శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Karimnagar - Jul 06, 2020 , 01:00:19

నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ చేస్తే క్రిమినల్‌ కేసు

నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ చేస్తే  క్రిమినల్‌ కేసు

కరీంనగర్‌ క్రైం: వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని సీపీ కమలాసన్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నిబంధనలు పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. 

నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ చేస్తే  క్రిమినల్‌ కేసు

వాహనం నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ చేసే వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని సీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ చలానా నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు వివిధ పద్ధతుల్లో నంబర్లు చిన్నగా రాయించడం, అర్థం కాని విధంగా బిగించుకోవడం, నంబర్లు కనిపించకుండా చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. దొంగిలించిన వాహనాలు సైతం రోడ్లపైకి వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, స్పెషల్‌ డ్రైవ్‌ల నిర్వహణతో చోరీ అయిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌ చేసిన వాహనదారులపై కేసు నమోదు చేసి రోజూ వారీగా నివేదిక అందిస్తున్నట్లు వెల్లడించారు. 

వాహనదారులకు జరిమానా

ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 4వ తేదీ వరకు కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ట్రాఫిక్‌ నియమనిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు కారణం అవుతున్న వాహనదారులకు ఈ చలానా ద్వారా జరిమానా విధిస్తున్నారు. రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపిన  కేసులు 15,759, హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపిన కేసులు 2,45,470, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు 915, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న 1886 వాహనాలపై కేసు, నంబర్‌ ప్లేట్‌ సక్రమంగా లేని 1636 వాహనాలపై కేసు, సర్వీస్‌ రోడ్లపై పార్కింగ్‌కు సంబంధించి 11, 062 కేసులు, ట్రిపుల్‌ రైడింగ్‌ 1644 కేసులు, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 2147 వాహనాలపై కేసు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా నడిపిన 445 మందిపై కేసు, బీమా లేని 82 వాహనాలపై కేసు, అతివేగం, అజాగ్రత్తగా నడిపిన 29,711 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

వాహనాలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి 

వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా సదరు వాహనదారులు తమ పేరిట వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సీపీ సూచించారు. వాహనదారులు తమ వాహనాలను ఇతరులకు విక్రయించిన సందర్భాల్లో వారి పేరిట రిజిస్ట్రేషన్‌ అయ్యేలా రవాణాశాఖ  ద్వారా రూపొందించిన పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నంబర్‌ ప్లేట్‌ టాంపరింగ్‌, జిగ్‌జాగ్‌ విధానంలో అమర్చుకోవడం లాంటి చర్యలు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో కీలక పాత్ర పోషించే అన్ని స్థాయిల పోలీసు అధికారులకు రివార్డులు అందజేస్తామని పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. logo