శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 16, 2020 , 00:17:19

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

n   తల్లిదండ్రుల మృతితో   అనాథగా మారిన బాలుడు

చిగురుమామిడి: తల్లిదండ్రుల మృతితో పదేండ్ల బాలుడు అనాథగా మారాడు. ఆలనాపాలనా చూస్తున్న నానమ్మ సైతం వృద్ధాప్యంలో ఉండడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. మండలంలోని రామంచ గ్రామానికి చెందిన కన్నం హన్మంతుకు చిగురుమామిడికి చెందిన అనితతో 2009 మేలో వివాహం జరిగింది. పుట్టుకతో మూగవాడైన హన్మంతు 20 ఏండ్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంపుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగగా, తరుణ్‌ (10) పుట్టిన అనంతరం ఏడాదికే తల్లి అనిత అనారోగ్యంతో మృతిచెందడంతో వృద్ధురాలైన హన్మంతు తల్లి రాజవ్వ కొడుకు, మనువడి మంచిచెడులను చూసుకున్నది. ఇటీవల హన్మంతు అస్వస్థతకు గురై శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందగా, అతడి కుమారుడు తరుణ్‌తో పాటు తల్లి రాజవ్వ దిక్కులేని వారయ్యారు. కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో గ్రామ పంచాయతీ  తరఫున రూ.5వేలు, ఉప సర్పంచ్‌ కిషన్‌రెడ్డి రూ.3వేలు ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. తరుణ్‌ హుస్నాబాద్‌లోని ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి పూర్తిచేశాడు. తల్లిదండ్రులను కోల్పోయిన బాలుడితోపాటు వృద్ధురాలైన రాజవ్వను దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. 


logo