సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 01, 2020 , 03:28:05

బల్దియాలో పనుల ‘పండుగ’

బల్దియాలో పనుల ‘పండుగ’

  • lరూ.4కోట్ల నిధులు కేటాయించిన సర్కారు
  • lత్వరలో టెండర్‌ 

హుజూరాబాద్‌: బల్దియా పరిధిలో పలు అభివృద్ధి పనులపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. దీనికోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది. మొత్తం రూ.4కోట్లు మంజూరు చేయగా, ఇందులో ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.2కోట్లు, 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు మరో రూ.2కోట్లు ఉన్నాయి. ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద విడుదలైన నిధుల్లో ఎస్సీ వార్డుల్లో, మిగతా నిధులతో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకవర్గం సన్నాహాలు చేస్తున్నది.

అభివృద్ధి పనుల గుర్తింపు 

మున్సిపల్‌ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం త్వరలో టెండర్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే చేపట్టాల్సిన పనులను గుర్తించగా... ఈ నెల 6వ తేదీన జరిగే పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. ఆ వెంటనే ఆన్‌లైన్‌లో టెండర్‌ పిలిచేందుకు అధికారులు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. బల్దియా పాలకవర్గ సమావేశం 2వ తేదీన జరగాల్సి ఉండగా, కరోనాతో ఓ విభాగం ఉద్యోగి మృతి చెందడంతో వాయిదా పడింది.

సీసీరోడ్లు, మురుగు కాలువలకు ప్రాధాన్యం

అభివృద్ధి పనుల్లో ప్రధానంగా సీసీరోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీల్లో పనులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే పెద్ద మురుగు కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ తొలగించేందుకు నిధులు కేటాయించనున్నారు. వీటితోపాటు ఇంటింటికీ నీటిని సరఫరా చేసే పైపులైన్లు, గేటువాల్వ్‌లకు అవసరమైన చోట మరమ్మతులు చేయిస్తారు.

నాణ్యతతో పనులు

మున్సిపల్‌ పరిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీపడేది లేదు. ఈ నెల 6న జరిగే పాలకవర్గ సమావేశంలో పనులకు ఆమోదముద్ర వేస్తాం. నిధులు కేటాయించినందుకు ప్రభుత్వానికి పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు.

-గందె రాధిక, చైర్‌పర్సన్‌


తాజావార్తలు


logo