శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 04, 2020 , 02:46:17

సాగుకు పునర్జీవం

సాగుకు పునర్జీవం

  • n   నెరవేరుతున్న రాష్ట్ర సర్కారు కల 
  • n   సీఎం ఆదేశాలతో ఎస్సారెస్పీ పునర్జీవ పథకానికి  మరోసారి కాళేశ్వర జలాలు
  • n   ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయం వరకు వరదకాలువ 122 కిలోమీటర్ల పొడవు ఉన్నది. ఈ కాలువ పొడవునా 34 తూములు, 60 చెరువులున్నాయి. ఈ చెరువుల పరిధిలో 8 నుంచి 9వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. గతేడాది నుంచి ఈ ఆయకట్టుకు లక్ష్యానికి అనుగుణంగా నీరందిస్తున్నారు. ఇప్పుడు వాన కాలం పంటలకు కూడా ఇదే అస్యూర్డ్ నీటిని అందించనున్నారు. చెరువుల కింద 8 నుంచి 9వేల ఎకరాలు సాగవుతుండగా, కాలువ పొడవునా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది రైతులు నేరుగా మోటర్లు పెట్టి సాగు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో కాలువలో ఎప్పుడు నీళ్లుండడం, పరీవాహక ప్రాంతంలో భూగర్భజలాలు భారీగా పెరగడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. బావులకు మోటర్లు పెట్టి పంటలు సాగు చేస్తున్నారు. తాజాగా వానకాలం పంటల కోసం ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరద కాలువను కాళేశ్వరం నీటితో నింపాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా, రెండు రోజులుగా నీటిని ఎత్తిపోస్తున్నారు. గురువారం ఆరంభమైన ఈ ఎత్తిపోతల వల్ల ఇప్పటికే పావు టీఎంసీ నీరు కాలువలోకి వచ్చి చేరగా, ఇది పూర్తిస్థాయిలో నిండగానే చెరువులు, కుంటల్ని నింపనున్నారు. 

1.7 టీఎంసీల నిల్వ..

ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో 122 కిలోమీటర్ల పొడవునా వరదకాలువ జీవనదిలా మారుతున్నది. నీటిని నిల్వచేయడంతోపాటు ఎస్సారెస్పీ వరకు నీటిని పంపేందుకు వరదకాలువపై మూడు పంప్‌హౌస్‌లు పెట్టి నాలుగు రిజర్వాయర్లుగా మార్చారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మీపూర్ సర్జ్‌పూల్ నుంచి ఎత్తిపోసే నీరు 99.02కిలోమీటర్ వద్ద (రామడుగు మండలం శ్రీరాములపల్లి) వరద కాలువలో కలుస్తుంది. వరదకాలువ 102 కిలోమీటర్ వద్ద (షానగర్) హెడ్ రెగ్యులేటర్ గేట్లు పెట్టారు. గేట్లు ఎత్తితే దిగువన రాజరాజేశ్వర (మిడ్‌మానేరు) జలాశయానికి నీరు వెళ్తుండగా, దించితే ఎగువన ఎస్సారెస్పీ వైపు ఎదురెక్కుతుంది. అలాగే లక్ష్మీపూర్ సర్జ్‌పూల్ నుంచి రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే పరిస్థితి ఉన్నప్పుడు రాజరాజేశ్వర జలాశయానికి ఒక టీఎంసీ, వరద కాలువ నుంచి ఎస్సారెస్పీకి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసే విధంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే 122 కిలోమీటర్ల పొడవు ఉన్న వరదకాలువను నాలుగు రిజర్వాయర్లుగా గుర్తించారు. ఇందులో 122 కిలోమీటర్‌నుంచి 102 వరకు మొదటి రిజర్వాయర్‌గా, అలాగే 102 కిలోమీటర్ నుంచి 73 కిలోమీటర్‌వద్ద ఏర్పాటు చేసిన రాంపూర్ పంపుహౌస్ గేట్ల దాకా రెండో రిజర్వాయర్, 73 కిలోమీటర్ నుంచి 34 కిలోమీటర్ వద్ద ఉన్న రాజేశ్వర్‌రావు పేట పంప్‌హౌస్ గేట్ల దాకా మూడోది, 34కిలోమీటర్ నుంచి 0.10 కిలోమీటర్ ముప్కాల్ వద్ద ఉన్న పంప్‌హౌస్ దాకా నాలుగో రిజర్వాయర్‌గా గుర్తించారు. ఈ నాలుగు రిజర్వాయర్ల పరిధిలో అంటే 122 కిలోమీటర్ల పొడవునా 1.7 టీఎంసీల నీరు నిల్వ ఉంచవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే వీటి పరిధిలోని చెరువుల సామర్థ్యం 1.3 టీఎంసీలు, అంటే వరదకాలువతోపాటు చెరువులను నింపుకుంటే మూడు టీఎంసీలకుపైగా నీటిని నిల్వ ఉంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానం వల్ల సంబంధిత ప్రాంత రైతులకు 365 రోజులు నీరు శాశ్వతంగా అందుబాటులో ఉండే అవకాశముంటుంది.

బహుళ ప్రయోజనాలు.. 

వరద కాలువ తూములతో బహుళ ప్రయోజనాలు కలుగుతున్నాయి. తూముల ద్వారా నీటిని విడుదల చేస్తే కీలకమైన గొలుసుకట్టు చెరువులు నిండి, దిగువన ఉన్న చెరువులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఆయకట్టు భూములు పూర్తి స్థాయిలో సాగులోకి రానున్నాయి. అలాగే చెరువుల కింద భూగర్భ జలాలు వృద్ధి చెందుతున్నాయి. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో భూగర్భ జలాలు గతం కంటే గణనీయంగా పెరిగాయి. 2019 మేలో 6.92 మీటర్ల లోతున ఉండగా, ఈ యేడాది వరద కాలువ, తూముల ద్వారా చెరువులను నింపడంతో 5.50 మీటర్ల లోతున భూగర్భ నీటి మట్టం నమోదైంది. ఇక 2019 జూన్‌లో 7.20 మీటర్ల లోతున నీరుండగా, ఈ సారి జూన్‌లో కేవలం 5.36 మీటర్ల లోతులోనే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా బావుల్లోనూ జలం పైకి వస్తున్నది. logo