శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 30, 2020 , 02:35:19

కర్షకోత్సాహం..

కర్షకోత్సాహం..

  • lరైతుబంధు పెట్టుబడి సాయంతో 
  • సాగు పనుల్లో నిమగ్నం
  • lడివిజన్‌లో 90 శాతం మంది రైతుల 
  •      ఖాతాల్లో  రూ.57 కోట్లకు పైగా జమ

హుజూరాబాద్: కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందిస్తుండడంతో అన్నదాతలు ఉత్సాహంతో సాగుకు సన్నద్ధమవుతున్నారు. డివిజన్ వ్యాప్తంగా ఇప్పటి వరకు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున నగదు జమ కాగా,  వారు ఎవుసం పనుల్లో నిమగ్నమయ్యారు.

డివిజన్‌లో మొత్తం 56,607మంది రైతులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో వానకాలానికి సంబంధించి ఇప్పటి వరకు 55,333 మంది ఖాతాల్లో రూ.57కోట్ల48లక్షల25వేలను ప్రభుత్వం జమ చేసింది. డివిజన్‌లో అత్యధికంగా సైదాపూర్ మండలంలో 12,388 మంది రైతులకు గాను 12,205మంది ఖాతాల్లో రూ.13 కోట్ల 30లక్షల 72వేల 470 జమయ్యాయి. ఆ తర్వాత వీణవంక మండలంలో 12,244 మంది రైతులకు గాను 12,082 మందికి రూ.13కోట్ల7లక్షల11వేల904, హుజూరాబాద్ మండలంలో 11,825 మంది రైతులకు గాను 11,531 మందికి రూ.11కోట్ల37లక్షల11వేల992, జమ్మికుంట మండలంలో 10,885 మంది రైతులకు గాను 10,492 మందికి రూ.10కోట్ల44లక్షల69వేల893, అత్యల్పంగా ఇల్లందకుంట మండలంలో 9,193 మంది రైతులకు గాను 9,023మంది ఖాతాల్లో రూ.9కోట్ల28లక్షల 58వేల818 జమయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా వానకాలం పంట సాగు సమయంలో పెట్టుబడి సాయం ఖాతాలో జమ చేయడంపై రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. ఆయా డబ్బులతో ఎరువులు, విత్తనాలను కొని తెచ్చుకుంటున్నామని అన్నదాతలు తెలిపారు.

30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి

జూన్ 16వ తేదీలోగా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులు ఈ నెల 30లోగా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మండల వ్యవసాయాధికారి సునీల్‌కుమార్ తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకం జిరాక్స్‌లతో పాటు రైతు ఫొటోను దరఖాస్తుకు జత పరచాలని చెప్పారు. కొత్తగా భూమి కొనుగోలు చేసినా, విక్రయించినా మీ సేవ కేంద్రంలో సవరణ చేయించుకోవాలని తెలిపారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు సంబంధించిన వివరాలను హుజూరాబాద్‌లో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు డివిజన్‌లో దాదాపుగా 500మంది రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. జనవరి 20 తేదీలోగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన వారు జూన్ 13లోగా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చిన ప్రభుత్వం, దానిని నేటి దాకా పొడిగించిందని పేర్కొన్నారు.

కరువులో కొండంత అండ...

కరోనా ప్రభావంతో మూడు నెలలుగా పైసా పని లేదు. కరువులో ఉన్న రైతులకు పెట్టుబడికి రైతుబంధు ఇచ్చి కొండంత అండగా నిలిచిండు కేసీఆర్ సార్. వానకాలం పంట సాగుకు నా బ్యాంక్ ఖాతాలో పైసలేసిండు. నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. రూ.20 వేలు రావడంతో విత్తనాలు కొని నారు పోసిన. భూమి కూడా దున్నిన. కేసీఆర్ సార్ చెప్పినట్లు సన్నరకం పంట పెడుతున్న. రైతుల కష్టం తెలిసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంట.

-చిలివేరు రాజయ్య, రైతు (హిమ్మత్‌నగర్)


logo