గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 14, 2020 , 03:37:55

రెండేళ్ల నుంచి విజయవంతంగా రైతు బీమా

రెండేళ్ల నుంచి విజయవంతంగా రైతు బీమా

  • నిర్వహణ భారమైనా అమలు  
  • రైతులు ఎలా చనిపోయినా ఆర్థిక సాయం
  • 48 గంటల్లోనే నామినీ ఖాతాల్లో జమ
  • ఉమ్మడి జిల్లాలో 2,648 కుటుంబాలకు బీమా సొమ్ము
  • ఇప్పటి వరకు 132.40  కోట్ల చెల్లింపులు 
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు

రైతు రెండు చేతులు మట్టిలోకి పోతేనే నాలుగు మెతుకులు మన నోట్లోకి పోతాయి. అలాంటి రైతులను నాటి ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయి. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా అప్పుల బాధతో ఆత్మహత్యలు కొనసాగాయి. 

మోటర్ల దగ్గర తీగలు తగిలో.. ప్రమాదవశాత్తు బావుల్లో పడో.. పిడుగు పడో.. విషకీటకాల కాటుతోనే.. రోడ్డు ప్రమాదాల్లోనో.. అనారోగ్యంతోనే.. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. 

కర్షకులు చనిపోతే నాడు ఆదుకునే వారు లేక వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పులు తీర్చే దారి లేక, పిల్లలను సాకలేక ఆగమయ్యాయి. కనీసం సాయమందించే వారు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూశాయి.

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు ఎవుసాన్ని పండుగలా మార్చింది. అన్నదాత సంక్షేమానికి పెద్దపీట వేసింది. రైతు ఎలా చనిపోయినా ఆ కుటుంబానికి అండగా నిలువాలన్న ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా 2018 ఆగస్టు 15 నుంచి రైతు బీమా అమల్లోకి తెచ్చింది. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసున్న అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తూ, ప్రీమియం భారాన్ని కూడా భరిస్తున్నది. రైతు మరణించిన 48 గంటల్లోనే బాధిత కుటుంబానికి ఎల్‌ఐసీ ద్వారా 5 లక్షలు చెల్లిస్తూ, భరోసా ఇస్తున్నది. ఇంటికి పెద్ద దిక్కు లేరనే లోటు తప్ప అన్ని విధాలా ఆదుకుంటున్నది. 

లావణ్యకు కొండంత ధీమా

బండలింగంపల్లికి చెందిన ఉత్తం లావణ్యది చిన్న కుటుంబం. భర్త ఎల్లం (విజయ్‌కుమార్‌), మహాలక్ష్మీల్లాంటి ఇద్దరు కూతుళ్లు లాస్య, నందినితో సాఫీగా సాగుతున్న జీవితం. అంతలోనే విధి వెంటాడింది. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌గా పనిచేసే ఆమె భర్త 2012లో కిడ్నీ సంబంధ వ్యాధి బారిన పడడంతో కష్టాలు మొదలయ్యాయి. చికిత్స కోసం ఉన్న భూమిని అమ్మేయడంతో చివరకు ఓ పాత ఇల్లు, ఐదు గుంటల  సాగు భూమే మిగిలింది. ఓ వైపు వైద్య ఖర్చులు, మరోవైపు పిల్లల చదువులు, పోషణ భారం పెరిగింది. ఈ క్రమంలోనే ఎల్లం తీవ్ర అనారోగ్యంతో 2018 ఆగస్టు 14న అర్ధరాత్రి కన్నుమూయడంతో  ఆమె దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఎలా అని రంది పడ్డది. అప్పుడు ‘రైతు బీమా’ భరోసానిచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రాగా, అప్పటికే ఎల్లం వివరాలు ఆన్‌లైన్‌ కావడంతో బీమా వర్తించింది. భర్త మరణించిన మూడు రోజుల్లోపే లావణ్య ఖాతాలో ప్రభుత్వం 5లక్షలు జమ చేసింది. కొద్ది నెలల తర్వాత ఆ డబ్బులకు మరిన్ని కలిపి పిల్లల భవిష్యత్తు కోసం ఎల్లారెడ్డిపేటలో ఓ ప్లాటు కొన్నది. సీఎం చేసిన సాయం మరువలేమని, ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలుపుతున్నది.

