గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jun 20, 2020 , 01:43:25

చివరి ఆయకట్టుకూ సాగునీరు

చివరి ఆయకట్టుకూ సాగునీరు

n  ఆధునీకరణతో పెరుగనున్న ఎస్సారెస్పీ కాలువ సామర్థ్యం

n  త్వరలోనే ఉపకాలువల మరమ్మతులు పూర్తి

n  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

n  ప్రధాన, ఉప కాలువల పరిశీలన

హుజూరాబాద్‌ టౌన్‌: ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టు వరకు సరిపడా సాగునీరందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్‌ కే శశాంక, జడ్పీ చైర్‌పర్సన్‌ కే విజయతో కలిసి ఎస్సారెస్పీ కరీంనగర్‌-వరంగల్‌ ప్రధాన కాలువ, దాని ఉప కాలువలైన డీబీఎం 15, 16ను మంత్రి పరిశీలించారు. ఎస్సారెస్పీ ఈఈ శ్రీనివాస్‌, డీఈఈ రవీందర్‌లను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలు డీబీఎం 15లో పేరుకుపోయిన సిల్ట్‌ వెలికితీత పనులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ ఎస్సారెస్పీ కాలువ ద్వారా రైతులకు గతంలో 5వేల క్యూసెక్కుల నీరు అందగా, కాలువలను ఆధునీకరించడం వల్ల ఈ సారి సామర్థ్యం 6 వేల నుంచి 8వేల క్యూసెక్కులకు పెరుగనున్నదని తెలిపారు. ఉపకాలువల మరమ్మతులను త్వరలోనే పూర్తి చేసి చివరి ఆయకట్టు పంటలకు సైతం సమృద్ధిగా సాగునీరు అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు నియంత్రిత సాగు చేయాలని రైతులను కోరారు.

వృద్ధుల కోసమే ‘ఆలన’

కేసీక్యాంప్‌లోని మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ‘ఆలన’  పేరిట ఏర్పాటు చేసిన వాహనాలను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని వయో వృద్ధుల చెంతకే వెళ్లి మెరుగైన వైద్య సేవలందించడానికే ‘ఆలన’ మొబైల్‌ వాహనం ఏర్పాటు చేశామన్నారు. ఇందులో డాక్టర్‌, టెక్నీషియన్‌ (వైద్య పరీక్షలకు), ఉచిత మందులు, ఫిజియోథెరపిస్ట్‌, ఎంఎన్‌వో (హోమ్‌కేర్‌) సేవలందిస్తారని తెలిపారు. అంతకు ముందు 101 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూరైన రూ.64.57 లక్షల విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.  అలాగే హుజూరాబాద్‌, జమ్మికుంటలో పలు అభివృద్ధి పనులపై ఆయా మున్సిపాలిటీల పాలకవర్గాలతో సమీక్షించారు. నియంత్రిత పంటల సాగు, ప్రభుత్వ స్థలాల గుర్తింపు, పాస్‌బుక్కుల జారీ, రైతుబంధు, రైతుబీమాపై రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సహాయంగా హుజూరాబాద్‌ ఎల్‌ఐసీ ఏజెంట్లు రూ.35 వేల విరాళం చెక్కును మంత్రికి అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో హుజూరాబాద్‌ ఆర్డీవో బెన్‌షాలోం, తహసీల్దార్‌ బావుసింగ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌, ఎంపీపీ ఇరుమల్ల రాణి, ఎంపీడీవో జీవన్‌రెడ్డి, జడ్పీటీసీలు పడిదం బక్కారెడ్డి, లాండిగే కల్యాణి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కన్నెబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌ అధ్యక్షులు గందె రాధిక, తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, ఎస్సారెస్పీ జేఈ శ్రీనివాస్‌, ప్రాజెక్ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చొల్లేటి కిషన్‌రెడ్డి, ఏడీఏ దోమ ఆదిరెడ్డి, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల తదితరులు పాల్గొన్నారు. 

పోతిరెడ్డిపల్లి బ్రిడ్జి పరిశీలన

వీణవంక, జమ్మికుంట రూరల్‌: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిని మంత్రి ఈటల రాజేందర్‌ పరిశీలించారు. వంతెనను వీలైనంత త్వరగా నిర్మించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అలాగే జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ ఎస్సారెస్పీ కాలువను మంత్రి ఈటల పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు జడ్పీటీసీ శ్రీరాంశ్యాం, ట్రస్మా నియోజకవర్గ చైర్మన్‌ ముసిపట్ల తిరుపతిరెడ్డి, నాయకులు పంజాల సతీశ్‌, కుమార్‌, శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.


logo