గురువారం 13 ఆగస్టు 2020
Karimnagar - Jul 06, 2020 , 00:58:25

రైతు ముచ్చటకు వేదిక

రైతు ముచ్చటకు వేదిక

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ : రైతులను ఒకే వేదికపైకి తేవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్‌ 2018 ఫిబ్రవరిలో రెవెన్యూ గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో రైతు సమన్వయ సమితు(ప్రస్తుతం రైతుబంధు సమితి)లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా 2018 ఫిబ్రవరి 26న ఉమ్మడి జిల్లా కేంద్రమైన కరీంనగర్‌లో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి 5 వేల ఎకరాల పరిధిలో ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి క్లస్టర్‌ పరిధిలో ఒక రైతు వేదికను నిర్మిస్తామని ప్రకటించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో గతంలో పలు చోట్ల ఈ వేదికలకు స్థలాలను గుర్తించారు. నియంత్రిత సాగు విధానంపై ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి మళ్లీ రైతుల వేదికల ప్రస్తావన తెచ్చారు. తక్షణమే వాటి నిర్మాణం చేపట్టాలని కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రైతు వేదికల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇప్పటికే దాదాపు అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి స్థలాలను గుర్తించారు. వేదికల నిర్మాణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

సమగ్ర సమాచార కేంద్రాలుగా..

వ్యవసాయ సమాచారాన్ని రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో మండలం, డివిజన్‌ స్థాయిలో తెలుసుకోవాలి. ఎలాంటి ఇన్‌పుట్స్‌ కోసమైనా అక్కడికే వెళ్లాల్సి వస్తున్నది. దీంతో రైతుల సమయం వృథా అవడంతోపాటు దూరభారం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నాలుగైదు గ్రామాలను కలిపి ఇప్పటికే ఏర్పాటు చేసిన వ్యవసాయ క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని ఈ వేదిక ద్వారా అందించడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. రైతు వేదికలు సిద్ధమైన తర్వాత రైతుబంధు సమితుల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశాలున్నాయి. క్లస్టర్‌ పరిధిలో ఏ రైతు ఎలాంటి పంటలు వేయాలి?, ఏది వేస్తే లాభదాయకంగా ఉంటుంది?, ప్రభు త్వం నుంచి వచ్చే సబ్సిడీల వివరాలు, రైతుబంధు, రైతు బీమా, ఇతర పథకాల పర్యవేక్షణ లాంటివి ఇక ముందు వేదిక ద్వారానే జరుగనున్నాయి. మద్దతు ధర లభించని పక్షంలో రైతు వేదికకు అనుబంధంగా ఉండే రైతుబంధు సమితుల ద్వారా కొనుగోలు చేయించి ఇక్కడే భద్రపర్చే సదుపాయం కల్పించనున్నారు. వాతావరణ సమాచారం కూడా రైతులకు అనునిత్యం అందుతుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించేందుకు వీలుగా వేదికలను నిర్మించబోతున్నారు. ఈ సీజన్‌ నుంచి అమలవుతున్న నియంత్రిత సాగు పద్ధతిపై రైతులకు పూర్తి అవగాహన కలగడమే కాకుండా సంబంధిత ఏఈవోలు క్లస్టర్‌ పరిధిలోని వ్యవసాయంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించే అవకాశం ఏర్పడనుంది.

ఇప్పటికే స్థలాల గుర్తింపు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రైతు వేదికల నిర్మాణానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు స్థలాలను గుర్తించారు. ఇం దుకు అవసరమైన నమూనాను హైదరాబాద్‌లోని ఏ అండ్‌ డీవో ఆర్కిటెక్చర్‌ సంస్థ డిజైన్‌ చేసింది. 413 చదరపు అడుగుల్లో రెండు గదులు, 1,498 చదరపు అడుగుల్లో వర్క్‌షెడ్‌, 135 చదరపు అడుగుల్లో టాయిలెట్స్‌ నిర్మాణం కలిపి 2,046 చదరపు అడుగుల్లో వేదిక నిర్మాణానికి డిజైన్‌ చేసింది. ఇందుకు రూ.20 నుంచి రూ.22 లక్షల వరకు వ్యయం అంచనా వేశారు. ఇందులో రూ.12 లక్షల వరకు వ్యవసాయ శాఖ సమకూర్చుతుండగా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉపాధిహామీ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్‌లో 76, జగిత్యాలలో 71, పెద్దపల్లిలో 54, రాజన్న సిరిసిల్లలో 57 చొప్పున మొత్తం 258 క్లస్టర్లలో ఇప్పటికే స్థలాలను గుర్తించిన అధికారులు అందుబాటులో వాటి నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు అప్పగించారు. కనీసం ఎకరం స్థలం కావాల్సి ఉండగా, కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడంతో అందులో కేటాయించారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి 20 గుంటలు, మరి కొన్నింటికి 5 గుంటల స్థలం మాత్రమే అందుబాటులో ఉండగా, ఇలాంటి చోట్ల దాతలు భూ ములు విరాళంగా ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. సదరు వేదికలకు దాతలు సూచించిన పేర్లనే పెడుతామని చెబుతున్నారు. కాగా, కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలంలో రెండు చోట్ల, మానకొండూర్‌ మండలంలో మరికొన్ని చోట్ల భూమిని విరాళంగా ఇచ్చేందుకు దాతలు ముందుకు వచ్చారు.  

ప్రారంభిస్తున్నాం..

రైతు వేదికల నిర్మాణాలను ప్రారంభిస్తున్నాం. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాం. మానకొండూర్‌ మండలంలో ఒకరు, చిగురుమామిడి మండలంలో ఇద్దరు దాతలు భూమి విరాళంగా ఇచ్చారు. కొన్ని చోట్ల స్థలం తక్కువగా ఉంది. ఇలాంటి చోట్ల భూమి విరాళం ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలి. వస్తే వారు సూచించిన పేర్లను రైతు వేదికలకు శాశ్వతంగా పెడతాం. - వాసిరెడ్డి శ్రీధర్‌, డీఏవో (కరీంనగర్‌)

దాతలు ముందుకు రావాలి..

కరీంనగర్‌ జిల్లాలో 76 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలు నిర్మించబోతున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో వీటిని పూర్తి చేస్తాం. దాదాపు అన్ని చోట్లా స్థలాల గుర్తింపు పూర్తయింది. కొన్ని చోట్ల స్థలం తక్కువగా ఉన్నది. ఇలాంటి చోట్ల మరింత భూమిని సేకరించే ప్రయత్నం చేస్తాం. దాతలు భూ, నిర్మాణాల కోసం విరాళం ఇచ్చేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.  - గూడెల్లి తిరుపతి, ఆర్బీఎస్‌ కరీంనగర్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ 


logo