“రాష్ట్ర రైతాంగంలో ఎక్కువ మంది సన్న చిన్న కారు రైతులే ఉన్నరు. వ్యవసాయమే వీరికి జీవనాధారం. ఏ కారణంతోనైనా ఆ రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాలు ఆగమవుతున్నయ్‌. ఇట్లాంటి కుటుంబాలకు ఒక భరోసా, ఒక ధీమా కల్పించడమే లక్ష్యంగా రైతు బీమా పథకం తెస్తున్నం. ఎంత ఖర్చైనా వెనుకాడం. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను కాపాడుకుంటం”

- 2018 ఫిబ్రవరి 26 కరీంనగర్‌ అంబేద్కర్‌ మైదానంలో జరిగిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ అవగాహన సదస్సు వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలవి.

ఆయన చెప్పినట్లుగానే 2015 ఆగస్టు 15 నుంచి ‘రైతు బీమా’ అమల్లోకి తెచ్చారు. రెండేళ్ల నుంచి విజయవంతంగా అమలు చేస్తూ, వేలాది కుటుంబాలకు భరోసా ఇస్తున్నారు. 

నాటి సమైక్య పాలనలో వ్యవసాయరంగంపై చిన్నచూపు ఉండేది. రైతులపై వివక్ష కొనసాగేది. విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం అష్టకష్టాలు పడ్డా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరికి పంట నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రభుత్వ పరంగా వచ్చే అరకొర సాయం కూడా అందేది కాదు. ఇంటి పెద్దను కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడ్డా ఆదుకోవాలన్న ధ్యాస కూడా ఉండేది కాదు. జీవో నంబర్‌ 421 ప్రకారం 1.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి ఉన్నా, బాధిత కుటుంబాలకు అందకపోయేది. నెలలు, ఏండ్లపాటు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసినా, ఫలితం ఉండేది కాదు. ఒక వేళ అందినా ఆ ఇచ్చిన మొత్తంలో 80 శాతం అప్పుల కిందనే పోయేవి. మిగతా సొమ్ము ఏ మూలకూ అయ్యేది కాదు. స్వరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. నాటి పాలకుల తీరుతో పరిహారం అందక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ నెలలు, ఏండ్ల తరబడి తిరిగిన రైతు కుటుంబాలను టీఆర్‌ఎస్‌ సర్కారు గుర్తించింది. 6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు జీవో నంబర్‌ 194 విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 85 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించింది. 1.50 లక్షలు మాత్రమే పొందిన రైతు కుటుంబాలకు అదనంగా 4.50 లక్షలు ఇచ్చింది. 

కరీంనగర్‌ వేదికగా ‘బీమా’.. 

రైతు కుటుంబాలకు భరోసా కల్పించే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరీంనగర్‌ వేదికగా రైతు బీమా పథకాన్ని ప్రకటించారు. 2018 ఫిబ్రవరి 26న 17 జిల్లాలకు సంబంధించిన ‘రైతు సమన్వయ సమితుల’ ప్రాంతీయ సదస్సును అంబేద్కర్‌ స్టేడియంలో నిర్వహించారు. రైతులకు బీమా సదుపాయం కల్పించాలని ఓ రైతు చేసిన విజ్ఞప్తికి సీఎం వెంటనే స్పందించి ఈ ప్రకటన చేశారు. ప్రకటించిన ఐదు నెలల్లోనే ఈ పథకం కార్యరూపం దాల్చింది. బీమా ఒప్పందం కుదుర్చుకున్న ఎల్‌ఐసీ నిబంధన ప్రకారం.. వయో పరిమితి 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లకు పరిమితం చేశారు. ఆగస్టు 15 నుంచి బీమా అమల్లోకి తెచ్చారు. రైతులు ఏ కారణం చేత మరణించినా కేవలం 48 గంటల్లో నామినీకి 5 లక్షలు అందిస్తున్నారు. 2019 ఆగస్టు 14న రెండోసారి పథకాన్ని పునరుద్ధరించారు. ఇది వచ్చే ఆగస్టు 13 వరకు కొనసాగనున్నది. తిరిగి ఈ పథకాన్ని మూడోసారి పునరుద్ధరించనున్నారు. 

రైతుల్లో 93 శాతం సన్న, చిన్నకారులే. కేవలం భూమిని నమ్ముకుని జీవిస్తున్న వారే. రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్న అకాల మరణం చెందితే మొన్నటిదాకా పట్టించుకునే దిక్కులేదు.   ఆ కుటుంబాలు వీధిన పడినా నాటి పాలకులు కనీసం కన్నెత్తి చూడలేదు. కానీ, టీఆర్‌ఎస్‌ సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ‘రైతు బీమా’తో భరోసా ఇస్తున్నది. పెద్దదిక్కుగా ఉన్న రైతు ఎలా మరణించినా కుటుంబాలకు ధీమానిస్తున్నది. 

