శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 17, 2020 , 01:38:29

వరికి 35 వేలు పత్తికి 37 వేలు

వరికి 35 వేలు పత్తికి 37 వేలు

n    పెరిగిన పంట రుణ పరిమితి  

n    పూర్వ జిల్లా పరిధిలో రెండు సీజన్లకు ఖరారు

n    ఈ సారి టమాటకు చోటు 

n    బ్యాంకర్లకు అందిన  టీజీసీ ఆదేశాలు

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారంగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వాలి. ఏటా వానకాలం సీజన్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ, బ్యాంకింగ్‌, నాబార్డు అధికారులతో కూడిన టెక్నికల్‌ గ్రూప్‌ కమిటీ(టీజీసీ) సమావేశమై, విత్తనాలు, ఎరువు లు, కూలీలు, ఇతర పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని ఏ పంటకు ఎంత రుణం అవసరం ఉంటుం దో పరిశీలించి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను నిర్ణయిస్తుంది. ఈ లెక్కన గతేడాదికంటే ఈ యేడాది ఒక్కో పంటపై వెయ్యి నుంచి 2 వేల వరకు రుణ పరిమితిని పెంచారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి పంటకు గతేడాది 32వేల నుంచి 34 వేలు నిర్ణయించగా ఈ సారి 34వేల నుంచి 35వేలకు పెంచారు. పత్తిపై గతేడాది వర్షాధారం కింద 31వేల నుంచి 33 వేలు నిర్ణయించగా, ఈ సారి 33వేల నుంచి 35 వేలకు పెంచారు. నీటి పారుదల కింద గతేడాది 34వేల నుంచి 36 వేలు ఉండగా, ఈ సారి 35వేల నుంచి 37 వేలకు పెంచారు. ఇలా ఉమ్మడి జిల్లాలో సాగయ్యే 21 పంటలకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేశారు. జగిత్యాల, మెట్‌పల్లి ప్రాంతాల్లో ఎక్కువగా సాగయ్యే చెరుకు, పసుపు పంటలపైనా ఈసారి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వెయ్యి నుంచి 2 వేలకు పెంచారు. గతేడాది వరి, మక్క విత్తనోత్పత్తి సాగు చేసిన రైతులకు కూడా స్కేల్‌ ఫైనాన్స్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సారి చేయలేదు. ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న టమాటకు ఈ సారి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌లో చోటు దక్కింది. గతంలో ఈ పంటను కూరగాయల సాగు కిందనే చూపేవారు. ఇప్పుడు ప్రత్యేక పంటగా నిర్ణయించారు.

బ్యాంకర్లు అమలు చేసేనా..?

ఏటా టీజీసీ కమిటీ సిఫారసులను బ్యాంకర్లు సులువుగా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. నాలుగైదు ఎకరాలున్న రైతు తన క్షేత్రంలో కనీసం రెండు మూడు రకాల పంటలు సాగు చేస్తారు. కానీ, బ్యాంకర్లు మాత్రం బల్క్‌గా కొంత మొత్తాన్ని రుణంగా కట్టబెడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఐదెకరాలు ఉన్న రైతు మూడెకరాల్లో వరి సాగు చేస్తే ఇప్పటి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారంగా గరిష్ఠంగా 1.05 లక్షలు రుణంగా ఇవ్వాల్సి ఉంటుంది. మరో రెండెకరాల్లో పత్తి సాగు చేస్తే గరిష్ఠం 74 వేలు ఇవ్వాలి. ఈ విధంగా రుణాలు ఇచ్చినప్పుడే రైతులపై పెట్టుబడి భారం పడకుండా ఉంటుంది. కానీ, బ్యాంకర్లు మాత్రం బల్క్‌గా 50వేల నుంచి లక్షకు మించి రుణాలు ఇవ్వడం లేదు. అవగాహన లేని రైతులు బ్యాంకర్లు ఇచ్చిందే మహాభాగ్యమన్నట్లు తీసుకుని వెళ్లి పెట్టుబడులు సరిపోక అప్పులు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు 10 వేల చొప్పున అందిస్తున్న నేపథ్యంలో రైతులకు కొంత ఊరట లభించింది. ఈ పథకం లేకుంటే రైతులు పూర్తిగా బ్యాంకు రుణాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. అయితే పంట రుణాలు తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ రైతులు తీసుకెళ్లడం లేదని కొందరు బ్యాంకర్లు వాదిస్తున్నారు. ఏదేమైనా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రతి బ్యాంకులో ఏ పంటకు ఎంత రుణం ఇస్తారో బోర్డులు ప్రదర్శించాలనే నిబంధనను కూడా బ్యాంకులు పాటించడం లేదు. అయితే ఈసారి స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పక్కాగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. 

పూర్వ జిల్లా పరిధిలో అమలు

ప్రతి వానకాలం సీజన్‌లో నిర్ణయించే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను పూర్వ కరీంనగర్‌ జిల్లా పరిధిలో అమలు చేస్తారు. ఇందులో కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లతోపాటు కరీంనగర్‌ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శాఖలు ఉన్న సిద్దిపేట జిల్లా పరిధిలోని బెజ్జంకి, కోహెడ, హుస్నాబాద్‌, అక్కన్నపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లా పరిధిలోని కమలాపూర్‌, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, భూపాలపల్లి జిల్లా పరిధిలోని కాటారం, మహదేవపూర్‌, ముత్తారం, తదితర మండలాల్లో వానకాలం, యాసంగి సీజన్లకు అమలు చేయాల్సి ఉంటుంది. 

రైతులు అవగాహన పెంచుకోవాలి..

స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌పై రైతులు అవగాహన పెంచుకోవాలి. ఏ పంట సాగు చేస్తున్నారో అదే పంటపై బ్యాంకుల్లో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణం తీసుకోవాలి. సాంకేతిక కమిటీ నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను అన్ని జిల్లాల కలెక్టర్లకు నివేదించాం. దీని ప్రకారం రుణాలు ఇవ్వాలని కలెక్టర్లు కూడా బ్యాంకర్లకు ఆదేశాలు ఇచ్చారు. నిబంధనల ప్రకారం ప్రతి సంవత్సరం నిర్ణయించే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌లో ఏ పంటకు ఎంత రుణం ఇస్తారనే విషయాన్ని అన్ని బ్యాంకుల శాఖల్లో ప్రదర్శించాలి. ఈ మేరకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ముఖ్యంగా రైతులు అవగాహన పెంచుకుంటే మంచిది. రుణం తీసుకున్న పంట వివరాలను బ్యాంకుల్లో నమోదు చేయించుకుంటేనే ఫసల్‌ బీమా వర్తిస్తుంది. ఒక పంటకు రుణం తీసుకుని మరో పంట నమోదు చేస్తే రైతులు నష్టపోతారు. - వాసిరెడ్డి శ్రీధర్‌, డీఏవో (కరీంనగర్‌)logo