బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 25, 2020 , 01:30:21

‘సుడా’లో అక్రమ లే అవుట్లపై దృష్టి

‘సుడా’లో అక్రమ లే అవుట్లపై దృష్టి

కార్పొరేషన్‌: కరీంనగర్‌ శాతవాహన అర్బన్‌ అథారిటీ (సుడా) పరిధిలో  అక్రమ లే అవుట్లపై దృష్టి సారించింది. క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఇందుకు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం కల్పించింది.  అయితే ఆశించిన మేర దరఖాస్తులు రాకపోవడం, అడ్డగోలుగా అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరించేందుకు సుడా అధికారులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే ఫ్లెక్సీలు, కరపత్రాల ద్వారా భారీగా ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే గ్రామ పంచాయతీల కార్యదర్శులకు లే అవుట్లు లేకుండా రిజిస్టర్‌ అయినా ప్లాట్లకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వవద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. అలాగే రియల్‌ వ్యాపారులు, ప్లాట్ల విక్రయాలు చేసే వారు తప్పనిసరిగా లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసుకునేలా చూడాలని నిర్దేశించారు.  అలాగే ఆయా పంచాయతీల్లో 300 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన భవన నిర్మాణ అనుమతులను సుడా ద్వారా జారీ చేయాలని నిర్ణయించారు. 

ఫ్లెక్సీలు, కరపత్రాలతో ప్రచారం..

సుడా పరిధిలోని 580 చదరపు కిలోమీటర్ల పరిధిలో అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణపై విస్తృత ప్రచారం చేసేందుకు సుడా అధికారులు సిద్ధమయ్యారు. సుడా పరిధిలో కరీంనగర్‌ నగరపాలక సంస్థ, కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటుగా 62 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే కరీంనగర్‌, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో సుడా బాగానే పని చేస్తున్నది. పంచాయతీల పరిధిలో మాత్రం అక్రమ ప్లాటింగ్‌ జోరుగా సాగుతుందని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ అక్రమ వెంచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రెండు రోజులుగా సుడా పరిధిలోకి వచ్చే అన్ని పంచాయతీలకు కరపత్రాలు, ఫ్లెక్సీలను పంపిణీ చేస్తున్నారు. చౌరస్తాలు, కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు.  రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఆయా గ్రామాల సర్పంచులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే మండలాల వారిగా సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గడువులోగా అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరణ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్లను నిలిపివేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 

ఇలా దరఖాస్తు చేసుకోవాలి..

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద 2018 మార్చి 30లోగా ప్లాట్‌ను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారంతో పాటు రూ. 10 వేలను ఆన్‌లైన్‌లో చెల్లించాలి. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లు, స్థల మార్కెట్‌ విలువ కాపీ, రోడ్డు వెడల్పు చేసేందుకు అంగీకారం తెలుపుతూ సుడా వైస్‌చైర్మన్‌కు అప్పగించేందుకు సంబంధించిన దస్తావేజులు, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ సంతకంతో కూడిన ప్లాన్‌ను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. వీటితో పాటు స్థలం ఫొటో, లే అవుట్‌ నక్షను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు  

సుడా పరిధిలోని అక్రమ లే అవుట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.   ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని ప్రజలు, రియల్‌ వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలి. సెప్టెంబర్‌ 30లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. గడువులోగా రెగ్యులరైజ్‌ చేసుకోకుంటే  చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు అనుమతులున్న ప్లాట్లనే కొనుగోలు చేయాలి. లేదంటే ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

- సుభాష్‌, సుడా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారిlogo