బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 18, 2020 , 00:11:25

విత్తన దందాపై ఉక్కుపాదం

విత్తన దందాపై ఉక్కుపాదం

l ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి వ్యవసాయ, పోలీస్‌ యంత్రాంగం

l జిల్లాల వారీగా పత్యేక బృందాల నిఘా

l ముమ్మర తనిఖీలు

l ఎక్కడ నిబంధనలు అతిక్రమించినా కొరడా

l భారీగా పట్టుబడుతున్న విత్తనాలు, ఎరువులు 

l ఒక్క కరీంనగర్‌లోనే ఐదు  కేసులు

l అక్రమార్కుల్లో వణుకు

నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నరు. ఆర్థికంగా చితికి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఒక్క మాటలో చెప్పాలంటే నకిలీ విత్తన వ్యాపారులు రైతు హంతకులు. వీరి విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. రైతుబంధు సమితులు చురుకైన పాత్ర పోషించాలి. పోలీసుల సాయంతో పీడీ యాక్ట్‌ కింద కేసులు పెట్టాలి. ఆ వ్యాపారుల గురించి సమాచారమిచ్చిన వారికి 5 వేలు ఇవ్వాలి. వారి పేర్లను గోప్యంగా ఉంచాలి.  - ఇటీవల పలు సమీక్షల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

  కరీంనగర్‌, నమస్తే తెలంగాణ:  యేటా వానకాలం సీజన్‌లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రధానంగా పత్తి, వరి పంటలను సాగుచేస్తారు. ఈ యేడు ని యంత్రిత సాగులో భాగంగా మక్క సాగును తగ్గిం చి దాని స్థానంలో పత్తిని ప్రోత్సహించాలని ప్రభు త్వం ఆదేశించడంతో  ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పత్తి ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉండండంతో నకిలీ విత్తన కేటుగాళ్లకు ఇది మంచి అవకాశంగా లభించింది. లూజు పత్తి విత్తనాలను క్వింటాళ్ల కొద్ది గ్రామాల్లో రహస్యంగా దించుతున్నట్లు తెలుస్తోంది.  రైతులకు మాయ మాటలు చెప్పి అక్రమంగా కట్టబెడుతున్నట్లు సమాచారం. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు ముఠాలుగా ఏర్పడి గుట్టుగా గ్రామాల్లో సంచరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో పేరున్న రైతులను ఎంచుకుని వారితో మిగతా రైతులకు చెప్పిస్తున్నారు. వారి మాటలను అమాయకంగా నమ్ముతూ రైతులు మోసపోతున్నారు. కొందరు అక్రమార్కులు తమ వ్యాపార నిర్వహ ణకు మహిళలు, వృద్ధులను కూడా ఎంచుకుంటున్నారు. రామడుగు మండలం తిర్మలాపూర్‌లో ప ట్టుబడిన వారిలో ఒక వృద్ధురాలు ఉండడం ఇం దుకు నిదర్శనం. మహిళలు, వృద్ధులపై పోలీసులు కేసులు పెట్టరనే ధీమాతో అక్రమార్కులు ఈ రకంగా ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. 

  హెచ్‌టీ విత్తనాలే ప్రధాన దందా.. 

