గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jun 17, 2020 , 01:54:47

పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం

n చరిత్రకు ఆనవాళ్లు పురాతన  కట్టడాలు, విగ్రహాలు

n ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌

n కోట్లనర్సింహులపల్లిలో తీర్థంకరుల  విగ్రహాల పరిశీలన

గంగాధర: గంగాధర మండలంలోని కోట్లనర్సింహులపల్లి, బొమ్మలమ్మగుట్టను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు.  కోట్లనర్సింహులపల్లిలో మూడు రోజుల క్రితం జైనమత 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడి విగ్రహం బయట పడిన ప్రదేశానికి మంగళవారం ఎమ్మెల్యే వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోట్లనర్సింహులపల్లికి  3500 ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్నట్లు పురావస్తుశాఖ అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఊరి చుట్టూ ఉన్న మట్టి గోడలు, గుట్టపై పురాతన దేవాలయాలు, ఇక్కడి వ్యవసాయ భూముల్లో దున్నినప్పుడు బయటపడిన విగ్రహాలు, కుండల ముక్కలు పరిశీలించినట్లు చెప్పారు. రెండు రోజుల క్రితం జైనమత 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు, రెండేళ్ల క్రితం 23వ తీర్థంకరుడైన పార్శనాథుడి విగ్రహం బయటపడినట్లు తెలిపారు. గ్రామంలోని బీరప్ప ఆలయంలో పూజలు చేస్తున్న విగ్రహాలు కొత్తరాతి యుగానికి చెందినవని పేర్కొన్నారు. ఆలయంలో విగ్రహాల పక్కనే ఉన్న రాతి గొడ్డళ్లను పూజించడం గొప్ప అరుదైన సంప్రదాయమని, రాతి గొడ్డళ్లు క్రీ.పూ. 3 వేల ఏళ్ల క్రితానికి చెందినవి కావడం కోట్లనర్సింహులపల్లి గొప్ప చారిత్రక కేంద్రంగా వెలగొందినట్లు తెలిసిందన్నారు.  కోట్లనర్సింహులపల్లి, బొమ్మలమ్మ గుట్టను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించడంతో పాటు అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ త్వరలోనే ఇక్కడికి వస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, సర్పంచ్‌ తోట కవిత, నాయకులు తోట మల్లారెడ్డి,  ఎంపీటీసీ ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు తోట మహిపాల్‌, దుబ్బాసి బుచ్చయ్య, గంగాధర సంపత్‌, ఇరుగురాల రవి,  గ్రామస్తులు పాల్గొన్నారు.


logo