెళ్లే వాహనదారులకు ఆ మేరకు దూరం తగ్గడంతోపాటు అల్గునూర్‌ వద్ద ఉన్న ప్రస్తుత బ్రిడ్జిపై ట్రాఫిక్‌ తగ్గనుంది. దీంతోపా టు మానేరు రివర్‌ ప్రంట్‌లో భాగంగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యా యి. ఇప్పటికే మానేరు రివర్‌ ఫ్రంట్‌కు సంబంధించి ప్రతిపాదనలు, పనులకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. 

మంత్రి గంగుల పర్యవేక్షణ

కేబుల్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని మంత్రి గంగుల కమలాకర్‌ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పనుల వేగవంతంపై ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్‌, అధికారులకు దిశానిర్దే శం చేస్తున్నారు. మూడు రోజుల క్రితమే పనులను పరిశీలించారు. తాజాగా హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు, టాటా ప్రాజెక్టు ప్రతినిధులతో సమీక్షించారు. కరీంనగర్‌కు పర్యాటకశోభ తీసుకువచ్చే కేబుల్‌బ్రిడ్జిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 3.50 కోట్ల వ్యయంతో డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు రెండు అండర్‌పాస్‌ బ్రిడ్జిలు కూడా నిర్మిస్తామన్నారు. బ్రిడ్జి పనులు తుది దశకు వచ్చాయని, అప్రోచ్‌ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని ఆదేశించారు. అవసరమైన భూ సేకరణ చేసి పనులను దసరానాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.logo