బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 12, 2020 , 01:30:39

రైతన్న.. మీ డ్రిప్‌ బాగుందా..

రైతన్న.. మీ డ్రిప్‌ బాగుందా..

సాధారణ పద్ధతిలో ఎకరంలో సాగు చేసే నీటితో డ్రిప్‌ ద్వారా మూడు ఎకరాల్లో పంట పండించవచ్చు. అందుకే నేటికీ అనేక మంది రైతులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఆయా పరికరాల నిర్వహణ తెలియకపోవడం.. సంస్థలూ అవగాహన కల్పించకపోవడంతో పూర్తి స్థాయిలో వాటిని వినియోగించుకోలేక పోతున్నారు. కొంత సమయం కేటాయించి యాజమాన్య పద్ధతులు పాటిస్తే డ్రిప్‌తో నిరాటంకంగా సేద్యం చేసుకోవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు.-తిమ్మాపూర్‌ రూరల్‌ 

జిల్లాలో 12,923 మంది లబ్ధిదారులు ఉండగా, 11,500 హెక్టార్లలో బిందుసేద్యం (డ్రిప్‌)పద్ధతిలో సాగు చేస్తున్నారు. చాలా మందిలో డ్రిప్‌ పరికరాలపై అవగాహన లేకపోవడంతో రసాయనాల అవశేషాలు పైపుల్లోనే ఉండిపోతున్నాయి. కొంత కాలం తర్వాత వాటి రంధ్రాలు మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతున్నది. సరైన పద్ధతులు పాటిస్తూ.. నిర్వహణపై అవగాహన పెంచుకుంటే డ్రిప్‌ సిస్టమ్స్‌ కనీసం 10-12 ఏండ్లు మన్నికగా పనిచేసే అవకాశం ఉంటుంది.

నిర్వహణ భారం కాదు..

డ్రిప్‌కు సరిపడా ప్రెషర్‌ వచ్చేందుకు అన్ని ప్రధాన వాల్వులు, ల్యాటరల్‌ చివర మూసివేయాలి. నీటి పారుదలను గమనించి మెయిన్‌ వాల్వును ఓపెన్‌ చేయాలి. బైపాస్‌ వాల్వును, ఫిల్టర్‌ వద్ద ఉన్న కంట్రోలర్‌ వాల్వునూ తెరవాలి. మోటరును స్టార్ట్‌ చేసి, సరిపడా ప్రెషర్‌ పెరిగే దాకా బైపాస్‌ వాల్వును మూస్తూ పోవాలి. డ్రిప్‌కు సరిపడా ప్రెషర్‌ ఫిల్టర్‌ వద్ద ఉండేలా ప్రెషర్‌గేజ్‌ ద్వారా గమనించాలి. ఎల్లప్పుడూ అదే పీడనంతో నడపాలి. ఒకవేళ నీటిపంపు ద్వారా కలిగే ప్రెషర్‌, డ్రిప్‌కు సిఫారసు చేసిన పీడనం కన్నా ఎక్కువ ఉంటే బైపాస్‌ వాల్వు ద్వారా ఎక్కువైన నీటిని తిరిగి బావిలోకి పంపాలి. సిఫారసు చేసిన దాని కన్నా డ్రిప్‌లో ప్రెషర్‌ తక్కువ ఉంటే పైపులు లీక్‌ అవడం గాని, ఇతర వాల్వులు తెరిచి ఉన్నాయోమో పరిశీలించాలి. ప్రతి షిఫ్ట్‌ సిఫారసు చేసిన ప్రెషర్‌ను గమనించాలి. ప్రతి రోజూ నీటి పారుదల తర్వాత ఫిల్టర్లను, ఫర్టిగేషన్‌ పరికరాలను కడగాలి. వారానికోసారి లీకేజీలను గమనించాలి. ల్యాటరల్‌ పైపులు, వాల్వులను ప్రతి పంట తర్వాత గాని, నీటి రకాన్ని బట్టి 5-10తడుల తర్వాత గానీ శుభ్రపర్చాలి.

సీజన్‌కు ముందే సిద్ధం చేసుకోవాలి

నీటి పారుదల సమయానికి ముందే వ్యవస్థను కొత్త రుతువు కోసం సిద్ధంగా ఉంచాలి. గత సంవత్సరంలో చేసిన తాత్కాలిక రిపేర్లను దృష్టిలో ఉంచుకుని కాస్త శ్రద్ధ వహించాలి. పంపు పనితనం, పీడనం, డిశ్చార్జి రేటును ఒకసారి తనిఖీ చేయాలి. గ్రావెల్‌ ఫిల్టర్‌ను తెరిచి ఇనుము మట్టాన్ని చూసుకోవాలి. డిస్క్‌ ఫిల్టర్లను పరిశీలించాలి.

 పైపులు పదిలం

డ్రిప్‌ ద్వారా పంట పూర్తవగానే.. పైపులను జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా మంది రైతులు పంట పూర్తయిన తర్వాత ఒక కుప్పలా పెడుతున్నారు. దీంతో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పైపులన్నీ కాలిపోతున్నాయి. మళ్లీ కొనాలంటే రైతుకు ఆర్థిక భారం తప్పదు. దాంతో పాటు సెకండ్‌ క్వాలిటీ రకాలే మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పంట పూర్తయిన వెంటనే భద్రంగా పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.

నిర్వహణతో కాపాడుకోవాలి

డ్రిప్‌ సిస్టంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు. ఎరువులు కూడా ఒకే మోతాదులో మొక్కకు అందడం వల్ల పంట సమాంతరంగా చేతికి వస్తుంది. రైతులు కొన్ని తేలిక పద్ధతులు ఉపయోగించి డ్రిప్‌ సిస్టంను కాపాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు వాల్వ్‌లను పరిశీలించాలి. వీటి కోసం ప్రస్తుతం రైతుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇంకా సబ్సిడీ ప్రకటించలేదు.-కే స్వాతి, ఉద్యానవన శాఖ అధికారి


logo