శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 13, 2020 , 02:08:35

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో రాబడి.. పని తక్కువ.. ఆదాయం ఎక్కువ..

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో రాబడి.. పని తక్కువ.. ఆదాయం ఎక్కువ..

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో రాబడి.. పని తక్కువ.. ఆదాయం ఎక్కువ.. కాస్త ఓపిక ఉండాలేగాని సాగు బంగారమవుతుంది. సిరుల పంట పండుతుంది. అన్నీ కలిసివస్తే రైతు జీవితమే  మారిపోతుంది. ఏ కర్షకుడికైనా ఇంతకంటే ఏం కావాలి. అలాంటి ఆధునిక సేద్యమే చేస్తూ శంకరపట్నం మండలం లింగాపూర్‌కు చెందిన రైతు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనప్పటికీ ప్రవృత్తిగా రైతు అవతారమెత్తాడు. సంప్రదాయ పంటల వైపు వెళ్లకుండా అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌ ఉన్న శ్రీ గంధం.. అగర్‌ ఉడ్‌ మొక్కలు పెంచుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. - శంకరపట్నం

లింగాపూర్‌కు చెందిన తాడమల్లారెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ సర్కారు పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాడు. చిన్ననాటి నుంచే సేద్యమంటే ఇష్టం. స్వగ్రామంలో పదెకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది. అటు విధులు నిర్వర్తిస్తూనే ఇటు సేద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు. సంప్రదాయ పంటలు వేస్తే అంతగా లాభం ఉండకపోగా, విధులకు ఆటంకం కలుగుతుందని భావించి, ఆధునిక సేద్యం చేయాలని భావించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న శ్రీ గంధం, అగర్‌ ఉడ్‌ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

 సొంతంగా యూట్యూబ్‌ చానల్‌

యూట్యూబ్‌లో సెర్చ్‌ చేసి లాభదాయక పంటలపై ప్రయోగాలు చేసే మల్లారెడ్డి స్వతహాగా ఓ యూట్యూబ్‌ చానల్‌ సైతం నిర్వహిస్తున్నాడు. తనకు ఫోన్‌ చేసే యువ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ సాగువైపు ప్రోత్సహిస్తున్నాడు. అంతేగాక మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో నర్సరీని నిర్వహిస్తూ అగర్‌ ఉడ్‌, శ్రీ గంధం మొక్కలను అతి తక్కువ రేటుకే విక్రయిస్తున్నట్లు మల్లారెడ్డి చెబుతున్నాడు. 

 శ్రీగంధానికి భారీ డిమాండ్‌.. 

శ్రీ గంధం ప్రపంచంలోనే అతి ఖరీదైన కలప వృక్షం. కిలోకు రూ. 6వేల నుంచి రూ. 7వేల దాకా పలుకుతుంది. నాణ్యతను బట్టి ధర పెరుగుతుంది. ఇందులో పదుల సంఖ్యలో రకాలు ఉంటాయి. దీనికి అన్ని రకాల నేలలు అనుకూలం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం ఇచ్చే దీర్ఘకాలిక పంట ఇది. సాధారణంగా ఈ చెట్టు ద్వారా 12 ఏండ్ల నుంచి లాభాలు మొదలవుతాయి. కానీ 15 నుంచి 20 ఏండ్లకు మాత్రమే తగిన ప్రతిఫలం వస్తుంది. జీవితకాలంలో ఒక్కోచెట్టు నుంచి 20కిలోలకుపైగా కలప వస్తుంది. ఎకరాకు తక్కువలో తక్కువ రూ. 5-6 కోట్ల ఆదాయం వస్తుంది. శ్రీ గంధం వృక్షంలో బెరడు, కాండం, వేర్లు అన్నీ సిరులు కురిపించేవే కాగా, కాస్మొటిక్స్‌, ఔషధాల తయారీలో వాడతారు. మొక్క కోతకు వచ్చిన తర్వాత మైసూర్‌ శాండల్‌ కంపెనీ లేదా ఇతర కంపెనీలకు సమాచారం అందిస్తే వచ్చి కొనుక్కెళ్తారు. కాగా, మల్లారెడ్డి 2015లో శ్రీగంధం సాగుకు శ్రీకారం చుట్టాడు. ఎకరానికి 430 చొప్పున మూడెకరాల్లో దాదాపు 1300 మొక్కలు నాటాడు. ఇవి ఇతర మొక్కల వేర్ల నుంచి పోషకాలు గ్రహించి పెరుగుతాయి. ఈ క్రమంలో వాటికి అతిథేయి మొక్కలుగా 500 ఎర్రచందనం, 1000 మలబారు వేప, 500 టేకు మొక్కలు కూడా నాటాడు. ఐదేళ్లుగా నిత్య సంరక్షణ చర్యలతో మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరిగాయి. మరో ఐదారేళ్లు ఆగితే లాభాలు మొదలవుతాయని చెబుతున్నాడు.

