గురువారం 24 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 20, 2020 , 01:43:27

వేస్ట్‌ డీకంపోజర్‌ నేలకు సంజీవని

వేస్ట్‌ డీకంపోజర్‌ నేలకు సంజీవని

సేంద్రియ సేద్యానికి చక్కటి మార్గం

lవ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ 

lచిన్నపాటి శ్రమతో కంపోస్టును తయారు చేసుకునే వీలు 

lవాడితే బహుళ ప్రయోజనాలు 

lపంటకు పుష్కలంగా పోషకాలు

lదిగుబడి దండిగా పెరిగే అవకాశం

lఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో పలువురు రైతుల సత్ఫలితాలు 

నేల పూర్తిగా రసాయనాలతో నిండిపోయిందా..? సేంద్రియ సేద్యం చేయాలని అనుకుంటున్నారా..? మరే ఇతర అవకాశాలు లేవని చింతిస్తున్నారా..? ఏ మాత్రం వద్దు.. ఇలాంటి సమస్యలన్నింటికీ వినిపిస్తున్న ఏకైక పరిష్కారం వేస్ట్‌ డీ కంపోజర్‌. గోవుల్లేని ప్రాకృతిక వ్యవసాయానికి బహుళప్రయోజనకారిగా, నేలకు సంజీవనిలా పనిచేస్తుంది. భూసారాన్ని పెంచడంతోపాటు చీడపీడలను తగ్గించి దిగుబడులను అమాంతం పెంచుతుంది. ఎలాంటి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చుతో సిరులు పండిస్తుంది. ఇప్పటికే దీనిని ఉపయోగించి పలువురు రైతులు సత్ఫలితాలు సాధిస్తుండగా, మార్కెట్లో రూ.20కి దొరికే బాటిల్‌ను వ్యవసాయశాఖ ఇప్పుడు ఉచితంగా అందిస్తున్నది. మరెందుకు ఆలస్యం ఈ వానకాలం పంటల నుంచే మొదలు పెట్టండి.  

పెద్దపల్లి జంక్షన్‌: ప్రస్తుతం అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా వా డుతున్న రసాయనాలు, పురుగు మందులతో నేల దెబ్బతింటున్నది. భౌ తిక లక్షణాలు, స్వభావం కోల్పోయి విషతుల్యం అవుతున్నది. మెత్తదనం తగ్గి, సారవంతమైన భూములు చౌడుగా మారిపోతున్నాయి. మరోవైపు రసాయనాలతో పండించిన ఉత్పత్తులతో మనుషుల ఆరోగ్యానికి ముప్పువాటిల్లుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రైతులు గో ఆధారి త వ్యవసాయాన్ని ఎంచుకుంటుండగా, గోవుల్లేని వారు వ్యవసాయ వ్య ర్థాలతో సేంద్రియ సేద్యం చేసుకునేలా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని కొన్నేళ్ల క్రితం తయారు చేసింది. అక్కడ చాలా మంది రైతులు ఉపయోగించి సత్ఫలితాలు సాధిస్తుండగా, మన దగ్గరా దొరుకుతున్నది. మార్కెట్లో రూ.20కి లభించే ఈ బాటిల్‌ను వ్యవసాయశాఖ ఉచితంగా అందజేస్తున్నది. 

రైతుల సత్ఫలితాలు..

వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణాన్ని ఉపయోగించి పెద్దపల్లి జిల్లాలో పలువురు రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. నాడు అధిక దిగుబడుల కోసం రసాయన మందులు విచ్చలవిడిగా వాడి, క్రమంగా నష్టాల్లో కూరుకుపోయిన కర్షకులు గోవుల్లేని సేంద్రియ సేద్యం చేస్తూ ఇప్పుడు సిరుల పంట పండిస్తున్నారు. జిల్లాలో దాదాపు 30 మంది రైతులు దీనిని వినియోగిస్తూ సేంద్రియ సేద్యం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బహుళ ప్రయోజనకారి..

ఇది గోమూత్రం ద్వారా సేకరించిన సూక్ష్మజీవుల సమూదాయం. దీనిని బహుళ పోషకంగా, భూ సంజీవనిలా, వ్యర్థ విచ్చేదకంగా కూడా పేర్కొంటారు. ఇది 30 గ్రాముల మోతాదులో చిన్న బాటిల్‌లో లభిస్తుంది. ధర రూ.20. కావాల్సిన రైతులకు వ్యవసాయశాఖ ఉచితంగా అందజేస్తుంది. దీనిని రసాయనాలతో పని లేకుండా పొలం దున్నిన మొదలు పంట చేతికచ్చే వరకూ పలు రకాలుగా వినియోగించుకోవచ్చు. వరికోసిన తర్వాత కొయ్యకాలు అలాగే ఉంచి తయారు చేసుకున్న ద్రావ ణానికి తడి ఇచ్చి ప్రతిసారి ఎకరానికి 400 లీటర్ల ద్రావణాన్ని సాగునీటిలో కలిపి పారించాలి. ఇలా రెండుమూడు సార్లు నీళ్లు పెట్టాలి. కొయ్యకాలు లేకపోతే వరిగడ్డి, ఇతర వ్యర్థాలను వేసుకిని తడి ఇవ్వాలి. కొద్దిరోజుల తర్వాత అందులోనే కలియదున్నాలి. ఇది నేల సారం పెంపు, సేంద్రియ ఎరువులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. భూసారం పెరిగి, చీడపీడలు తగ్గి, అధిక దిగుబడులు ఇస్తాయి. అలాగే పంటపై చల్లితే చీడపీడలు, తెగుళ్ల బెడదపోతుంది. ఈ ద్రావణాన్ని డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా పొలానికి అందించవచ్చు. వరిగడ్డిపై చల్లి కంపోస్టు ఎరువును తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణంతో విత్తన శుద్ధి చేసుకుంటే త్వరగా మొలకెత్తుతాయి. మొక్క బలంగా ఉంటుంది. 

