గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 25, 2020 , 01:26:37

నాటిన ప్రతి మొక్కనూ బతికించడమే ధ్యేయం

నాటిన ప్రతి మొక్కనూ బతికించడమే ధ్యేయం

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు హరితహారం చేపడుతున్నది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నది. ఇప్పటికే ఐదు విడతలుగా చేపట్టి సక్సెస్‌ కాగా, గురువారం నుంచి ఆరో విడుత ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే ఊరూరా నర్సరీల్లో మొక్కలు సిద్ధం కాగా, వర్షాలు అనుకూలిస్తున్న తరుణంలో మరోసారి భారీగా మొక్కలు నాటేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.  

కరీంనగర్‌ జిల్లాలో గ్రీన్‌ ప్రణాళిక

జిల్లాలోని 313 గ్రామాలతో పాటు పట్టణాల్లో కలిపి 57లక్షల 65 వేల 668 మొక్కలు నాటనున్నారు. గ్రామాల్లో 37,06,805 మొక్కలు నాటాలని అధికారులు గ్రీన్‌ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ ప్లాంటేషన్‌ కింద 464 ప్రదేశాల్లో 5,07,599, అవెన్యూ ప్లాంటేషన్‌ కింద 563 ప్రదేశాల్లో 2,75,486, ఇనిస్టిట్యూట్‌ ప్లాంటేషన్‌ కింద 77 ప్రదేశాల్లో 70,383, బెన్‌ఫిషరీ ప్లాంటేషన్‌ కింద 345 ప్రదేశాల్లో 4,31,462, హోం సెట్‌ ప్లాంటేషన్‌ కింద 313 ప్రదేశాల్లో (గ్రామాలు) 19,03,346 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేశారు. అలాగే 54 చోట్ల చెరువు శిఖంలో 13 వేలు, మరో 54 చెరువు గట్లపై 30,400, కాలువల వెంట 7 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇక పట్టణ ప్రాంతాల్లో 20 లక్షల 58 వేల 863 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు వేశారు. కాగా, జిల్లాలో 86 రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. 323 నర్సరీల్లో 1.10 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి.