బీటీ-3 ఫార్ములాతో రూపొందించిన హెచ్‌టీ పత్తి విత్తనాల పేరుతో అక్రమార్కులు దందా సాగిస్తున్నారు. ఈ విత్తనాలకు గడ్డి మందు తట్టుకునే శక్తి ఉన్నట్లు నకిలీ విత్తన వ్యాపారులు ప్రచారం చేస్తున్నారు. ఈ విత్తనాలు విత్తుకుని ైగ్లెఫొసెట్‌ అనే గడ్డి మందును తరుచూ వాడడం వల్ల నేల సారం దెబ్బతింటుందని, పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్‌టీ పత్తి విత్తనాలను నిషేధించాయి.  అయినా బీటీ-3 పేరుతో రైతులకు ఈ  విత్తనాలను అంటగడుతూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. నిజానికి మార్కెట్లో బ్రాండెడ్‌ కంపెనీల పత్తి విత్తనాలు ప్యా కెట్ల రూపంలో లభిస్తాయి. 450 గ్రాముల పత్తి ప్యాకెటును ఈ ఏడాది రూ. 720 ఎంఆర్‌పీకి విక్రయిస్తున్నారు. కానీ బీటీ-3 పేరిట హెచ్‌టీ పత్తి విత్తనాలు విక్రయించే ముఠాలు లూజ్‌గా లేదా ఇతర పేరున్న కంపెనీల లేబుల్స్‌ ఉన్న కవర్లలో ప్యాక్‌ చేసి రూ. 650- 500కే విక్రయిస్తున్నారు. కొందరు అక్రమార్కులు అంతకంటే తక్కువ ధర కే రైతులకు అంటగడుతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని, గడ్డి మందును తట్టుకుంటే కలుపు ఖర్చులు కలిసి వస్తాయని నమ్మి ఈ ముఠాల వద్ద రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. 

  గుట్టు రట్టు చేస్తున్న అధికారులు.. 

నకిలీ విత్తనాలు విక్రయించే ముఠాలపై అధికారు లు నిఘా పెంచారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గతంలోనే డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులతో జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పా టు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ డివిజన్‌కు ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇటు పోలీసు, అటు వ్యవసాయ శాఖ అధికారులతో ఏ ర్పడిన బృందాలు ఇప్పటికే పలువురిని పట్టుకున్నాయి. హైదరాబాద్‌కు జిల్లా నుంచి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను తిమ్మాపూర్‌ మం డలం కొత్తపల్లి వద్ద పట్టుకున్నారు. ఇదే మండల కేంద్రంలో మరోసారి పోలీసు టాస్క్‌ఫోర్స్‌ ఏకం గా ఒక ముఠానే పట్టుకుంది. రామడుగు మండ లం తిర్మలాపూర్‌లో ఆంధ్రాకు చెందిన ఒక వృద్ధురాలు, ఆమె మనవడు లూజ్‌ పత్తి విత్తనాలు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఈ సీజన్‌లో ఒక్క కరీంనగర్‌ జిల్లాలోనే రూ. 51 లక్షలకుపైగా విలువైన నకిలీ, నాసిరకం విత్తనాలను పట్టుకుని ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఇదే జిల్లాలోని శంకరపట్నంలో రూ. 2.40 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాలు పట్టుకున్నారు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఐదుగురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇక సిరిసిల్ల జిల్లా వేములవాడలో లూజ్‌ పత్తి విత్తనాలను పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో నకిలీ వరి విత్తనాలను భారీ సంఖ్యలో పట్టుకున్నా రు. మానకొండూర్‌ మండలంలోని ఓ గ్రామంలో ఈ విత్తనాలు శుద్ధి చేసినట్లు  సుల్తానాబాద్‌లో దొ రికిన నకిలీ వరి విత్తనాల సంచులపై లేబుల్స్‌ ఉన్నాయి. నిజానికి మానకొండూర్‌ మండలంలో ఎక్కడా విత్తన శుద్ధి ప్లాంట్‌ లేదు. ఇలా ఈ సీజన్‌లో ఇప్పటికే పలువురు నకిలీ విత్తనాల విక్రయదారులను పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు పట్టుకున్నారు. 

  మరింత కట్టుదిట్టం.. 

తాజాగా బుధవారం హైదరాబాద్‌లోని ప్రగతి భ వన్‌లో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడం తో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ విత్తన ముఠాల ఆటకట్టిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అం దులో భాగంగా వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశా రు. ట్రాన్స్‌ఫోర్టు ఏజెన్సీలపై నిఘా పెంచారు. విజిలెన్స్‌ అధికారులు గ్రామాల్లో సంచరిస్తూ గత పదేళ్లలో ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కదలికలపై నిఘా పెట్టారు. రైతులు కూడా సహకరిస్తే జిల్లాలో నకిలీ విత్తనాల జాడ లేకుండా చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.logo