గురువారం 13 ఆగస్టు 2020
Karimnagar - Jul 09, 2020 , 01:09:18

కరోనా కట్టడికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి

కరోనా కట్టడికి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ప్రతి ప్రైవేట్‌ వైద్య సంస్థ ఏదో రకంగా పేదలకు వైద్య సేవలు అందించాలని, కొవిడ్‌19ను అరికట్టేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌లోని ప్రతిమ వైద్యశాలలో ఆయన మాట్లాడుతూ, నిరుపేదల కోసం ప్రతిమ ఫౌండేషన్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని కొనియాడారు. ప్రతిమ సంచార రథం ద్వారా పేదల ముంగిట్లోకే వెళ్లి సేవలందించడం అభినందనీయమన్నారు. ఎక్స్‌రే, ఎలక్ట్రో కార్డియోగ్రాం, కార్డియాక్‌ ఫ్రొఫైల్‌, పాప్‌ స్మియర్‌, మమ్మోగ్రఫీ, మినీ లాబొరేటరీ వంటి సేవలందించేందుకు ముందుకు వచ్చిన ప్రతిమ ఫౌండేషన్‌ చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాసరావు అభినందనీయులన్నారు. ఇటీవల చేపట్టిన కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమం ఎంతో బాగుందనారు. మంచిదన్నారు. కొవిడ్‌-19తో సంపన్న దేశాలే అతలాకుతలమవుతున్నాయని, అమెరికా, యూరప్‌, ఇటలీ, ఇంగ్లాండ్‌ వంటి దేశాల్లోనూ కరోనా బాధితులకు సేవలు అందించేందుకు వైద్య సదుపాయాలు సరిపోవడం లేదని తెలిపారు. ఇలాంటి సమయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉండగా, కొందరు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో దేశం మూడు నాలుగు స్థానాల్లో ఉందని, ఇలాంటప్పుడు తాము కూడా కేంద్రం విఫలమైందని అనవచ్చని, కానీ తాము వివేకంతో ఆలోచిస్తున్నామన్నారు.

కరోనా పాజిటివ్‌ కేసుల్లో 98 శాతం మంది కోలుకుంటున్నారని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న 2 శాతం మంది మాత్రమే మృత్యువాత పడుతున్నారని చెప్పారు. సహచర మంత్రి ఈటల రాజేందర్‌ బాగా పనిచేస్తున్నారని, గాంధీ దవాఖానలో మంచి సేవలు లభిస్తున్నాయని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇంకా కొనసాగిస్తే అన్ని రంగాలు కుప్పకూలే ప్రమాదం ఉందన్నారు. కొవిడ్‌ కారణంగా ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన పెరిగిందని, మన భవిష్యత్తు కోసం ఇది మంచి పరిణామమన్నారు. భవిష్యత్తులో మరిన్ని వైరస్‌లు విజృంభించే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోందని, వైద్య రంగంలోని నిపుణులు ముఖ్యంగా యువత ఇలాంటి వాటిపై పరిశోధనలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సూచించారు. దేశంలో ఎక్కడ చూసినా చైనా వస్తువులే కనిపిస్తాయని, కానీ, చైనాలో మాత్రం మన వస్తువులు కనిపించవన్నారు. టెక్నాలజీలో మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌' విధానం ఆహ్వానించ దగినదేనని, అయితే అది నినాదంగా మిగిలి పోకూడదని తాను వ్యక్తిగతంగా ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 

సేవలను విస్తరిస్తున్నాం : వినోద్‌కుమార్‌

ప్రతిమ ఫౌండేషన్‌ వైద్య రంగంలో ఎన్నో సేవలు అందిస్తున్నదని, రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ పరిధికి విస్తరిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఉత్తర తెలంగాణలో కోటి మాస్కులు పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు గ్రామీణ క్లిని క్‌లు ఏర్పాటు చేస్తుండడం, సంచార వైద్య సేవలందించేందుకు ఒక భారీ బస్సును సమకూర్చుకోవడం అభినందనీయన్నారు. వంద మంది చిన్న పిల్లలకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్సలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 

