సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 07, 2020 , 02:19:34

‘హరిత’ లక్ష్యాన్ని అధిగమిస్తాం

‘హరిత’ లక్ష్యాన్ని అధిగమిస్తాం

  •  మేయర్‌ వై సునీల్‌రావు
  •  ఎస్సారార్‌లో మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు

కార్పొరేషన్‌: నగరంలో విరివిగా మొక్కలు నాటి హరితహారం లక్ష్యాన్ని అధిగమిస్తామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. స్థానిక ఎస్సారార్‌ కళాశాల ఆవరణలో సోమవారం హరితహారం కార్యక్రమం చేపట్టారు. మేయర్‌ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాల ఆవరణలో మియావాకి పద్ధతిలో రెండు వేల మొక్కలు నాటుతామన్నారు. నగర పరిధిలో 12 లక్షల మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలు గుర్తించినట్లు తెలిపారు. పూలు, పండ్లు, ఔషధ, నీడనిచ్చే మొక్కలు తీసుకువచ్చామన్నారు. శివారు డివిజన్లలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాల్లో అధిక సంఖ్యలో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈసారి మియావాకి పద్ధతిలో 3 లక్షలకు పైగా మొక్కలు నాటుతామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంటింటికీ ఆరు మొక్కలు అందిస్తామన్నారు. ప్రజలు కోరిన మొక్కలను త్వరలోనే డివిజన్ల వారీగా పంపిణీ చేస్తామని తెలిపారు. డివిజన్లలో కార్పొరేటర్ల సహకారంతో 20 నుంచి 30 వేల మొక్కలు నాటుతామని స్పష్టం చేశారు. గ్రీన్‌ బడ్జెట్‌ నిధులు సక్రమంగా వినియోగించి నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తామన్నారు. నగరంలో 15 ప్రాంతాల్లో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటుతామన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ క్రాంతి, కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, కార్పొరేటర్లు బండ సుమ, వాల రమణారావు, నగరపాలక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

అభివృద్ధి పనుల్లో  వేగం పెంచాలి

కార్పొరేషన్‌: నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మేయర్‌ వై సునీల్‌రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని 6, 56, 14 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రతి డివిజన్‌లో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం అస్యూరెన్స్‌ నిధులతో ప్రధాన రోడ్లతో పాటు డివిజన్లలోని ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు రాజేందర్‌రావు, దిండిగాల మహేశ్‌, కోల మాలతి, డివిజన్‌ నాయకులు పాల్గొన్నారు. 

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

కార్పొరేషన్‌: జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్‌ వై సునీల్‌రావు పిలుపు నిచ్చారు. జగ్జీవన్‌రామ్‌ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక మంచిర్యాల చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్‌, గంట కళ్యాణి, వివిధ సంఘాల నాయకులు ఆనందరావు, అజయ్‌ పాల్గొన్నారు. logo