మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 15, 2020 , 02:26:19

ఇంటికే కరోనా కిట్‌

ఇంటికే కరోనా కిట్‌

 • కొవిడ్‌ బాధితులకు  రాష్ట్ర సర్కారు భరోసా
 • 17 రోజులకు సరిపడా మందులు, ఇతర సామగ్రి
 • వైద్యుల నిరంతర పర్యవేక్షణ.. ట్రీట్‌మెంట్‌కు సూచనలు
 •  కరీంనగర్‌ జిల్లాలో 200 మందికి అందజేత

కరోనా వైరస్‌ కట్టడికి రాష్ట్ర సర్కారు పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. ఓ వైపు నియంత్రణ చర్యలు చేపడుతూనే, మరోవైపు బాధితులకు భరోసానిస్తున్నది. రాజధానికే పరిమితమైన సేవలను ఇప్పటికే జిల్లాలో అందుబాటులోకి తెచ్చింది. తాజాగా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉండి ఇంటిలోనే చికిత్స పొందుతున్న వారికి హోం ఐసొలేషన్‌ కిట్లు అందిస్తున్నది. అందులో 17 రోజులకు సరిపడా మందులు, శానిటైజర్‌ బాటిల్‌, గ్లౌజులు, ఇతర సామగ్రిని ఇస్తున్నది. ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజూ వైద్యులు ఆరా తీయడంతోపాటు ట్రీట్‌మెంట్‌కు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా సేవలందుతుండగా, ఎందరో బాధితులు కొవిడ్‌ను జయిస్తున్నారు. - కరీంనగర్‌ హెల్త్‌/ జగిత్యాల

కరీంనగర్‌ హెల్త్‌/జగిత్యాల : కరోనా నియంత్రణకు రాష్ట్ర సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వైరస్‌ను కట్టడి చేస్తూనే, ఎంతమంది బాధితులకైనా సేవలందించేందుకు తగిన ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్‌కే పరిమితమైన చికిత్సను ఇప్పటికే జిల్లాల్లో అందుబాటులోకి తెచ్చింది. జిల్లా ప్రధాన దవాఖాన్లతోపాటు ఏరియా వైద్యశాలల్లో సరిపడా బెడ్లను, వెంటిలేటర్లను, అవసరమైన వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచింది. కొత్తగా పలుచోట్ల ఐసొలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇదే సమయంలో టెలీమెడిసిన్‌ ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నది. తాజాగా వైరస్‌లోడ్‌ తక్కువ ఉన్న బాధితులు ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం కల్పించింది.  

ఎవరికీ హోం ఐసొలేషన్‌

పాజిటివ్‌ అని తేలిన వెంటనే వైద్యులు ఫోన్‌ చేస్తారు. ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తారు. లక్షణాలు లేని వారిని, అతి స్వల్ప, స్వల్ప లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారు, హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ బాధితులు, అవయవమార్పిడి చేసుకున్న వారు హోం ఐసొలేషన్‌కు అర్హులు కాదు. 60ఏండ్లు పైబడిన రోగులు, బీపీ, డయాబెటిస్‌, గుండె జబ్బులు, దీర్ఘకాలికి వ్యాధులు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వారిని వైద్యుల సూచన మేరకు హోం ఐసొలేషన్‌కు తరలిస్తారు.

హోం ఐసొలేషన్‌ కిట్లు..

కరోనా బాధితుల్లో చాలా వరకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. మరికొందరిలో సాధారణ దగ్గు, జలుబు, జ్వరం ఉంటున్నది. వ్యాధి తీవ్రత లేని ఇలాంటి వారిని దవాఖానలకు తరలించాల్సిన అవసరం లేదని, ఇండ్ల వద్దే ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స అందించాలని ఐసీఎంఆర్‌ సూచించింది. ఈ మేరకు ఇంటిలో చికిత్స పొందుతున్న వారికి రాష్ట్ర సర్కారు ‘హోం ఐసొలేషన్‌ కిట్ల’ను ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఈ కిట్‌లో 17 రోజులకు సరిపడా మందులు, ఇతర సామగ్రిని అందిస్తున్నది. ఈ కిట్లు ఇప్పటికే జిల్లాలకు చేరగా, బాధితులకు అందజేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లాలో 200 కిట్లు అందజేశారు. అలాగే బాధితులకు వైద్యులు మనోధైర్యం కల్పిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తూ, సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువైతే కొవిడ్‌ చికిత్స కేంద్రానికి తరలించి, చికిత్స అందించనున్నారు. అత్యవసరమైతే 104 ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు.

