శుక్రవారం 07 ఆగస్టు 2020
Karimnagar - Jul 08, 2020 , 01:43:54

చేపా.. చేపా.. రేటెందుకు పెరిగినవ్‌?

చేపా.. చేపా.. రేటెందుకు పెరిగినవ్‌?

 తెలంగాణ రాష్ట్ర సర్కారు చొరవతో మత్స్య సంపద బాగా వృద్ధి చెందుతున్నది. చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుండడంతో మత్స్యకారులకు జీవనోపాధి పెరుగుతున్నది. గడిచిన రెండేళ్లలో జిల్లాలో చేపల లభ్యత విపరీతంగా పెరిగినా, వాటి ధరలు మాత్రం దిగి రావడానికి ససేమిరా అంటున్నాయి. ఏరోజుకారోజు డిమాండ్‌ను బట్టి చేపల ధరలు పెరుగుతున్నాయి. స్థిరమైన ధరలు లేక పోవడంతో ఎంత చెబితే అంత చెల్లించాల్సి వస్తోందని మత్స్యప్రియులు వాపోతున్నారు. ఇటు మధ్య దళారులతో మత్స్యకారులు నష్టపోతున్నారు.

- కరీంనగర్‌, నమస్తే తెలంగాణ

గతేడాది కరీంనగర్‌ జిల్లాలో 19 వేల నీటి హెక్టార్లతో విస్తరించి ఉన్న 769 చెరువుల్లో 1.99 కోట్ల చేప విత్తనాలు వేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు 7,447 టన్నుల చేపల ఉత్పత్తి చేతికి వచ్చింది. ప్రస్తుతం కాళేశ్వరం జలాలతో మరిన్ని చెరువులు కుంటలు నింపుతున్న నేపథ్యంలో 21,733 హెక్టార్లలో విస్తరించి ఉన్న 802 చెరువుల్లో ఈ యేడు చేపలు పెంచేందుకు 2.36 కోట్ల విత్తనాలు వేయడానికి టెండర్లు పూర్తి చేశారు. కాగా, గత సంవత్సరం సిరిసిల్లలో 315 చెరువుల్లో 1.02 కోట్ల చేపపిల్లలు వేయగా 3 వేల టన్నుల ఉత్పత్తి వచ్చింది. పెద్దపల్లిలో 1,013 చెరువుల్లో 1.51 కోట్ల చేప పిల్లలు వేయగా 7,240 టన్నులు, జగిత్యాల జిల్లాలో 543 చెరువుల్లో 1.90 లక్షల చేపపిల్లలు వేయగా 7,200 టన్నుల ఉత్పత్తి వచ్చింది. తిరిగి ఈ యేడాదికి వచ్చే నెల నుంచి చెరువులు, కుంటలు, జలాశయాల్లో చేప విత్తనాలు వేయనున్నారు. ఈ లెక్కన చేపల ఉత్పత్తి గతంలో కంటే రెండింతలు పెరిగినట్లు తెలుస్తున్నది. అయినా చేపల ధరలు తగ్గకపోగా క్రమంగా పెరుగుతున్నాయి. 

జలాశయాల్లో పెరిగిన దిగుబడి.. 

మత్స్యకారులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులు, జలాశయాల్లోనూ ఉచితంగా చేప విత్తనాల ను వదులుతున్నది. దీంతో గతంలో కంటే మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. సిరిసిల్ల జిల్లా మధ్య మానేరులో గతేడాది 28.50 లక్షల విత్తనా లు వదిలితే 14.88 టన్నులు, ఎగువ మానేరులో 10.50 లక్షల చే ప పిల్లలు వదిలితే 850 టన్నులు, మూలవాగులో 1.57 లక్షల చేప పిల్లలు వదిలితే 124 టన్నులు, పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం లో 12.21 లక్షల పిల్లలు వదిలితే 488 టన్నులు, సుందిళ్లలోని పార్వతీ బరాజ్‌లో 11.41 లక్షలు వదిలితే 285 టన్నులు, సరస్వతీ బరాజ్‌లో 12.60 లక్షలు వదిలితే 315 టన్నులు, కరీంనగర్‌ జిల్లా ఎల్‌ఎండీలో 30 లక్షల చేపపిల్లలు వదిలితే 500 టన్నుల దిగుబడి వచ్చింది. దిగువ మానేరులో మరో 30 లక్షల రొయ్య విత్తనాలు వ దిలితే 500 టన్నులకుపైగా ఉత్పత్తి వచ్చింది. ఇటు జలాశయాలు, అటు చెరువులు, కుంటల్లో రెండేళ్లుగా మత్స్యసంపద గణనీయంగా పెరుగుతున్నా, చేపలు, రొయ్యల విషయంలో స్థిరమైన ధరలు లేక పోవడంతో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

ధరల అస్థిరతకు కారణాలు.. 

మత్స్యకారులకు ఉపాధి చూపుతూ ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నా మార్కెట్‌లో వాటి ధరల్లో స్థిరత్వం లేకుండా పోతున్నది. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపవిత్తనాలు ఏటా ఆగస్టు నుంచి నీటి వనరుల్లో వేస్తున్నారు. ఇవి పెరిగేందుకు 6 నుంచి 7 నెలల సమయం పడుతుంది. మార్చి నుంచి జూన్‌, జూలై వరకు మత్స్యకారులు చేపలు పట్టుకుంటున్నారు. ఈ సీజన్‌లోనే ఎక్కువగా చేపలు చేతికి వస్తుండగా, మత్స్యకారులు చేపలు విక్రయించుకుంటున్నారు. ఒక్కో ఊరిలో ఒక్కో విధంగా చేపలు అమ్ముకుంటున్నారు. అయితే ఇక్కడ కొందరు మధ్య దళారుల ప్రమేయం కూడా కనిపిస్తున్నది. రిటైల్‌ వ్యాపారులు నేరుగా మత్స్యకారుల నుంచి కొని పట్టణ ప్రాంతాలలో 50 నుంచి 80 వరకు అధిక ధరలకు చేపలను విక్రయిస్తున్నారు. ప్రాణంతో ఉన్న చేపలకు ఒక ధర, చనిపోయిన చేపలకు ఒక ధర నిర్ణయించి ఒక్కో మార్కెట్‌లో ఒక్కో విధమైన ధరలకు విక్రయిస్తున్నారు. 