కేసీఆర్‌ సారే.. పెద్ద దిక్కయిండు

బూరుగుపల్లికి చెందిన ఊట్కూరి సత్తయ్య, భారతి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు విజయ్‌. సత్తయ్య పేరుమీద గ్రామ శివారులో పది గుంటల వ్యవసాయ భూమి ఉన్నది. భార్యాభర్తలిద్దరూ ఉన్న కొద్ది భూమిలో సాగు చేసేవారు. ఇతర పనులకు కూడా వెళ్లేవారు. ఇద్దరు కూతుళ్ల పెళ్లి చేశారు. అంతలోనే సత్తయ్య ఆరోగ్యం బాగాలేకపోవడంతో దాదాపు 2 లక్షల వరకు అప్పు చేసి కరీంనగర్‌, హైదరాబాద్‌ దవాఖానల్లో చికిత్స చేయించారు. అయినా పరిస్థితి విషమించి 2018 సెప్టెంబర్‌ 5న చనిపోవడంతో ఆ తల్లీకొడుకులు ధైర్యం కోల్పోయారు. అంతకు ముందు చేసిన అప్పు కలిపి మొత్తం 3 లక్షల వరకు కాగా, ఎలా తీర్చాలో తెలియక ఆందోళన చెందారు. ఇదే సమయంలో ‘రైతు బీమా’ వారికి ధీమా నిచ్చింది. సత్తయ్య చనిపోయిన రెండు రోజుల్లోనే నామినీగా ఉన్న కొడుకు ఖాతాలో 5 లక్షలు జమ కాగా, అప్పులు తీర్చారు. తర్వాత ఉన్న భూమిని సాగు చేసుకుంటూ, ఇతర పనులకు వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌ దేవుడిలెక్క తమలాంటి పేద రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారని ఆ తల్లీకొడుకులు చెబుతున్నారు. 

కృష్ణ కుటుంబానికి ధైర్యం

కురిక్యాలకు చెందిన సముద్రాల కృష్ణకు భార్య రజిత, ఇద్దరు కూతుళ్లు. కృష్ణ పేరు మీద గ్రామ శివారులో 6 గుంటల భూమి ఉన్నది. కృష్ణ డిష్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. దురదృష్టవశాత్తూ 2018 డిసెంబర్‌ 13న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటికే 2 లక్షల అప్పులు ఉండగా, భర్తను కోల్పోయి ఇద్దరు కూతుళ్లతో జీవితాన్ని ఎలా నెట్టుకు రావాలని బాధపడుతున్న రజితకు రైతు బీమా భరోసానిచ్చింది. నామినీగా ఉన్న రజిత ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల బీమా సొమ్ము జమ్మచేసింది. 2019 ఫిబ్రవరి 11న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆమె ఇంటికి వెళ్లి మంజూరు పత్రాలను అందజేశారు. 2 లక్షల అప్పు తీర్చి, ఇద్దరు కూతుళ్ల పేరున లక్ష చొప్పున డిపాజిట్‌ చేసింది. మిగతా డబ్బులతో భర్త చేసిన డిష్‌ ఆపరేటర్‌ పని చేసుకుంటూ కూతుళ్లను చదివిస్తున్నది. సీఎం కేసీఆర్‌ నిజంగా తమ కుటుంబానికి దేవుడిలాంటోడని చెబుతున్నది. - గంగాధర 

జ్యోతి జీవితం.. నిలవడ్డది

మన్నెంపల్లికి చెందిన సానకొండ రాజయ్య, రాజేశ్వరి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు అనూష, జ్యోతి. తమకున్న ఎకరం 18 గుంటలలో వ్యవసాయం చేయడంతోపాటు టైలరింగ్‌ పనులు చేసేవారు. ఈ పనులు లేనప్పుడు కూలీకి వెళ్లేవారు. రాజయ్య పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించగా, అతని భార్య రాజేశ్వరి కూడా ఐదేళ్ల క్రితం చనిపోయింది. ఆ తర్వాత అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అష్టకష్టాలు పడుతూ కాలం వెల్లదీశారు. పెద్ద కూతురు అనూష కూడా అనారోగ్యంతో 2018 నవంబర్‌ ఒకటిన మరణించడంతో జ్యోతి ఒంటరిదైంది. అమ్మా, నాన్న, అక్క అనారోగ్యంతో ఒక్కొక్కరుగా మరణించడంతో జ్యోతి జీవితం చీకటిమయమైంది. అయితే తమకు వారసత్వంగా వచ్చిన భూమి అక్క అనూష పేరు మీద ఉండడంతో ఆమె మరణ వార్త తెలుసుకుని వ్యవసాయ శాఖ అధికారులు జ్యోతిని కలిసి బీమా విషయాన్ని చెప్పారు. వివరాలు నమోదు చేసుకుని నెల తిరిగే లోపు 5 లక్షలు ఆమె ఖాతాలో జమ చేయించారు. అయిన వారందరినీ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయిన జ్యోతికి బీమాతో భరోసా దొరికినట్లయింది. ఆ డబ్బులను తన పేరుమీదబ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసుకున్నది. 2019 నవంబర్‌ 3న కరీంనగర్‌కు చెందిన లింగంపల్లి నరేశ్‌తో బంధువుల సమక్షంలో వివాహం చేసుకుని, ఆనందంగా ఉంటున్నది. -తిమ్మాపూర్‌ రూరల్‌

