బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 15, 2020 , 01:33:18

కాంగ్రెస్‌ దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు

కాంగ్రెస్‌ దొంగ దీక్షలను ప్రజలు నమ్మరు

కార్పొరేషన్‌: ప్రాజెక్టుల పేరిట కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దొంగ దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని నగర మేయర్‌ వై సునీల్‌రావు పేర్కొన్నారు. నగరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేసింది కాంగ్రెస్‌ పార్టీనేనని ధ్వజమెత్తారు. 60 ఏళ్ల పాలనలో గోదావరి నీటిని వినియోగంలోకి తీసుకురాలేని దద్దమ్మలు కాంగ్రెస్‌ నాయకులన్నారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడమే వారికి తెలుసన్నారు. గతంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పని చేసిన వారు ఎందుకు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయించలేకపోయారని ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు 70 నుంచి 80 శాతం పూర్తి చేసి, మిగతా వాటిని వదిలేశారని ఆరోపించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి డబ్బులు దండుకున్నారని, మధ్యమానేరు ప్రాజెక్టు మట్టి కట్టలు కట్టి అడ్వాన్సుల పేరుతో కాంగ్రెస్‌ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో కష్టపడి రికార్డు స్థాయిలో ప్రాజెక్టులను పూర్తి చేసి వేసవిలోనూ చెరువులు, కుంటలు నింపి సాగు, తాగునీటి కష్టాలు తీర్చితే, చూడలేక కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ తమను ప్రజలు మరిచిపోతారోనని దొంగ దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అధికారంలో ఉన్నప్పుడు వారి నాన్న పేరు పెట్టిన ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయించుకోలేదో చెప్పాలన్నారు.

వైఎస్‌ఆర్‌ హయాంలో ఎగువ మానేరు వద్ద పునాదిరాయి వేస్తే అధికారంలో ఉండి ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 180 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో సాగు, తాగునీరు అందిస్తున్నారని, రైతులంతా సంతోషంగా ఉంటే కాంగ్రెస్‌ నాయకులు చూడలేకపోతున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తే రైతులు సహించే పరిస్థితిలో లేరన్నారు. పొన్నం ప్రభాకర్‌ అధికారంలో ఉండి కూడా కరీంనగర్‌లోని ప్రాజెక్టులను పూర్తి చేయించలేదని విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండి పని చేసే పార్టీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు చల్ల హరిశంకర్‌, కార్పొరేటర్లు చాడకొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్‌, నాంపెల్లి శ్రీనివాస్‌, వాల రమణారావు, ఐలేందర్‌, అంజన్న, జయశ్రీ, నాయకులు చంద్రమౌళి, ప్రశాంత్‌ పాల్గొన్నారు. 


logo