నాటే మొక్కలివే..
పండ్ల మొక్కల్లో ఆసిడ్‌ లైమ్‌, అల్లనేరేడు, అంజీర, బాదం, బొప్పాయి, చిన్న బాదం, చింత, దానిమ్మ, కర్జూరా, పనస, పులిచింత, రామసీతఫలం, సీమ చింత, సీతాఫలం, ఉసిరి వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇంటి పరిసరాల్లో నాటుకునేందుకు హోం నీడ్‌ మొక్కలైన చామంతి, గన్నేరు, గోరింట, గులాబీ, గుల్‌మొహర్‌, జాజిపూలు, కరివేప, క్రిష్ణ తులసి, మల్లె, మందార, పారిజాతం, శంఖుపూల మొక్కలు ఉన్నాయి. ఇక అటవీ సంబంధమైన బిలువ, బూరుగు, దుర్షేన, గంగరావి, జమ్మి, జిట్రేగి, జువ్వి, కదంబం, కానుగ, కుంకుడు, నల్లతుమ్మ, రావి, వెలగ, వేప, తదితర మొక్కలు ఉన్నాయి. ఇక బెనిఫిషరీ ప్లాంటేషన్‌ కింద మామిడి, సపోటా, జీడి మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, మునగ, తదితర మొక్కలు అందుబాటులో ఉన్నాయి..
మానవాళికి మనుగడ..
చెట్టు తల్లిలాంటిది. నేలపై మొలకెత్తిన మరుక్షణం నుంచి బతికున్నంత కాలం తోడై నిలుస్తున్నది. మనం వదిలే కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చి, ప్రాణాధారమైన ఆక్సిజన్‌ అందిస్తుంది. ఎండిన ఆకులతో సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతున్నది. పంట భూములను సారవంతం చేస్తున్నది. ఆకై, కాయై, పండై ఆకలి తీరుస్తున్నది. కలకాలం చల్లని నీడనిస్తున్నది. చివరకు చెట్టు మోడువారినా కలప అందిస్తున్నది. ఇలా మానవాళికే కాదు, సమస్త జీవరాశులకు బతుకునిస్తున్నది. వన్యప్రాణులు, పక్షులకు ఆవాసమై, ఆట స్థలమై ఉల్లాస పరుస్తున్నది.
ఆరేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్‌, అడవుల శాతాన్ని పెంచేందుకు నడుం బిగించింది. తెలంగాణకు హరితహారం పేరిట ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏటా జూన్‌ లేదా జూలైలో కోట్లాది మొక్కలు నాటుతున్నారు. నాటడమే కాదు, అదే స్థాయిలో మొక్కలను సంరక్షిస్తున్నారు. ఇప్పటికే ఐదు విడుతలుగా నిర్వహించారు. తాజాగా ఆరో విడతకు సిద్ధమయ్యారు. ప్రతి గ్రామ పంచాయతీకో నర్సరీ చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1233 నర్సరీలు ఏర్పాటు చేసి 4.02 కోట్ల మొక్కలు పెంచుతున్నారు. ఐదారు నెలలుగా వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రస్తుతం అన్నిచోట్లా మొక్కలు లక్ష్యానికి మించి సిద్ధం కాగా, గురువారం నుంచి      నాటనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా లక్ష్యాలను నిర్ణయించారు. 
మూడు రకాలుగా పెంపకం 
హరితహారం లక్ష్యాలను బ్లాక్‌, బెనిఫిషరీ, అవెన్యూ ప్లాంటేషన్‌ పేరుతో మూడు రకాలుగా పెంచేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 
బండ్‌ లేదా బ్లాక్‌ పద్ధతిలో రైతులు తమ వ్యక్తి గత భూముల్లో మొక్కలు నాటుకునే అవకాశం కల్పించింది. సన్న, చిన్న కారు రైతులకు ఒక్కొక్కరికి గరిష్టంగా 2 వేల మొక్కలు అందిస్తారు. మలబార్‌ వేప మొక్కలను ఎకరానికి 445 చొప్పున గరిష్టంగా రెండెకరాలకు మాత్రమే ఇస్తారు. బతికిన ప్రతి మొక్కకు నెలకు రూ.5 చొప్పున గరిష్టంగా రూ.3 వేలు అందిస్తారు. నీలగిరి మొక్కలు ఒక రైతుకు గరిష్టంగా 2 ఎకరాల వరకు ఎకరానికి వెయ్యి చొప్పున ఇస్తారు. బతికిన ప్రతి మొక్కకు నెలకు రూపాయి చొప్పున 12 నెలలు నిర్వహణ ఖర్చులు ఇస్తారు. ఈ మొక్కలు పొందేందుకు కుటుంబంలో ఒకరికి ఉపాధిహామీ జాబ్‌ కార్డు తప్పని సరిగా ఉండాలి.
అవెన్యూ ప్లాంటేషన్‌ కింద రోడ్లకు ఇరువైపులా 5 మీటర్లకు ఒకటి చొప్పున కిలో మీటరుకు 200 వరకు ఇరువైపులా 400 మొక్కలు నాటుతారు. ప్రతి కిలో మీటరు పరిధిలోని 400 మొక్కలను సంరక్షించేందుకు ఒక వాచర్‌ను నియమించుకోవచ్చు. నాటిన అన్ని మొక్కలను బతికించినట్లయితే రోజుకు రూ.237 చొప్పున వాచర్‌కు చెల్లిస్తారు. ఏడాదిలో 36 సార్లు నీళ్లు పోసేందుకు ట్యాంకరును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. పశువుల నుంచి మొక్కలను కాపాడేందుకు కంచెలు, ముళ్ల పొదలు ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి ఏర్పాటుకు కూలీ కింద రూ.130, ప్లాస్టిక్‌ ట్రీ గార్డులకు రూ.120, వీటిని అమర్చేందుకు రూ.20 చొప్పన చెల్లిస్తారు.
బెనిఫిషరీ ప్లాంటేషన్‌ కింద పండ్ల తోటల పెంపకం చేపడుతున్నారు. సన్న, చిన్న కారు రైతులకు మామిడి, బత్తాయి, నిమ్మ, సపోట, జామ, నేరేడు, జీడి మామిడి, ఆయిల్‌ ఫాం, చితం, కొబ్బరి, సీతాఫలం, ఆపిల్‌ బేర్‌, దానిమ్మ, కరండ, మునగ మొక్కలను ఉపాధి హామీ పథకం కింద పెంచేందుకు ప్రణాళికలు చేశారు. వీటిలో బతికి ఉన్న ప్రతి మొక్కకు నెలకు రూ.15 చొప్పున మూడేండ్ల పాటు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తారు. మునగ, కరండ మినహా మిగతా తోటలు పెంచే రైతులకు గరిష్టంగా రూ.3 వేలు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తారు. హరితహారంలో బెనిఫిషరీ ప్లాంటేషన్‌ కింద పందిరి కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 10-20 మంది రైతుల గుర్తించి వారిని ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్లాంటేషన్‌ కింద మల్బరీ తోటల పెంపకం కూడా చేపడుతున్నారు. గరిష్టంగా ఎకరానికి 5,445 మొక్కల చొప్పున ఇస్తారు. ఇందులో భాగంగా దుక్కి దున్నడం, బోదెలు తయారు చేయడం, ఎరువుల కొనుగోలు, మొక్కల కొనుగోలు, కలుపు తీయడం, మొక్కలు నాటడం, కొమ్మల కత్తిరింపు లాంటి పనులకు నాటిన మొక్కల్లో 100 శాతం బతికి ఉన్నట్లయితే పది నెలల వరకు నెలకు రూ.3 వేల చొప్పున రూ. 30 వేలు నిర్వహణ ఖర్చులు ఇస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
జిల్లాలో 27 శాఖల ద్వారా 54.82 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికారయంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 240 నర్సరీల్లో 70 లక్షల మొక్కలను అందుబాటులో ఉండగా, పండ్ల మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 39 లక్షలు, అటవీశాఖ 1.60లక్షలు, వ్యవసాయ, ఎక్సైజ్‌ శాఖలు 3 లక్షల చొప్పున, విద్యాశాఖ 2.50లక్షలు, ఉద్యానవన, నీటిపారుదల శాఖలు లక్ష చొప్పున, ఆర్‌అండ్‌బీ 50 వేలు, ఇతర శాఖలు లక్షా 22 వేల చొప్పున నాటనున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీలైన సిరిసిల్ల, వేములవాడల్లో లక్ష చొప్పున నాటనున్నారు. 
పెద్దపల్లి జిల్లాలో..
జిల్లాలోని ప్రభుత్వ విభాగాలు, కంపెనీల ఆధ్వర్యంలో 89 లక్షల 43 వేల మొక్కలను నాటనున్నారు. ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అత్యధికంగా 78.86 లక్షలు, అటవీ శాఖ 2.36 లక్షలు, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ 2.46 లక్షలు, మంథని మున్సిపల్‌ 20 వేలు, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ 19 వేలు నాటేందుకు అధికారులు లక్ష్యం విధించారు. సింగరేణి ఆధ్వర్యంలో 5 లక్షల 36 వేల మొక్కలు నాటనున్నారు. కాగా, జిల్లాలోని 280 నర్సరీల్లో 23 రకాలుగా 89 లక్షల 44 వేల 153 మొక్కలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


logo