రెండేళ్లలో 132.40 కోట్లు పంపిణీ.. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగింది. మొత్తం 6,35,021 మంది రైతులు ఉన్నారు. అందులో చివరిసారి అర్హులైన 3,36,568 మందిని రైతు బీమాలో నమోదు చేశారు. రెండేళ్లలో 2,745 మంది రైతులు మరణించగా, 2,648 కుటుంబాలకు 5 లక్షల చొప్పున 132.40 కోట్లు పంపిణీ చేశారు. పెద్దపల్లి, సిరిసిల్లలో మరణించిన ప్రతి కుటుంబానికీ బీమా క్లెయిం అయ్యింది. వివిధ కారణాలచేత కరీంనగర్‌లో 49, జగిత్యాలలో 48 కుటుంబాలకు క్లెయిం కావాల్సి ఉన్నది. చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు యంత్రాంగం చెబుతున్నది.

 కుటుంబాలకు ధీమా..

ఏటా వందలాది మంది రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. ఆత్మహత్య చేసుకొని కొందరు, ప్రమాదాల్లో మరికొందరు చనిపోతున్నారు. దీంతో ఇంటి పెద్దదిక్కులను కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొడుకులు, బిడ్డలు, పెద్ద దిక్కులను కోల్పోయిన కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే అయినా, బీమా పథకం కొండంత ధీమా ఇస్తున్నది. కష్టాల్లో భరోసా కల్పిస్తున్నది.  

 ఒక్కో రైతు పేరిట 3,555.94 ప్రీమియం..

రైతు ఎలా మరణించినా బాధిత కుటుంబానికి 5 లక్షల బీమా వచ్చేలా ఎల్‌ఐసీతో రాష్ట్ర సర్కారు ఒప్పందం చేసుకున్నది. ఈ మేరకు 2018 ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించింది. గడిచిన రెండేళ్లలో మరణించిన రైతు కుటుంబాలకు 48 గంటల్లో 5 లక్షల చెక్కు అందిస్తున్నది. 2018లో ఒక్కో రైతుకు 1,925తోపాటు  346.50 జీఎస్టీ సహా మొత్తం 2,271.50 ప్రీమియం చెల్లించింది. ఇక 2019లో ఈ ప్రీమియం కాస్త పెరిగినా రైతులపై భారం పడకుండా భరించింది. గతేడాదిలో 3,013.50తోపాటు 542.44 జీఎస్టీ కలిపి 3,555.94 చొప్పున ఒక్కో రైతు పేరిట ఎల్‌ఐసీకి చెల్లించింది.

 నేనెప్పటికీ మరిచిపోలేను..

2018 జూలై 25 నుంచి రైతుల భూముల వివరా లను ఆన్‌లైన్‌ చేశాం. ఆగస్టు 14 అర్ధరాత్రి తర్వాత రైతు బీమా పాలసీ అమలయ్యింది. అదే అర్ధరాత్రి తర్వాత బండలింగంపల్లికి  చెందిన ఉత్తం ఎల్లం చనిపోయాడు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పో యింది. ఉదయం ఆ ఊరి ప్రజలు ఎల్లం భూమి నమోదు వివరాలు తెలుసుకునేందుకు నన్ను అడిగా రు. అదే రోజు చూడగా ఆన్‌లైన్‌లో నమోదై ఉన్నాయి. అతడు పాలసీకి అర్హుడేనని తెలిపా. మూడు రోజుల్లోనే బీమా డబ్బులు ఎల్లం కుటుంబానికి అందాయి. సరైన సమయంలో మేం వివరా లు నమోదు చేయడం వల్లనే పేద కుటుంబానికి రైతుబీమా అండ గా నిలిచిందని బండలింగంపల్లి గ్రామస్తులు నాతో అన్న విషయా న్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ పథకం నిజంగా ఎంతో మందికి భరోసాగా నిలుస్తున్నది.

- చాడ భూంరెడ్డి, మండల వ్యవసాయ అధికారి, ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల జిల్లా  )


logo