బలానికి మందులు..  

 • l విటమిన్‌ సీ-500ఎంజీ ఒక టాబ్లెట్‌ రోజుకు రెండు సార్లు. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి(తిన్న తర్వాత)
 • l విటమిన్‌ డీ- ఒక టాబ్లెట్‌ రోజుకు ఒకసారి ఉదయం తిన్న తర్వాత.
 • l మల్టీవిటమిన్‌ జింక్‌ ఒక టాబ్లెట్‌ రోజుకు రెండు సార్లు, ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (భోజనం తర్వాత)
 • జ్వరానికి..
 • l పారాసిటమాల్‌ 500 ఎంజీ లేదా 650 ఎంజీ రోజుకు రెండుసార్లు. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి (భోజనం తర్వాత)
 • జలుబు ఉంటే 3 నుంచి 5 రోజులు..
 • l లివోసిట్రజిన్‌ ఒక టాబ్లెట్‌ రోజుకు ఒకసారి.. ఉదయం (తిన్న తర్వాత)
 • దగ్గు గొంతు నొప్పి ఉంటే 3 నుంచి 5 రోజులు.
 • l అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ ఒక టాబ్లెట్‌ రోజుకు ఒకసారి రాత్రి తిన్న తర్వాత
 • వైరల్‌ మందులు 5 రోజులు..
 • l హైడ్రాక్సీక్లోరోక్విన్‌ 200 ఎంజీ ఒక టాబ్లెట్‌ చొప్పున రోజుకు రెండు సార్లు. ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత వేసుకోవాలి.
 • లూజ్‌ మోషన్స్‌ తగ్గేందుకు..
 • l స్పోరోలాక్‌ డీఎస్‌ టాబ్లెట్‌ రోజుకు రెండుసార్లు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తిన్న తర్వాత
 • గ్యాస్‌/కడుపులో మంట తగ్గేందుకు..
 • l ఫాంటాసిడ్‌ డీఎస్‌ఆర్‌ ఒక టాబ్లెట్‌ రోజుకు ఒకసారి ఉదయం తినక ముందు

రోజూ పరిశీలించాల్సినవి..

 • l జ్వరం : థర్మామీటర్‌ ద్వారా రోజుకు మూడు సార్లు చూసుకోవాలి.
 • lఆక్సిజన్‌/పల్స్‌రేట్‌ : పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా రోజుకు మూడుసార్లు చూసుకోవాలి.

తీసుకోవాల్సిన ఆహారం..

 • l అన్నీ తినవచ్చు(నాన్‌వెజ్‌కూడా),  పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, నువ్వుల ఉండలు తినాలి
 • l గోరువెచ్చని నీళ్లు రోజుకు 5 నుంచి 6 లీటర్లు తాగాలి.
 • l మిరియాల పాలు రోజుకు మూడుసార్లు తాగాలి.

అందుబాటులో హోంఐసొలేషన్‌ కిట్లు : కరీంనగర్‌ కలెక్టర్‌

కరీంనగర్‌ హెల్త్‌ : హోం ఐసొలేషన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక తెలిపారు. ఇక ముందు కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నామని, సరైన వసతులు లేని వారిని శాతవాహన యూనివర్సిటీకి తరలిస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఉన్నవారి కోసం వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఇంటి వద్ద చికిత్స పొందుతున్నవారికి డీఎంహెచ్‌వో, గ్రామాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు 376 మందికి పాజిటివ్‌ రాగా, 84 మంది కోలుకున్నారని, 24 మంది వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారని, 241 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారని వివరించారు. 


logo