ప్రతిమ వంటి సంస్థలుండడం అదృష్టం : మంత్రి ఈటల
జిల్లాలో ప్రతిమ వంటి సంస్థలు ఉండడం స్థానిక ప్రజల అదృష్టమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రతిమ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సృజనాత్మకతకు మారుపేరని, ఆయన చేసిన ఆలోచనలతో పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నాయన్నారు. రోగాలు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే రాకుండా ఉంచడమే ముఖ్యమని సీఎం కేసీఆర్‌ దూరదృష్టితో ఆలోచించి హరితహారంలో మొక్కలు నాటిస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్‌ అనే పదానికి కరీంనగర్‌లోనే సరైన అర్థం కనిపించిందన్నారు.
ఉత్తమ సేవలను చూస్తున్నా : మంత్రి గంగుల
సీఎం కేసీఆర్‌ ప్రజలకు చేరువగా పాలన తెచ్చినట్లు ప్రతిమ ఫౌండేషన్‌ ప్రజల ముంగిటకే వైద్యాన్ని తీసుకెళ్తున్నదని, ఇలాంటి ఉత్తమ సేవలను ఈ వైద్యశాలలోనే చూస్తున్నానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. శిబిరాలతో రక్తనిధిని సమకూర్చడం, తల్లీ బిడ్డల సంరక్షణ పథకం, చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు, కోటి మాస్కుల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా విస్తృత సేవలందిస్తూనే ఇప్పుడు టెలీమెడిసిన్‌, సంచార వైద్యశాలను తీసుకురావడం అభినందనీయమన్నారు. జిల్లాలో 50 లక్షల మొక్కల పెంపకమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, గత ఆరేళ్లుగా నాటిన మొక్కలు చెట్లుగా మారి సస్యశ్యామలం చేస్తున్నాయన్నారు. 
నిరుపేదలకు ఎంతో ఉపయోగం : మంత్రి కొప్పుల
ప్రతిమ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ పేదలకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వ్యాధులపై తక్కువ అవగాహన ఉంటుందని, వ్యాధులు బయటికి వచ్చే వరకు చికిత్స గురించి ఆలోచించరని, ఇలాంటి వారికి ప్రతిమ ఫౌండేషన్‌ ప్రవేశ పెట్టిన సంచార వైద్యశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 31 శాతం అటవీశాతాన్ని సాధించడంలో భాగంగా నేటికి 27శాతం పూర్తిచేశామని, రెండేళ్లలో 31శాతం పూర్తి చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. 
పేదలకు సేవ చేయాలనే..: శ్రీనివాసరావు
పేదలకు ఏదో ఒకటి చేయాలనే తపనతోనే ప్రతిమ ఫౌండేషన్‌ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నదని చైర్మన్‌ బోయినపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువని, అలాంటి వారికి తమ సంచార వైద్యశాల ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. టెలీమెడిసిన్‌ సేవల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో 200 గ్రామీణ క్ల్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, సుంకె రవిశంకర్‌, కోరుకంటి చందర్‌, మేయర్‌ వై సునీల్‌రావు, కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌ రెడ్డి, ప్రతిమ సీఈవో రాంచందర్‌రావు, వైద్యులు అమిత్‌కుమార్‌ పాల్గొన్నారు.
చొప్పదండి: ఆకుపచ్చని తెలంగాణే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన హరితహారంతో ప్రతి పల్లె ప్రకృతివనం కావాలని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. వెదురుగట్ట ఫారెస్ట్‌బ్లాక్‌ను మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో కలిసి బుధవారం ఆయన సందర్శించి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వెదురుగట్టలోని 170 ఎకరాల్లో 65వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని చోట్ల మొక్కల పెంపకాన్ని మహాయజ్ఞంలా కొనసాగించాలని పిలుపునిచ్చారు. జిల్లాల పునర్విభజన అనంతరం కరీంనగర్‌ జిల్లాలో అడవుల శాతం చాలా పడిపోయిందని, జిల్లాలో అటవీశాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్‌ శశాంక, మంత్రి గంగుల కమలాకర్‌ పర్యవేక్షణలో పల్లెకో వనం కార్యక్రమంలో రోడ్లకిరువైపులా మొక్కలు నాటుతూ హరిత తోరణాలుగా మార్చేందుకు కృషి చేస్తున్నారని కలెక్టర్‌ను అభినందించారు. కలెక్టర్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా ఇదేవిధంగా మొక్కలు నాటేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోతులు తిరిగి అడవులబాట పట్టేలా గ్రామాల్లో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కరీంనగర్‌లో సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీపీటీసీలో మియావాకి పద్ధతిన పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడాన్ని అభినందించారు. చొప్పదండి నియోజవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. సర్పంచులు కేసీఆర్‌లా మారి బాధ్యతాయుతంగా పనిచేస్తే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో మోతెవాగు ప్రాజెక్ట్‌కు మంజూరైన తూముల నిర్మాణాన్ని పూర్తిచేసి 30వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలిచేందుకు మంత్రులు సహకరించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, సీటీఎఫ్‌ రేంజ్‌ అధికారి ఏంఏ అక్బర్‌, డీఎఫ్‌వో ఎఫ్‌జే ఆశ, ఎంపీపీలు చిలుక రవీందర్‌, శ్రీరాం మధుకర్‌, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, సింగిల్‌ విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతిరావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుర్రం నీరజ, తదితరులు పాల్గొన్నారు.
టెలీమెడిసిన్‌ ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్‌ ఆన్‌లైన్‌లో కొందరు రోగులతో మాట్లాడారు. మొదట వీర్నపల్లి మండలం నుంచి పేషెంట్‌ నాగరాజు లైన్‌లోకి వచ్చారు. దీంతో ‘నాగరాజు బాగున్నవా..’ అని మంత్రి కేటీఆర్‌ పలుకరించగా, ‘బాగున్నా సార్‌' అని బదులిచ్చారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని, మందులు సూచించాలని వైద్యున్ని కోరారు. జమ్మికుంట నుంచి అశ్విత అనే చిన్నారి ఆన్‌లైన్‌కు వచ్చింది. ఆమెతోపాటు ఆమె తండ్రితో మంత్రి ఈటల మాట్లాడారు. పిల్లల వైద్యులు అమిత్‌కుమార్‌ ఈ పాప ఆరోగ్యంపై  కౌన్సెలింగ్‌ చేశారు. కొత్తపల్లి మండలం బావుపేట నుంచి రాములు అనే రోగి ఆన్‌లైన్‌కు రాగా మంత్రి గంగుల మాట్లాడారు.logo