మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 12, 2020 , 01:30:38

ఎగువే లక్ష్యం

ఎగువే లక్ష్యం

  • lవరద కాలువ కుడి, ఎడమ గ్రామాలకు నీళ్లిచ్చే దిశగా సర్కారు 
  • lఇటీవలే కథలాపూర్‌ జడ్పీటీసీ, వెంకటాపూర్‌ మాజీ సర్పంచ్‌కు నేరుగా సీఎం ఫోన్‌
  • lపరీవాహక ప్రాంత సమస్యలపై ఆరా
  • lనేడు హైదరాబాద్‌లో సమావేశం
  • lరావాలంటూ ఇద్దరికి ఆహ్వానం
  • lనేడు మరింత స్పష్టత వచ్చే అవకాశం 

కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ/ కథలాపూర్‌/ మేడిపల్లి : సమైక్య రాష్ట్రంలో వట్టిపోయిన వరదకాలువ నేడు అన్నదాతల పాలిట వరంలా మారింది. వేలాది మంది రైతులకు కొంగు బంగారమైంది. ముఖ్యమంత్రి ఆలోచనలనుంచి అంకురించిన ఎస్సారెస్పీ పునర్జీవ పథకం, వరదకాలువను సజీవ నదిగా మార్చింది. 122 కిలోమీటర్ల మేర నిండు గోదారిని తలపిస్తూ, ఏడాది కాలంగా అస్యూర్డ్‌ నీటిని అందిస్తున్నది. ప్రస్తుతం వానకాలం సాగు కోసం నీరందించేందుకు నింపుతున్నారు. ఇదే సమయంలో వరదకాలువ ఎగువ ప్రాంతాల గ్రామాలకు లిఫ్ట్‌ ద్వారా నీరందించేందుకు ముఖ్యమంత్రి చూపుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి ఎత్తిపోసే నీరు 99.02కిలోటర్‌ వద్ద (రామడుగు మండలం శ్రీరాములపల్లి) వరద కాలువలో కలుస్తుంది. వరదకాలువ 102 కిలోమీటర్‌ వద్ద (షానగర్‌) హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్లు పెట్టారు. గేట్లు ఎత్తితే దిగువన రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి నీరు వెళ్తుండగా, దించితే ఎగువన ఎస్సారెస్పీ వైపు ఎదురెక్కుతుంది. అలాగే లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే పరిస్థితి ఉన్నప్పుడు రాజరాజేశ్వర జలాశయానికి ఒక టీఎంసీ, వరద కాలువ నుంచి ఎస్సారెస్పీకి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే 122 కిలోమీటర్ల పొడవు ఉన్న వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా గుర్తించారు. ఇందులో 122 కిలోమీటర్‌నుంచి 102 వరకు మొదటి రిజర్వాయర్‌గా, అలాగే 102 కిలోమీటర్‌ నుంచి 73 కిలోమీటర్‌వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్‌ పంపుహౌస్‌ గేట్ల దాకా రెండో రిజర్వాయర్‌, 73 కిలోమీటర్‌ నుంచి 34 కిలోమీటర్‌ వద్ద ఉన్న రాజేశ్వర్‌రావు పేట పంపుహౌస్‌ గేట్ల దాకా మూడోది, 34కిలోమీటర్‌ నుంచి 0.10 కిలోమీటర్‌ ముప్కాల్‌ వద్ద ఉన్న పంపుహౌస్‌ దాకా నాలుగో రిజర్వాయర్‌గా గుర్తించారు. ఈ నాలుగు రిజర్వాయర్ల పరిధిలో అంటే 122 కిలోమీటర్ల పొడవునా 1.7 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వీటి పరిధిలోని చెరువుల సామర్థ్యం 1.3 టీఎంసీలు, అంటే వరదకాలువతోపాటు చెరువులను నింపుకుంటే మూడు టీఎంసీలకుపైగా నీటిని నిల్వ ఉంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానం వల్ల సంబంధిత ప్రాంత రైతులకు 365 రోజులు నీరు శాశ్వతంగా అందుబాటులో ఉండే అవకాశముంటుంది.

ఎగువకు నీళ్లిచ్చే అంశంపై నేడు సమావేశం.. 

వరదకాలువ ద్వారా 34 తూములు పెట్టి.. 60 చెరువులను నింపుతున్నారు. ఇప్పటివరకు దిగువన ఉన్న గ్రామాలకు నీళ్లు ఇస్తూ వస్తున్నారు. అయితే.. ఎగువన ఉన్న గ్రామాలకు తూముల ద్వారా నీళ్లు ఇవ్వడం సాంకేతికంగా సాధ్య పడడం లేదు. ఈ విషయంలో ఆ గ్రామాల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులపై ప్రస్తుతం ముఖ్యమంత్రి దృష్టిపెట్టారు. దశాబ్దాల కాలం నుంచి కరువుతో అల్లాడిన మేడిపల్లి, కథలాపూర్‌తోపాటు మరికొన్ని మండలాల్లోని ఎగువన ఉన్న గ్రామాలకు సైతం నీళ్లు అందించేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 8న కథలాపూర్‌ జడ్పీటీసీ నాగం భూమయ్య, రైతు బంధు సమితి జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడు, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి స్వయంగా ఫోన్‌ చేసి, మాట్లాడారు. కుడి, ఎడమ గ్రామాల రైతుల అవసరాలు తీర్చడానికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజినీరింగ్‌ అధికారులతో మూడు నాలుగు రోజుల్లోనే కూర్చొని మాట్లాడుకుందామని హామీ ఇచ్చారు. మరుసటి రోజే రాష్ట్ర ప్రణాళికా సంఘం చైర్మన్‌, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులతో హైదరాబాద్‌లో సమావేశమై, వరదకాలువ కుడి, ఎడమ గ్రామాలకు నీళ్లివ్వడానికి ప్రతిపాదనలు తయారు చేసే విషయంపై దిశానిర్దేశం చేశారు. తాజాగా నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో సీఎం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి రావాలని పిలుపు రాగా, అధికారులతో కలిసి వెళ్తున్నామని భూమారెడ్డి, శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి నేడు సమావేశం నిర్వహిస్తుండడంతో ఈ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం               చేస్తున్నారు.  


logo