గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 21, 2020 , 00:41:15

ఐదేళ్లలో 150 కోట్ల మొక్కలు నాటాం

ఐదేళ్లలో 150 కోట్ల మొక్కలు నాటాం

  • 1.14లక్షల ఎకరాల్లో    సన్నరకాల సాగుకు రైతుల మొగ్గు
  • అర్హులందరికీ రైతుబంధు వర్తింపు
  • జలహితంతో కాలువలు శుభ్రం 
  • రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌
  • జిల్లా కేంద్రంలో ఆరో విడుత   హరితహారం సన్నాహక సమావేశం 

జగిత్యాల, నమస్తే తెలంగాణ/జగిత్యాల: హరితహారంలో భాగంగా గత ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150కోట్ల మొక్కలు నాటామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక సంక్షేమ మండలిలో శనివారం హరితహారం, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నూతన సమగ్ర వ్యవసాయ సాగు విధానంపై సమావేశం నిర్వహించగా, ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో గతేడాది 1.82కోట్ల మొక్కలు నాటగా, అందులో 87 శాతం బతికించుకున్నామని తెలిపారు. ఈ ఏడాది 71లక్షల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఎస్సారెస్పీ కాలువల పక్కన మొక్కలు నాటాలని, కెనాల్‌కు హద్దులను రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు నిర్దేశించాలన్నారు. ఇప్పటివరకు మొక్కలు నాటేందుకు 11లక్షల గుంతలు తవ్వారని, నాలుగు నుంచి ఆరు ఫీట్లున్న మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర వ్యవసాయ సాగు విధానంలో భాగంగా జిల్లాలో 2.28లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తారని, ఇందులో 50శాతం సన్న రకాలు పండించడానికి రైతులు మొగ్గు చూపారని తెలిపారు. వానకాలం సాగుకు రైతులకు విత్తనాల సమస్యలు రానివ్వవద్దని అధికారులకు సూచించారు. సన్న రకం వరి, పత్తి, పసుపు, కంది, పెసర, సోయా పంటలను సాగు చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి రైతుకూ రైతుబంధు పథకం వర్తిస్తుందన్నారు. పల్లె,  పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా పల్లెలు, పట్టణాలు శుభ్రంగా మారాయన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పల్లె, పట్టణాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామా ల్లో సమస్యలుంటే అక్కడే పరిష్కరించుకోవాలని, జఠిలమైతేనే ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ దృష్టికి తేవాలన్నారు. జలహితంతో జిల్లాలోని ఎస్సారెస్పీ కాలువలన్నీ శుభ్రంగా మా రాయని,  చొప్పదండి, వేములవాడ నియోజకవర్గాల్లోని మల్యాల, కొడిమ్యాల, మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లోనూ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.  

రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలి

ఇక నుంచి మిల్లర్లకు రైతుకు సంబంధం లేకుండా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ఇటీవల రైతులను ఇబ్బంది పెట్టిన మిల్లర్లను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కలెక్టర్‌ రవిని మంత్రి ఆదేశించారు. రైతుల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్‌ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానిస్తూ రైతు కల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించారన్నారు. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఏర్పాటు చేస్తామని, దశలవారీగా మిగతావి నిర్మిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో అత్యధికంగా వరి సాగైందని, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో అదనంగా 2.10లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రావడం విశేషమన్నారు. జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంప్‌ యార్డుల నిర్మాణం చేపట్టామన్నారు. వైకుంఠధామాల్లోనూ మొక్కలు నాటి వాటిని పార్కులను తలపించేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రతి గ్రామంలో సర్పంచ్‌, ఎంపీటీసీలతో సమావేశాలు నిర్వహించి హరితహారాన్ని విజయవంతం చేస్తామన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో చెరువులు, ఎస్సారెస్పీ కాలువల పక్కన మొక్కలు నాటాలని, మంకీ ఫుడ్‌కోర్డులను కూడా ఏర్పాటు చేయాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో విరివిగా మొక్కలు నాటాలన్నారు. పామాయిల్‌  సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మా ట్లాడుతూ.. గత ఐదేళ్లలో కోట్లాది మొక్కలు నాటడంతో సకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. హరితహారంలో భాగంగా ఎస్సారెస్పీ కాలువల పక్కన పండ్ల మొక్కలు కూడా నాటాలని సూచించారు. కలెక్టర్‌ రవి మాట్లాడుతూ.. జిల్లాలో 71లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా కాగా, 380 నర్సరీల్లో 1.31కోట్ల మొక్కలు పెంచామని తెలిపారు. జిల్లలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటుతామన్నారు. ఇప్పటికే నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటుతామని తెలిపారు. ఎస్సారెస్పీ కాలువ పొడవు 43 కిలోమీటర్లు కాగా కాలువల పక్కన మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ హరిచరణ్‌రావు, అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, జగిత్యాల మున్సిపల్‌ అధ్యక్షురాలు డాక్టర్‌ బోగ శ్రావణి, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 


logo