ఎగుమతుల ప్రభావం ఎక్కువే.. 

జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగినప్పటికీ ఇక్కడ కొందరు దళారులు ఇతర రాష్ర్టాలకు ఎగుమతులు చేస్తున్న కారణంగా స్థానికంగా చేపలకు కొరత ఏర్పడుతున్నది. ఐదేండ్ల వరకు 70 శాతం చెరువులు దళారుల చేతిలోనే ఉండేవి. మత్స్య పారిశ్రామిక సంఘాలను అడ్డుపెట్టుకుని చెరువులను లీజుకు తీసుకుని దళారులే చేప విత్తనాలు వేసి పెంచేవారు. కేవలం చేపలు పట్టి ఇచ్చేందుకు మాత్రమే మత్స్యకారులను వినియోగించుకుని కిలోకు 40 నుంచి 50 ఇచ్చేవారు. ఇప్పటికీ 20 శాతం చెరువుల్లో ఇదే తతంగం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. 2 నుంచి 3 కిలోలు తూగే చేపలను చెరువుల వద్దే కొనుగోలు చేసుకొని పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తదితర రాష్ర్టాలకు దళారులు ఎగుమతి చేస్తున్నారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి హైదరాబాద్‌కు కూడా పెద్ద మొత్తంలోనే చేపలు తరలిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పెద్ద సైజు చేపలన్నీ ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండడం వల్లే ఇక్కడ కొరత ఏర్పడుతున్నది. అంతే కాకుండా స్థానిక అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేపలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటున్నది. దీంతో రవాణా, ప్యాకింగ్‌ ఖర్చులు జతచేసి స్థానిక వ్యాపారులు ధరలు పెంచేస్తున్నట్లు తెలుస్తున్నది. 

చర్యలు తీసుకుంటే మంచిదే.. 

మన చేపలు మనకే చెందే విధంగా చర్యలు తీసుకోవాలని మత్స్యప్రియులు చెబుతున్నారు. స్థానిక ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే చేపల ఉత్పత్తి కోసం ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంటే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేస్తున్న కొందరు లాభాలు ఆర్జిస్తున్నారని, వారికి చేపలు విక్రయించే మత్స్యకారులకైనా కనీస లాభం చేకూరడం లేదని వినియోగదారులు అంటున్నారు. స్థానికంగా సరిపోయిన తర్వాతనే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చేపల మార్కెటింగ్‌ కోసం మత్స్యకారులకు మోపెడ్లు, ఆటోలు కొనుగోలు చేసి ఇస్తోంది. ఉమ్మడి జిల్లా లేదంటే రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా విక్రయించుకునే విధంగా వీరికి అనుమతులు ఉన్నాయి. ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయకుండా, చేపల విక్రయాలు కేవలం మత్స్యకారుల చేతిలోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటే కొంత వరకు ధరలను నియంత్రించవచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రిటైల్‌ వ్యాపారులు కూడా ఏరోజుకారోజు డిమాండ్‌ను బట్టి ధరలు నిర్ణయిస్తున్నారు. వీరి విషయంలో కూడా ధరలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిదని మత్స్య ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

డిమాండ్‌ ఉన్న చేపలు ఇవే..

మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న చేపలకు ధర ఎక్కువగానే చెబుతున్నారు. బొమ్మె కిలో 500 నుంచి 700 పలుకుతున్నది. చిన్న జెల్లలు, పాపెర్లు కూడా ఎక్కువ ధరే పలుకుతున్నవి. ఇందులో చిన్న జెల్లలు కిలోకు 400 నుంచి 500 ఉన్నది. బొమ్మె చేపలు ఉమ్మడి జిల్లాలో పెద్దగా లభించే పరిస్థితి లేదు. నూటికి ఒక్క శాతమే ఇవి లభిస్తున్నాయి. దీంతో ఈ చేపలను ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేప విత్తనాలతో వృద్ధి చెందిన మత్స్య సంపదకు ధర తక్కువే ఉంది. సైజును బట్టి ధరలు ఉండగా, రవ్వు, బొచ్చె, బంగారు తీగ, మ్రిగాల, గడ్డి చేపలు కిలోకు 150 నుంచి 200కు లభిస్తున్నాయి.

 మత్స్య సంపద పెరుగుతున్నది. మన చే ప లు ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయడం వల్ల ధర లు పెరుగుతున్నయి. మత్స్యకారులే చేపలు అమ్ముకోవాలని ప్రోత్సహిస్తున్నం. ప్రతి ఆదివారం చెరువు వద్దనే చేపలు విక్రయించేలా అలవాటు చేస్తున్నం. అయితే ఆంధ్రా నుంచి వచ్చే చేప విత్తనాలు నాణ్యతా లోపంతో ఉంటున్నయి. ఇక్కడి చెరువుల్లో ఎదగడం లేదు. స్థానికంగా ఉన్న చేపవిత్తనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న.

- పోలు లక్ష్మణ్‌, ఉమ్మడి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల చైర్మన్‌logo