మంగళవారం 11 ఆగస్టు 2020
Karimnagar - Jul 08, 2020 , 01:51:04

శరవేగంగా ప్రగతి పరుగులు

శరవేగంగా ప్రగతి పరుగులు

 కరీంనగర్‌లో సీఎం అస్యూరెన్స్‌ నిధులు.. స్మార్ట్‌సిటీ పనులతో ప్రగతి పరుగులు పెడుతున్నది. వీటితో పాటు బల్దియా నిధులతో నగర సుందరీకరణ కోసం పాలకవర్గం కసరత్తు చేస్తున్నది. రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధితోపాటు, ప్రజలకు ఇతర సదుపాయాలనూ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నది. అలాగే ఆరో విడుత హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నది.

సీఎం అస్యూరెన్స్‌ కింద నగరానికి మూడు సంవత్సరాల్లో రూ. 360 కోట్ల నిధులు వచ్చాయి. వీటిలో మొదటి విడుతలో వచ్చిన వంద కోట్లతో నగరంలోని ప్రధాన రోడ్లతోపాటు, డివిజన్లలో లింకు రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. వీటిల్లో ఇప్పటికే అత్యధిక రోడ్లు పూర్తయ్యాయి. అలాగే రెండో, మూడో విడుతల్లో వచ్చిన నిధులతో డివిజన్లలోని ప్రధాన రహదారులు, మురుగు కాలువలతో పాటు అంతర్గత రోడ్లనూ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మూడు విడుతల్లో సుమారు 218 అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి అప్పగించగా, ఇప్పటికే 70 శాతం మేరకు పూర్తయ్యాయి. మిగతావి వేగంగా సాగుతున్నాయి. వీటిని సైతం త్వరగా పూర్తి చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నది.
‘స్మార్ట్‌'తో సుందరీకరణ
నగరంలో స్మార్ట్‌సిటీ కింద వచ్చిన రూ. 236 కోట్ల నిధులతో పనులు సాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా శాతవాహన యూనివర్సిటీ, కలెక్టరేట్‌, రాజీవ్‌చౌక్‌-కిసాన్‌నగర్‌, హౌసింగ్‌బోర్డు కాలనీలో రోడ్ల నిర్మాణం ఉన్నాయి. ఇప్పటికే విద్యానగర్‌, కలెక్టరేట్‌ రోడ్లు పూర్తి కావస్తుండగా... ఫుట్‌పాత్‌, మల్టీజోనల్‌ పార్కింగ్‌ టైల్స్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినా ఈ పనులను వేగంగా పూర్తి చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, నగర మేయర్‌ వై సునీల్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇవి పూర్తయితే నగరానికి కొత్తకళ రానున్నది.
మౌలిక సదుపాయాలకు బల్దియా నిధులు
మున్సిపాలిటీ అంటేనే రోడ్లు, మురుగు కాలువల అభివృద్ధి అనే తీరును పక్కన పెట్టిన బల్దియా, నగర సుందరీకరణతో పాటు ప్రజల ఆరోగ్య సంరక్షణ, ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నది. ఓ వైపు సీఎం అస్యూరెన్స్‌, స్మార్ట్‌సిటీ నిధులతో రోడ్లు, మురుగుకాల్వల అభివృద్ధి జరుగుతుండగా.. బల్దియాకు చెందిన రూ.50 కోట్ల నిధులతో నగరంలో పార్కులు, శ్మశానవాటికల అభివృద్ధి, వాకింగ్‌ ట్రాక్స్‌, ఓపెన్‌ జిమ్స్‌ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. అలాగే నగర ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని షీ, పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాల కోసం చర్యలు చేపడుతున్నది. నగరంలో 15కు పైగా ఆధునిక పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని బల్దియా అధికారులు భావిస్తున్నారు. అలాగే 20కి పైగా స్థలాల్లో ఓపెన్‌ జిమ్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజలు ఎక్కువగా వినియోగించే సామగ్రిని వాటిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. నగరంలోని ప్రస్తుతం వినియోగంలో ఉన్న అన్ని వాకింగ్‌ ట్రాక్స్‌ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
త్వరలోనే రోజూ నీటి సరఫరా
నగరంలో రోజూ మంచినీటి సరఫరా చేసేందుకు ఇప్పటికే రూ. 110 కోట్లతో మిషన్‌ భగీరథ కింద పనులు పూర్తయ్యాయి. భగీరథలో భాగంగా నగరంలో వంద కిలోమీటర్లకు పైగా కొత్త పైపులైన్లు వేయడంతో పాటు, శాతవాహన యూనివర్సిటీలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, నగరంలో మరో మూడు కొత్త రిజర్వాయర్లను నిర్మించారు. అలాగే ఇప్పటికే నగరంలోని పలు డివిజన్లలో రోజూ నీటి సరఫరాకు సంబంధించి ట్రయల్‌ రన్‌ కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో లోపాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేపడుతున్నారు. ఇవి పూర్తికాగానే నగరంలో రోజూ మంచినీటి సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


logo