గురువారం 13 ఆగస్టు 2020
Karimnagar - Jul 04, 2020 , 02:46:16

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం

  • n అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించాలి
  • n  మేయర్ వై సునీల్‌రావు

కార్పొరేషన్: స్మార్ట్‌సిటీ పనులతో నగరాన్ని సర్వాంగా సుందరంగా తీర్చిదిద్దుతామని మేయర్ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. నగరంలోని రాజీవ్‌చౌక్ నుంచి గాంధీచౌక్ వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మంజూరైన రూ. 280 కోట్లతో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను వచ్చే రెండు, మూడు నెలల్లో పూర్తి చేసేలా  చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ పనులను దశల వారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన స్మార్ట్‌సిటీ బోర్డు సమావేశంలో రూ. 650 కోట్లతో అభివృద్ధి పనులకు తీర్మానం చేశామన్నారు. ఈ పనులకు సంబంధించిన డీపీఆర్ తయారు చేసినట్లు తెలిపారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభించి పనులు చేపడుతామన్నారు. నగరంలో ఇప్పటి వరకు ప్రారంభించిన స్మార్ట్‌సిటీ పనులు 80 శాతం పూర్తయినట్లు తెలిపారు. స్మార్ట్ రోడ్ల పనులు చివరి దశలో ఉన్నాయని, అక్కడక్కడా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందన్నారు. నగరంలో గతంలో ఉన్న రోడ్లకు భిన్నంగా స్మార్ట్ రోడ్లు నిర్మిస్తామన్నారు. స్మార్ట్ రోడ్లలో ఫుట్‌పాత్‌ల నిర్మాణం, అక్కడక్కడా పార్కింగ్ జోన్, మల్టీఫంక్షనల్ జోన్, సైక్లింగ్ ట్రాక్, రెండు వైపులా లైటింగ్ సిస్టమ్‌తో రోడ్లు సుందరీకరిస్తామని తెలిపారు. కొత్త టెక్నాలజీతో స్మార్ట్‌సిటీ పనులు చేపడుతున్నామన్నారు. డంప్ యార్డు సమస్యను సైతం త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. పేరుకుపోయిన చెత్తను బయోమైనింగ్ చేసి పూర్తిస్థాయిలో తొలగిస్తామని వెల్లడించారు. నగరం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇంటిగ్రేడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నలింగ్ సిస్టమ్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. నగర ప్రజలకు నిత్యం తాగునీరందించేందుకు డీపీఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. టవర్‌సర్కిల్‌కు సంబంధించిన పనులను సెప్టెంబర్, అక్టోబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పర్యాటక క్షేత్రానికి వచ్చినట్లుగా ప్రజలకు సంతృప్తి కలిగేలా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సృష్టం చేశారు. నగర ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేస్తున్న మల్టీపర్పస్, జ్యోతిరావు ఫూలే సర్కస్ గ్రౌండ్ పార్కులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఉజ్వల పార్కు నుంచి పద్మనగర్ డ్యాం పరీవాహక ప్రాంతం మొత్తం సుందరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ స్టేడియాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు నగర ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నగరపాలక అధికారులు, తదితరులు పాల్గొన్నారు. logo