సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 19, 2020 , 02:25:53

ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకురావాలి

ఆయిల్‌పామ్‌ సాగుకు ముందుకురావాలి

  • lరాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి
  • lమెట్‌పల్లి మండలం మేడిపల్లిలో పాలీహౌస్‌ సందర్శన

మెట్‌పల్లి రూరల్‌: ఆయిల్‌పామ్‌సాగుకు రైతులు ముందుకు రావాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు.  ఈ పంట సాగుకు రాష్ట్రంలోని 24 జిల్లాలు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.  మెట్‌పల్లి మండలం మేడిపల్లి శివారులో రజాక్‌, రెహమాన్‌ సోదరులు 20 ఎకరాల్లో పౌలీహౌస్‌  విధానంలో సాగు చేస్తున్న కూరగాయల పంటలను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు  పదెకరాల్లో కూడా పాలీహౌస్‌లు లేవని, సీఎం కేసీఆర్‌  కృషి తో నేడు 1500 ఎకరాల్లో పాలీహౌస్‌ల ద్వారా పంటలు సాగుచేస్తున్నారని చెప్పారు.  ఇందుకు రూ. 300 కోట్లు కేటాయించామన్నారు. ఎస్సీలకు 95, ఇతరులకు 75 శాతం రాయితీపై పాలీహౌస్‌లు నిర్మించుకునే అవకాశం ఉందన్నారు. రైతుల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకే సీఎం కేసీఆర్‌ నియంత్రిత పంటల సాగుకు శ్రీకారం చుట్టారని, అందులో భాగంగానే ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ఏడాదికి 6 లక్షల మెట్రిక్‌ టన్నుల పా మాయిల్‌ అవసరముండగా, 1.5 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే  ఉత్పత్తి అవుతున్నదని, మిగతా 4.5 లక్షల మెట్రిక్‌ టన్నులను 70వేల కోట్లు  వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 30 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాలుగేళ్ల తర్వాత పంట దిగుబడి ప్రారంభమవుతుందని, అప్పటి వరకు బాటల వెంట మల్బరీ, వెదురు, చందనం మొక్కలను అంతర పంటలుగా సాగు చేసుకుంటే అదనపు ఆదాయం ఆర్జించవచ్చని చెప్పారు. రాయితీపై మొక్కలు, డ్రిప్‌ పరికరాలు సరఫరా చేస్తామన్నారు. ప్రభుత్వం ఆసక్తి గల పామాయిల్‌ కంపెనీల నుంచి దరఖాస్తులు స్వీకరించి,  స్క్రీనింగ్‌ కమిటీ ద్వారా అర్హులైన వాటిని ఎంపిక చేస్తామని తెలిపారు. ఎకరానికి 25 వేల పెట్టుబడి కాగా లక్ష ఆదాయం వస్తుందని, ఏ పంటకూ లేని నేషనల్‌ యాక్ట్‌ (ఆయిల్‌పామ్‌ యాక్ట్‌ 1993) ఆయిల్‌పామ్‌కు ఉందని, పంటను సైతం కంపెనీలే కొనుగోలు చేస్తాయని, నిర్దేశిత సమయంలో రైతులకు డబ్బులు చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు  తీసుకోవచ్చన్నారు.  కలెక్టర్‌   రవి మాట్లాడుతూ యువ రైతులు  సేంద్రియ వ్యవసాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, తహసీల్దార్‌ రాజేశ్‌, సర్పంచ్‌ పీసు తిరుపతి, ఎంపీటీసీ గుండెల నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.logo