మంగళవారం 11 ఆగస్టు 2020
Karimnagar - Jun 25, 2020 , 01:14:56

అండర్‌ గ్రౌండ్‌ వ్యవస్థను మెరుగుపర్చుతాం

అండర్‌ గ్రౌండ్‌ వ్యవస్థను మెరుగుపర్చుతాం

కార్పొరేషన్‌: నగరంలో అండర్‌ గ్రౌండ్‌ వ్యవస్థను మరింత మెరుగుపర్చుతామని మేయర్‌ వై సునీల్‌రావు స్పష్టం చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో భాగంగా బుధవారం 6వ రోజు ఆయన 30వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటి పైపులైన్‌ లీకేజీలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని నగర పాలక సంస్థ అధికారులకు సూచించారు. రోడ్లు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. రోడ్లపై నిలిచిన మురుగు నీటిని తొలగించాలన్నారు. మురుగు నీరు నిలిచి ఉన్న ప్రాంతాల్లో గంబూషియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌ వేయాలన్నారు. యూజీడీ చాంబర్స్‌కు లీకేజీలు పడగా ఏఈ వాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ చాంబర్స్‌ లీక్‌ అవడం, భూమి లోపలికి కుంగిన చాంబర్లను గుర్తించి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. కార్పొరేటర్‌ తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. యూజీడీ కనెక్షన్‌ ఇచ్చిన ప్రాంతాల్లో చాంబర్స్‌లో సమస్యలు వస్తున్నాయని, వీటిని పరిష్కరించేందుకు జెట్టింగ్‌ యంత్రాలను కొనుగోలు చేస్తామన్నారు. వచ్చే నెలలో ఈ యంత్రం అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ యంత్రం వస్తే నగరంలో యూజీడీ వ్యవస్థలో మార్పులు వస్తాయన్నారు. ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు తప్పకుండా కొత్త పైపులైన్లు వేస్తామన్నారు. డివిజన్‌లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో 40 మంది కార్మికులు పాల్గొని ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా డివిజన్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇండ్లల్లోని చెత్తను రోడ్లు, మురుగు కాలువల్లో వేయవద్దన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి మున్సిపల్‌ సిబ్బంది తీసుకువచ్చే రిక్షాలు, ఆటోల్లో వేయాలని కోరారు. కరీంనగర్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ నేతికుంట యాదయ్య, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


logo