ఖరీదైన కలప  అగర్‌ ఉడ్‌ 

అగర్‌ ఉడ్‌ ప్రపంచ వ్యాప్తంగా ఖరీదైన ఉడ్‌. ఈ చెట్టులో ముఖ్యమైంది రెసీన్‌. దీని అమ్మకం ద్వారానే రైతుకు ఆదాయం వస్తుంది. వ్యావహారిక భాషలో చెప్పాలంటే బంక, గుజ్జు లాంటిదే రెసీన్‌ కూడా. ఇది చెట్టు కాండం మధ్యలో ఉత్పత్తి అవుతుంది. దీనికి మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంటుంది. మొక్కలు నాటిన తర్వాత 8 నుంచి 10 ఏండ్లు ఓపిక పడితే, ఎకరాకు  కోట్లలో ఆదాయం పొందవచ్చు. ఒక్క చెట్టు నుంచి మంచి రెసీన్‌ ఉత్పత్తికి 8 నుంచి 10 ఏండ్ల సమయం పడుతుంది. ఒక్కో చెట్టుకు దాని వయసును బట్టి కనీసం 3-5 కేజీల రెసీన్‌ ఉత్పత్తి అవుతుంది. మన దేశంలో ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం, ఒక కేజీ ధర కనీసం రూ. 20 వేలు.నాణ్యతను బట్టి ధర పెరుగుతుంది. రెసీన్‌తోపాటు అగర్‌ ఉడ్‌ చెక్కకు, అగర్‌ ఉడ్‌ నూనెకు ఫుల్‌ డిమాండ్‌ ఉంది. అగర్‌ ఉడ్‌ ఆయిల్‌ను సుగంధ ద్రవ్యాల తయారీలో, ఔషధాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మల్లారెడ్డి 2019లో అగర్‌ ఉడ్‌ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఎకరాకు 1200 మొక్కల చొప్పున 1.5 ఎకరాల్లో 1800 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. అతిథేయిగా కంది పంటను వేశాడు. మొక్కలు మీటరు మేర పెరిగాయి. అగర్‌ ఉడ్‌ సాగుకు పెట్టుబడి.. దూర దృష్టి, సహనం అవసరమని, ఆలోచించి వ్యవహరిస్తే ప్రతి రైతు అమీర్‌ కావచ్చని మల్లారెడ్డి చెబుతున్నాడు. ఒక చెట్టుకు మూడు కేజీల రెసీన్‌ ఉత్పత్తి అయినా.. ఎకరానికి తక్కువలో తక్కువ  ఎకరాకు రూ.4-5 కోట్ల ఆదాయం ఎక్కడికీ పోదని అంటున్నాడు.

 కోటీశ్వరులు కావచ్చు.. 

శ్రీగంధం, అగర్‌ ఉడ్‌తో వెంటనే లాభాలు రావు. ఇవి దీర్ఘకాలిక పంటలు. వచ్చే ఆదాయంతో పోల్చితే సాగుకు ఖర్చు చాలా తక్కువ. మూడేండ్ల దాకా శ్రద్ధ చూపితే వాటంతట అవే పెరుగుతయ్‌. ఇతర ఖర్చులేమి ఉండవు. కేవలం సేంద్రియ ఎరువులు వేస్తే సరిపోతుంది. ఒక్కో చెట్టు జీవితకాలంలో 20 కిలోలకుపైగా హార్డ్‌ ఉడ్‌ ఇస్తుంది. మొత్తంగా ఒక శ్రీ గంధం చెట్టుకు 12 ఏండ్లకు కేవలం రూ.8వేల ఖర్చే అవుతుంది. కానీ జీవితకాలంలో ఒక్కో చెట్టు వయస్సును బట్టి రూ.1 - 1.50లక్షల ఆదాయం వస్తుంది. మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తే అంతకంటే ఎక్కువే వస్తుంది. - తాడ మల్లారెడ్డి, ఉపాధ్యాయ రైతు  


logo