గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 06, 2020 , 00:23:28

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

కార్పొరేషన్‌: సీజనల్‌ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ వై సునీల్‌రావు నగర ప్రజలకు సూచించారు. ‘ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 35వ డివిజన్‌లో మేయర్‌ పాల్గొని నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి ఇంటి ఆవరణలో డబ్బాలు, కుండీలు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని కోరారు. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది, సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిశుభ్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు. 

వాడవాడలా సీసీ రోడ్లు నిర్మిస్తాం 

నగరంలో వాడవాడలా సీసీ రోడ్లు నిర్మిస్తామని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. 35వ డివిజన్‌లో రూ. 10 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు నాణ్యతతో చేపట్టాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ప్రారంభించిన పనిని వారం రోజుల్లోనే పూర్తి చేయాలన్నారు. నగరంలో నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. త్వరలోనే అన్ని డివిజన్లలో రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. వచ్చే పాలకవర్గ సమావేశంలో వీటికి సంబంధించి తీర్మానాలు చేస్తామన్నారు. కార్పొరేటర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో నగరంలో అభివృద్ధి పనులకు విఘాతం కలిగిందన్నారు. కరోనా వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బయటికి వస్తే మాస్క్‌ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరారు.  కార్పొరేటర్‌  చాడగొండ  బుచ్చిరెడ్డి, దిండిగాల మహేశ్‌, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. 

సమస్యలు పరిష్కరిస్తాం

డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మేయర్‌ వై సునీల్‌రావు హామీ ఇచ్చారు. నగరంలోని 36వ డివిజన్‌లో ఆయన పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డివిజన్ల వారీగా ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. డ్రైనేజీలు, రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు. 


logo