ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 29, 2020 , 00:35:56

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు అమోఘం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు అమోఘం

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలు అమోఘమని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆయన శత జయంతి వేడుకలు ఆదివారం కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపడుతున్న వేడుకల్లో భాగంగా పెద్దపల్లిలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, కరీంనగర్‌లో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొని పీవీకి నివాళులర్పించారు. దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ముద్దు బిడ్డ పీవీ అని మంత్రులు కీర్తించారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మౌనముని సేవలను స్మరించుకున్నారు. కరీంనగర్‌లో భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

కరీంనగర్‌కల్చరల్‌/ పెద్దపల్లి రూరల్‌: బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరీంనగర్‌ శివారులోని ఉజ్వలపార్క్‌లోగల పీవీ నరసింహారావు విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, నగర కమిషనర్‌ క్రాంతి, తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నగరంలో భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కరీంనగర్‌ డెయిరీలోని పీవీ విగ్రహానికి డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావు పూల మాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేంద్రంలో పీవీ చిత్రపటానికి సీపీ కమలాసన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. 

 పెద్దపల్లిలోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆధ్వర్యంలో పీవీ శతజయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి మంత్రి ఈశ్వర్‌తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ వీ లక్ష్మీనారాయణ, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామగుండం కమిషనరేట్‌ హెడ్‌ క్వార్టర్‌లో సీపీ సత్యనారాయణ పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

 జగిత్యాల కలెక్టరేట్‌లో కలెక్టర్‌ గుగులోతు రవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, జిల్లా స్థాయి అధికారులు పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

  రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఇతర అధికారులతో కలిసి పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జడ్పీ సీఈవో గౌతంరెడ్డి పీవీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.


logo