వేస్ట్‌ డీ కంపోజర్‌ కల్చర్‌.. 

ఒక ప్లాస్టిక్‌ డ్రంబు(200లీటర్ల సామర్థ్యం)ను నీటితో నింపుకోవాలి. అందులో వ్యర్థాలు వేసి రోజుకోసారి కలియదిప్పుతూ ఉంటే 4 లేదా 5 రోజుల్లో ద్రావణం లేత గోధుమ రంగులోకి మారుతుంది. ఒకదశలో పులిసిన వాసన కూడా వస్తుంది. అప్పుడు వేస్ట్‌ డీ కంపోజర్‌ కల్చర్‌ తయారవుతుంది. 

కంపోస్ట్‌ తయారీ.. 

ఒక ప్లాస్టిక్‌ కవర్‌ను తీసుకొని నీడలో పరిచి, అందులో ఒక టన్ను వ్యవసాయ వ్యర్థాలను వేయాలి. దానిపై మనం తయారు చేసుకున్న వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణాన్ని 20 లీటర్ల దాకా చల్లాలి. ఆ తర్వాత దాని మీద మరో పొరలో వ్యర్థాలు వేసి ఇంకో 20 లీటర్ల ద్రావణాన్ని చల్లాలి. రోజువిడిచి రోజు వ్యర్థాలను తిరగమరగ వేస్తూ తేమ ఉండేలా చూసుకోవాలి. వారం రోజులయ్యాక కంపోస్టు తయారవుతుంది. దీనిని ఎరువుగా వినియోగించుకోవచ్చు.

బహుళ ప్రయోజనాలు.. 

గోవులు లేకుండానే వేస్ట్‌ డీ కంపోజర్‌ సాయంతో ప్రాకృతిక వ్యవసాయం చేయవచ్చు. ఈ బాటిల్‌ మార్కెట్లో రూ.20కే దొరుకుతుంది. పంట వ్యర్థాలు, బెల్లంతో ఎరువులను తయారు చేసుకొని నేలకు అందిస్తే మంచి ప్రయోజనాలుంటాయి. భూసారం పెరగడంతోపాటు మంచి దిగుబడులు వస్తాయి. ఖర్చులు తగ్గుతాయి. ఇది ఉపయోగించి సేద్యం చేసేవారికి మంచి లాభాలు వస్తున్నయ్‌. పురుగుల మందులతో పని లేకుండా మనకున్న వనరులతో సేంద్రియ కర్బనాన్ని తయారు చేసుకొని సాగు చేయవచ్చు. జిల్లాలో కొంత మంది మాత్రమే  దీనిని వాడుతున్నారు. దీనిపై జిల్లాలో అవగాహన కల్పించాం. ఎలా తయారు చేయాలో వ్యవసాయాధికారులను సంప్రదిస్తే వివరిస్తారు. అంతేకాకుండా ఈ ద్రావణాన్ని ఉచితంగా అందజేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నాం. 

ఉపయోగాలు..

మూడు విడతలుగా సాగునీటిలో ఈ ద్రావణాన్ని కలిపి నేల కుఅందిస్తే నెమటోడ్స్‌ (నులిపురుగుల)సమస్య తగ్గుతుంది. 

మట్టి, గాలి, నీటి ద్వారా వచ్చే ఎటువంటి తెగుళ్లనైనా ఇది అరికడుతుంది. 

వేరుకుళ్లు, బూజు తెగులును నిరోధిస్తుంది. 

వానపాముల వృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది. 

90 శాతం రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది. 

నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. 

ఉదజని సూచిక పంటలకు అనువుగా ఉంటుంది. 

ఎకరాకు వెయ్యి లీటర్ల ద్రావణం వేస్తే అన్ని రకాల నేలల (ఆడ, చౌడు) భూ భౌతిక లక్షణాలు 21రోజుల్లో మెరుగుపడతాయి. 

భూమికి ఉపయోగపడే వానపాములు, సూక్ష్మజీవుల వృద్ధిని గణనీయంగా పెంచుతుంది.

నేల గుళ్లబారి విత్తనాలు త్వరగా మొలకెత్తేందుకు దోహదపడుతుంది. 


logo