మంగళవారం 14 జూలై 2020
Karimnagar - Jun 30, 2020 , 02:36:24

హరిత వెల్‌చాల

హరిత వెల్‌చాల

  • సీఎం కేసీఆర్ స్ఫూర్తితో వేల సంఖ్యలో మొక్కల పెంపకం
  • lపచ్చదనం, పరిశుభ్రతే ప్రధాన ధ్యేయం
  • lఆహ్లాదభరితంగా గ్రామం
  • lవిరివిగా మొక్కల వితరణ, సంరక్షణకు చర్యలు
  • lప్రకృతి సేవలో వీర్ల కుటుంబం
  • lఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ 

రామడుగు : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ మండలంలోని వెలిచాల గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో ఐదు విడుతల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతుండగా, వెలిచాలతోపాటు అనుబంధ గ్రామాలైన కిష్టారావుపల్లి, గుడ్డెలుగులపల్లిలో వీధులన్నీ పచ్చని తివాచీ పరిచినట్లుగా మారాయి. గ్రామంలోకి చేరుకునేముందు కొత్తపల్లినుంచి బైపాస్‌వైపు అడుగు పెట్టగానే మొదటి దశ హరితహారంలో భాగంగా ప్రధాన రహదారికి ఇరువైపులా అటవీశాఖ అధికారులు నాటిన మొక్కలు పెరిగి పెద్దవై పచ్చని స్వాగతం పలుకుతున్నాయి. 

హరిత సేవలో వీర్ల కుటుంబం

ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న హరితహారం స్ఫూర్తిగా రామడుగు మండలంలో వీర్ల కుటుంబం వేల సంఖ్యలో మొక్కలను పంపిణీ చేసి ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యంగా వెలిచాల గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన, మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రతి హరితహారం కార్యక్రమంలో పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో నీడనిచ్చే మొక్కలతో పాటు బోగన్‌విలియా, బగోడ, కోనాకార్పస్, మల్లె, గులాబీ, రామసీతాఫలం, జామ, నూరు వరహాలు, మామిడి, సపోట, రావి, వేప, సీమ తంగేటు, బొడ్డుమల్లి, సైకస్, తదితర మొక్కలు ఉంటున్నాయి. గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల సంరక్షణ కోసం వందల సంఖ్యలో ట్రీగార్డులను అందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు అధికారులను ఆకట్టుకుంటున్నాయి. రామడుగు పోలీస్‌స్టేషన్ ఆవరణలో నాటేందుకు సుమారు రూ.లక్ష వెచ్చించి మొక్కలను అందించి, వాటిని సంరక్షించేందుకు బోరును ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఆచార్య జయశంకర్, తెలంగాణ అమరవీరులు కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి పేర్ల మీద మొక్కలు నాటారు. వెలిచాలలో ప్రతి ఏడూ వేల సంఖ్యలో మొక్కలు పంపిణీ చేస్తున్నారు.  

 కనీసం ఐదు మొక్కలు నాటండి

మొక్కలు నాటి, కాపాడడం అంటే నాకు చాలా ఇష్టం. జడ్పీటీసీగా ఉన్నప్పుడు హరితహారంలో భాగంగా వేల సంఖ్యలో మొక్కలు నాటిన. పంపిణీ చేసిన. వెలిచాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో నేను నాటిన మొక్కలు నేడు చెట్లుగా ఎదిగినయ్. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న. మీకు ఎంత తక్కువ భూమి ఉన్నా కనీసం ఐదు మొక్కలు నాటి, ఎండిపోకుండా నీరుపోసి కాపాడాలె. మొక్కల పెంపకంలో ఇతరులకు స్ఫూర్తిదాతలుగా నిలవాలె. 

-వీర్ల కవిత, మాజీ జడ్పీటీసీ,(రామడుగు )


పచ్చదనం, పరిశుభ్రతే నా ధ్యేయం

వెలిచాలను పచ్చదనం, పరిశుభ్రతలో ఉమ్మడి జిల్లాకే ఆదర్శంగా నిలుపాలన్నది నా సంకల్పం. లాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవలందించడం నా భర్త వీర్ల ప్రభాకర్‌రావు, మా అబ్బాయి వేంకటేశ్వరరావు నుంచి తెలుసుకున్న. నాకు 70 ఏండ్లు దాటినా గ్రామ సమస్యలు తీర్చడంలో ఏ రోజూ అలసిపోలేదు. ప్రతి వీధిలో ఆహ్లాదాన్ని అందించే మొక్కలు నాటించినం. గ్రామంలో పట్టణ అందాలను తలపించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నం.  

- వీర్ల సరోజన, సర్పంచ్, వెలిచాల, (రామడుగు)


logo