శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 03, 2020 , 02:57:31

హరితహారం విజయవంతం చేయాలి

హరితహారం విజయవంతం చేయాలి

  • n కలెక్టర్ శశాంక 
  • n వివిధ శాఖల అధికారులతో సమీక్ష

కరీంనగర్, నమస్తే తెలంగాణ: జిల్లాలో ఆరో విడుత హరితహారం విజయవంతం చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం వివిధ శాఖల అధికారులతో హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్ ఉన్నంత వరకు పెద్ద మొక్కలు కొనుగోలు చేసి, మియావాకి పద్ధతిలో ప్లాంటేషన్ చేయాలన్నారు. నర్సరీల నుంచి మొక్కలు తీసుకువచ్చి అవెన్యూ ప్లాంటేషన్ చేయాలన్నారు. ఐదు ఫీట్ల మొక్కలు ఒక ఫీటు భూమి లోపల ఉండే విధంగా నాటాలన్నారు.  ప్రతి గ్రామంలో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు జరిగే స్థలంలో దుమ్ము వచ్చే అవకాశం ఉన్నందున సిమెంట్ రింగులు వేసి మొక్కలు నాటాలన్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు ఈత, ఖర్జూర మొక్కలు నాటాలని సూచించారు.  

మంకీఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలి

 ప్రతి మండలంలో మంకీఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్, అటవీశాఖ అధికారులతో ఆరో విడుత హరితహారంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. పెద్ద మొక్కలు కొనుగోలు చేసి, ప్రతి మండలంలో మంకీఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. నల్లరేగడి నేలలు ఉన్నట్లయితే ఎర్ర మట్టి పోసి మొక్కలు నాటాలన్నారు. మొక్కకు మొక్కకు మధ్యలో మీటరు దూరం ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, ఫారెస్ట్ ఆఫీసర్ ఆశ, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, ఆర్డీవో ఆనంద్‌కుమార్, వ్యవసాయాధికారి శ్రీధర్, ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్, శిశు సంక్షేమాధికారి శారద, డీఎంహెచ్‌వో సుజాత, డిప్యూటీ రేంజ్ అధికారులు పద్మ, కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.

రుణాలు మంజూరు చేయాలి

కరీంనగర్: ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ శశాంక బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సవనిధి, స్ట్రీట్ వెండర్స్‌లోన్, పీఎం ఆత్మ నిర్భర్ భారత్, జీఈసీఎల్, ఎంఎస్‌ఎంఈ ప్రస్తుతం తీసుకున్న రుణాలపై 20 శాతం పెంచి ఇవ్వాలన్నారు. ఈ పథకాలు చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా చూడాలన్నారు. ఈ పథకాలకు సంబంధించి ఆన్‌లైన్ యాప్ pmsvanidhi.mohua.gov.in  ద్వారా అర్హులు మీ సేవలో దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలన్నారు. బ్యాంకులో ఖాతా ఉన్న వారికి నగదు జమ అవుతుందన్నారు. ఖాతా లేనివారు తీసుకోవాలన్నారు. కౌంటర్ వైజ్‌గా టైం టేబుల్ తయారు చేయాలని మెప్మా అధికారులకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ క్రాంతి, ఎల్‌డీఎం దత్తాత్రేయ, వ్యవసాయాధికారి శ్రీధర్, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.


logo